పింఛన్ పాట్లు ఎప్పుడొస్తుందో! | When did come pension ? | Sakshi
Sakshi News home page

పింఛన్ పాట్లు ఎప్పుడొస్తుందో!

Published Tue, Jul 15 2014 1:32 AM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM

పింఛన్ పాట్లు ఎప్పుడొస్తుందో! - Sakshi

పింఛన్ పాట్లు ఎప్పుడొస్తుందో!

2.47 లక్షల మంది ఎదురు చూపరు
పండుటాకులపై కనికరం చూపని ప్రభుత్వం
అర్ధనెల దాటుతున్నా అందని పింఛన్
అక్టోబరు నుంచి ఐరిస్
ఆధారంగా పంపిణీకి చర్యలు
వేలిముద్రలు సరిపోని
లబ్ధిదారులకు నిలుపుదల
పింఛన్ కోసం ఎదురుచూస్తున్న 2.47 లక్షల లబ్ధిదారులు

 
పండుటాకుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది. పింఛన్ కోసం కళ్లుకాయలు కాసేలా ఎదురు చూస్తున్నా పాలకులకు కనికరం కలగడం లేదు. ఏ ఆదరువూ లేక సర్కారు ఇచ్చే పింఛన్‌పై ఆధారపడి బతుకు వెళ్లదీసే వృద్ధుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. సగం నెల గడిచిపోయినా పింఛన్ అందక కొందరు అవస్థలు పడుతుంటే.. వేలిముద్రలు సరిపోలేదంటూ మరికొందరి పేర్లు
 లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
 

ఏ ఆధారం లేకుండా కేవలం పింఛన్‌పై ఆధారపడి జీవితం వెల్లదీస్తున్న పండుటాకులపై పాలకులు కనీసం కనికరం చూపడం లేదు. ఒకరోజు కాదు...రెండు రోజులు కాదు...ఏకంగా సగం నెల గడిచిపోతున్నా పింఛన్ అందించాలనే ఆలోచన అధికారులకు కలగడం లేదు. ఎందుకివ్వలేదని అడిగే వారు లేరు... ఫలానా సమయంలో ఇస్తామని కచ్చితంగా చెప్పే అధికారులూ కనిపించడం లేదు. వెరసి జిల్లాలో జూన్ నెల పింఛన్ ఇంతవరకు పంపిణీ చేయకపోవడంతో లబ్ధిదారులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. జిల్లాకు సంబంధించి ఐసీఐసీఐ, సినో సంస్థలు గత కొన్ని నెలలుగా పింఛన్ పంపిణీ చేస్తున్నాయి. అయితే జూన్ నెలకు సంబంధించి జులై 1 నుంచి 5వ తేదీలోగా పంపిణీ చేయాల్సి ఉన్నా ఇంతవరకు పంపిణీకి నోచుకోలేదు. పండుటాకుల కష్టాలపై అధికారులు దృష్టి సారించి పింఛన్ అందించేందుకు చర్యలు చేపట్టాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

వేలి ముద్రలు సరిపోలేదని పలువురికి నిలుపుదల

జిల్లాలో 2 లక్షల 47వేల 592 మంది పింఛన్ లబ్ధిదారులు ఉండగా, ఇందులో కొంతమందికి ఎన్నికల సమయంలో వరుసగా మూడు నెలలు పింఛన్ అందలేదు. కారణం ఫింగర్ ప్రింట్ (వేలిముద్రలు) మ్యాచ్ కాలేదని కంపెనీ ప్రతినిధులు పింఛన్‌ను నిలిపి వేశారు. వారందరికీ గతనెల 25వ తేదీ నుంచి 28వ తేదీ వరకు పంపిణీ చేశారు. అయితే ఇప్పటికీ చాలామంది లబ్ధిదారుల వేలిముద్రలు సరిపోకపోవడంతో పింఛన్ నిలుపుదల చేశారు. దాదాపు వారందరి పేర్లను కూడా లబ్ధిదారుల జాబితాలో నుంచి తొలగించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీన్నిబట్టి పండుటాకులతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని స్పష్టమవుతోంది.

జిల్లా వ్యాప్తంగా పంపిణీ కాని పింఛన్

జిల్లా వ్యాప్తంగా 2 లక్షల 47 వేల 592 మంది లబ్ధిదారులు ఉండగా, అందులో వృద్ధులు 1 లక్ష 25 వేల 907 మంది ఉండగా, వికలాంగులు 30 వేల 781, వితంతువులు 65 వేల 699, అభయహస్తం కింద 16 వేల 316 మంది, చేనేత 8 వేల 869, కల్లుగీత కార్మికులు 20 మంది పింఛన్ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రతిరోజు సంబంధిత మండల కేంద్రాల్లోని కార్యాలయాల వద్దకు వెళ్లి నిరీక్షించడం తప్ప పింఛన్ తీసుకున్న పాపాన పోలేదు. మున్సిపల్ కార్యాలయాలకు కూడా ప్రతిరోజు పింఛన్ దారులు వస్తున్నారు. అయితే, ఇప్పటికే ఒక్కొక్క లబ్ధిదారుడు మూడు, నాలుగుసార్లు వచ్చి వెళ్లారు. వీరికి ఆటో ఛార్జీలు దాదాపు రూ. 50-60 అవుతుండటంతో పింఛన్‌లో సగం సొమ్ము దీనికే పోతోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
పింఛన్ పంపిణీకి కసరత్తు
 
జిల్లాలో ఇప్పటికే పింఛన్ పంపిణీ జరగక 15 రోజులు కావస్తున్న నేపథ్యంలో సోమవారమే కొంత మొత్తం ప్రభుత్వం నుంచి జిల్లా కార్యాలయానికి అందింది. దీంతో జిల్లాలోని లబ్ధిదారులకు సత్వరమే పింఛన్ పంపిణీ చేస్తారనే ఆశాభావం వ్యక్తమవుతోంది.
 
అక్టోబరు నుంచి ఐరిస్ ద్వారా పంపిణీకి చర్యలు
 
ప్రస్తుత సీఎం చంద్రబాబు పింఛన్‌ను పెంచుతామని మేనిఫెస్టోలో పేర్కొన్నా అది అక్టోబరు నుంచి అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటూనే వీలైనంత మేర లబ్ధిదారులను తగ్గించే చర్యలకు ఉపక్రమించారు. ప్రస్తుతం ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ కాలేదంటూ లబ్ధిదారుల పింఛన్‌కు ఎగనామం పెడుతున్న అధికారులు అక్టోబరు నుంచి ఐరిస్ మ్యాచ్ అయితేనే పింఛన్ ఇచ్చే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిసింది. అదికూడా ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ కాకుంటే ఐరిస్ ఖచ్చితంగా సరిపోయే విధంగా రూపకల్పన చేస్తున్నారు. ఐరిస్, ఫింగర్ ప్రింట్స్ రెండింటిలో ఏది మ్యాచ్ కాకపోయినా లబ్ధిదారుడి పేరు పింఛన్ జాబితాలో కనుమరుగు కావడం ఖాయం. ఒకవేళ ఎవరైనా ఆస్పత్రిలో ఉండి రాలేని పరిస్థితి ఉంటే ఒక మెసెంజర్‌కు సంబంధించి కూడా ఫింగర్ లేదా ఐరిస్ పరీక్షలు పెట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement