కడప కార్పొరేషన్: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై), ఎన్టీఆర్ నగర్ హౌసింగ్ స్కీం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘అందరికీ ఇళ్లు’ పథకంలో ఇళ్ల కేటాయింపు కార్యక్రమం టీడీపీ ప్రచార సభను తలపించింది. స్థానిక సరోజినీ నగర్ వద్ద నిర్మించిన ఎన్టీఆర్ నగర్‌లో 516 మంది లబ్ధిదారులకు సోమవారం కంప్యూటర్ ద్వారా డిప్ పద్ధతిలో ప్లాట్లను కేటాయించారు. కడప నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి డిప్యూటీ మేయర్ అరీఫుల్లా, 10వ డివిజన్ కార్పొరేటర్ అందూరి రాజగోపాల్‌రెడ్డి మినహా ప్రొటోకాల్ ఉన్న ఏ ఒక్క ప్రజా ప్రతినిధి కూడా హాజరు కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సొమ్ముతో పేదలకు నిర్మించిన ఇచ్చిన ఇళ్లను ఎలాంటి అర్హత, హోదా లేని టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్. శ్రీనివాసులరెడ్డితో పంపిణీ చేయించడంపై విమర్శలువ్యక్తమయ్యాయి.
వేదికంతా టీడీపీ నాయకులే పంచుకోవడంతో కమిషనర్ మినహా ఏ ఒక్క అధికారికి కుర్చీ కూడా మిగల్లేదు. టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి వికాస్ హరి మాట్లాడుతూ లబ్ధిదారులంతా టీడీపీ సైకిల్ గుర్తుకు ఓటేసి రుణం తీర్చుకోవాలని పిలుపునివ్వడంపై సభికులంతా విస్మయం వ్యక్తం చేశారు. కేంద్రం 1.50లక్షలు.రాష్ట్ర ప్రభుత్వ 1.50లక్షలు సబ్సిడీ ఇస్తుండగా.. టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్. శ్రీనివాసులరెడ్డి మాత్రం మొత్తం రూ. 3లక్షలు రాష్ట్ర ప్రభుత్వమే భరించిందని చెప్పడం గమనార్హం. డిప్యూటీ మేయర్ అరీఫుల్లా మాట్లాడుతూ ఈ ఇళ్లు వంద ఏళ్లు చెక్కుచెదరకుండా ఉంటాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ డబ్బు చెల్లించి ప్లాట్లు సొంతం చేసుకోవాలని కోరారు.
గేటెడ్ కమ్యునిటీ తరహాలో అభివవృద్ధి – కమిషనర్
గేటెడ్ కమ్యునిటీ తరహాలో ఎన్టీఆర్ నగర్లో సదుపాయాలు కల్పిస్తామని కమిషనర్ ఎస్. లవన్న తెలిపారు. కింది ఫ్లోర్‌లో ఇళ్లు కావాలని ఎవరూ సిఫారసులు తీసుకురావద్దని, అక్కడ అంధులు, వికలాంగులకు కేటాయిస్తున్నామని చెప్పారు. 60 శాతం వైకల్యం ఉన్న వారికి గ్రౌండ్ ఫ్లోర్‌లో ఇళ్లు కేటాయిస్తామన్నారు.అనంతరం కంప్యూటర్ పద్దతిలో మూడు కేటగిరీల ఇళ్లను డిప్ పద్దతిలో కేటాయించారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రం«థాలయ సంస్థ ఛైర్మెన్ అందూరి రాంప్రసాద్‌రెడ్డి, టీడీపీ నాయకులు మన్‌మోహన్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, బాలకొండయ్య, బర్కతుల్లా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment