ప్రొద్దుటూరు, న్యూస్‌లైన్: ప్రభుత్వం అమలు చేస్తున్న మార్పు కార్యక్రమం ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. 12వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా మాతా, శిశుమరణాలను నివారించేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
కొన్నేళ్లుగా తీసుకుంటున్న పలు రకాల కార్యక్రమాల వలన మహిళలు, పిల్లల ఆరోగ్యం, పోషణ స్థాయిలలో అభివృద్ధి కనిపిస్తున్నప్పటికీ మాతృమరణాల రేటు లక్షకు 134, శిశుమరణాల రేటు 46గానే ఉంది. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ద్వారా అనుబంధ పోషకాహారం, ఆరోగ్య, పోషక విద్యా కార్యక్రమాలు 35 ఏళ్లుగా చేపడుతున్నప్పటికీ ఇంకా 19.4 శాతం పిల్లలు తక్కువ బరువుతో పుడుతున్నట్లు ప్రభుత్వం నిర్ధారించింది.
మరో 37 శాతం మంది మూడేళ్లలోపు వయసు పిల్లలు ఉండవలసిన బరువు కంటే తక్కువగా ఉండటంతో పాటు 56 శాతం మంది గర్భిణీలు రక్తహీనతకు గురవుతున్నారు. మాతృ, శిశుమరణాలు ఎక్కువగా ఉండటానికి పోషకాహర లోపమే ప్రధాన కారణం. ఇందుకోసం మార్పు కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ‘మార్పు’లో భాగంగా ప్రధానంగా 20 లక్ష్యాలను నిర్దేశించారు.
ప్రతి నెల అధికారులు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నాలుగు మార్లు సమావేశాలను నిర్వహించేందుకు ప్రణాళికలు తయారు చేశారు. ప్రతినెల తొలి మంగళవారం ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో, రెండో మంగళవారం క్లస్టర్ పరిధిలో, మూడవ మంగళవారం జిల్లా స్థాయిలో, 4వ మంగళవారం గ్రామ స్థాయిలో సమీక్షా సమావేశాలను నిర్వహిస్తారు. జిల్లాలో మొత్తం 14 క్టస్లర్లు ఉండగా వీటిలో జరిగే సమావేశాలకు క్లస్టర్ సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్, ఆయా పీహెచ్‌సీల డాక్లర్లు, మెడికల్ సూపరింటెండెంట్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు, సీడీపీఓ, సెర్ప్ ఏపీఎం, మండల మహిళా సమాఖ్య ప్రతినిధులు, ఏరియా కోఆర్డినేటర్లు హాజరు కావాలి.
జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన జరిగే సమావేశానికి డీఎంహెచ్‌ఓ కన్వీనర్‌గా, ఐసీడీఎస్ పీడీ కో కన్వీనర్‌గా, మెంబర్లుగా జిల్లా జాయింట్ కలెక్టర్, జిల్లాలోని ఆయా క్లస్టర్లకు సంబంధించిన కన్వర్జెన్సీ ఆఫీసర్లు, ఆర్‌ఓఎంపీఓ, జెడ్పీ సీఈఓ, ఎస్‌ఈ పీఆర్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ తదితరులు పాల్గొనాల్సి ఉంది. అయితే ఈ సమావేశాలకు సగం మంది అధికారులు కూడా హాజరు కావడం లేదని సమాచారం. సీడీపీఓలు అసలు రావడం లేదని తెలుస్తోంది. దీంతో ఈ కార్యక్రమం ఆచరణలో సక్రమంగా అమలు కావడం లేదు.
ఈమె పేరు సరస్వతి. నెలలు నిండిన ఈమెకు ఇంతవరకూ ప్రభుత్వం నుంచి ఎలాంటి పోషకాహారం అందలేదు. పోషకాహారం ఎక్కడికెళ్లి తెచ్చుకోవాలో తెలీదని అమాయకంగా చెబుతోంది.
ఈమె పేరు బత్తల నాగేశ్వరి. ఈమెకు ప్రస్తుతం మూడో సంతానం. బాలింతగా ఉన్న ఈమెకు ఎలాంటి పోషకాహారం అందడం లేదు.
ఏదీ మార్పు
Published Thu, Nov 28 2013 3:01 AM | Last Updated on Sat, Sep 2 2017 1:02 AM
Advertisement
Advertisement