
నిధులేవీ?
సాక్షి ప్రతినిధి, అనంతపురం : ‘సింగడు అద్దంకి వెళ్లనూ వెళ్లాడు.. రానూ వచ్చాడు’ అన్న చందంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల జిల్లా పర్యటన సాగింది. మరో ఐదేళ్లు తమకు తిరుగు లేదన్న తీరు, అధికార దర్పం అడుగడుగునా తొణికిసలాడుతూ... విపక్షాలపై అసందర్భ ప్రేలాపనలే కాదు.. లక్షన్నరకు మించి అప్పులున్న రైతులనూ దొంగలుగా వ్యాఖ్యానిస్తూ సాగిన బాబు పర్యటన సామాన్యుల్లో తీవ్ర నిరాశనే మిగిల్చింది.
జిల్లాను పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్యల పరిష్కారానికి నిర్దిష్ట హామీలను ఆశించిన జిల్లా ప్రజలకు చంద్రబాబు పర్యటనలో సమాధానాలు లభించలేదు. ప్రజలకే కాదు.. జిల్లాలోని తెలుగుదేశం కార్యకర్తల్లో కూడా అసంతృప్తే మిగిలింది. తనకు కార్యకర్తలే ముఖ్యమని, వారి తర్వాతే ప్రజలైనా.. నాయకులైనా అని చంద్రబాబు వేదికల మీద మాట్లాడారు కానీ.. రెండు రోజుల తన పర్యటనలో ప్రత్యేకంగా కార్యకర్తలకు సమయం కేటాయించలేదు. పుట్టపర్తిలో గురువారం దిగింది మొదలు.. ముదిగుబ్బలో హెలికాప్టర్ ఎక్కేవరకూ ఆద్యంతం చంద్రబాబు పర్యటన ‘అధికార దర్పాన్ని’ ఒలికిస్తూ సాగింది.
ప్రధాన డిమాండ్ల ప్రస్తావనేదీ?
రాష్ట్ర పునర్విభజనలో భాగంగా కేంద్రం 14 జాతీయ సంస్థలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. వీటిలో ఎయిమ్స్, ఐఐటీలను జిల్లాలో నెలకొల్పాలన్న డిమాండ్ గురించి చంద్రబాబు ఒక్కమాటా మాట్లాడలేదు. ఎయిమ్స్‌కు బదులు అనంతపురంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తామన్నారు. వాస్తవంగా నగరంలోని 500 పడకల ఆస్పత్రిని 1000 ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేసేందుకు గతంలోనే అనుమతులు ఉన్నాయి. అప్పటి ఎంపీ అనంత వెంకట్రామి రెడ్డి ఇందు కోసం కృషి చేశారు.
ఈ విషయంలో ఇప్పుడు చంద్రబాబు అదనంగా చేసేదేమీ లేదు. ఇక అనంత వెంకట్రామిరెడ్డి హంద్రీ నీవా సుజల స్రవంతి రెండో దశ పనులు నిర్దిష్ట కాల పరిమితితో పూర్తి చేయాలన్న రైతుల డిమాండ్‌పై కూడా చంద్రబాబు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేస్తామన్నారే కానీ ఎప్పటి లోపు పూర్తి చేస్తారో స్పష్టత ఇవ్వలేదు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు నిర్లక్ష్యాన్ని ఆయన తొమ్మిదేళ్ల పాలనలో చవిచూసిన జిల్లా ప్రజలకు హంద్రీనీవా పూర్తవుతుందా అన్న అనుమానం పట్టి పీడిస్తూనే ఉంది. గత ఖరీఫ్‌లో పంట నష్టపోయిన రైతులకు చెల్లించాల్సిన రూ.640 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ ఎప్పుడిస్తారో చెప్పలేదు. గత ప్రభుత్వంలో జిల్లా సమగ్రాభివృద్ధి కోసం రూ.7,400 కోట్లతో ‘ప్రాజెక్ట్ అనంత’కు శ్రీకారం చుట్టారు.
ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రణాళికా సంఘం అనుమతులు కూడా లభించాయి. ఇప్పుడు ఆ ప్రాజెక్టు భవితవ్యం ఏమిటన్నది చంద్రబాబు మాట మాత్రంగా కూడా చెప్పలేదు. రుణాల రీ షెడ్యూలో... రుణ మాఫీనో.. ఏదైనా కానీయండి.. ఈ సీజన్‌లో రైతులకు కొత్త రుణాలు ఎప్పటి నుంచి ఇస్తారో కూడా ఆయన ప్రకటించలేదు. ఇలా ప్రధాన సమస్యలన్నింటినీ దాటవేస్తూ ఊకదంపు ఉపన్యాసాలతో రెండు రోజుల పర్యటన కానిచ్చేశారు.
స్టేజ్‌షోగానే మిగిలిన ‘ముఖా..ముఖి’
గురువారం మహిళా సంఘాల మహిళలతో చంద్రబాబు సంభాషించే కార్యక్రమం కానీ, శుక్రవారం ముదిగుబ్బలో రైతులు, చేనేత కార్మికులతో ముచ్చటించే కార్యక్రమం గానీ కేవలం స్టేజ్ షోగానే మిగిలిపోయింది.
శుక్రవారం రైతులతో ముఖాముఖి ‘స్పిరిటే’ లేకుండా పోయింది. చంద్రబాబుతో సహా వేదికపై నేతలందరూ ఊకదంపుడు ఉపన్యాసాలకే పరిమితమయ్యారు కానీ.. నేరుగా రైతులతో సంభాషించే ప్రయత్నం కూడా చేయలేదు. జిల్లా అధికారులు ఎంపిక చేసిన ముగ్గురు, నలుగురు రైతులను స్టేజి మీదకు పిలిపించి మాట్లాడించారు. వారు కూడా చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తారు. అధికారులు ఎంత నేర్పినా రైతులు కదా... వారి సమస్యలను చంద్రబాబుకు విన్నవించారు. ఒక మహిళా రైతు ‘జిల్లాలో డ్రిప్ పరికరాలు ఇస్తున్నారు. వాటి కాలపరిమితి ఐదేళ్లుగా పేర్కొంటున్నారు.
అయితే నీటిలోని లవణాల కారణంగా రెండు మూడేళ్లకే డ్రిప్ పైపుల్లో రంధ్రాలు మూసుకుపోయి పనికి రాకుండా పోతున్నాయి. అధికారులేమో ఒక సారి ఇచ్చిన వారికి మళ్లీ సబ్సిడీ ఇవ్వడం లేదు. స్ప్రింక్లర్ల పరిస్థితి కూడా అలాగే ఉంది. కాబట్టి మూడేళ్ల క్రితం డ్రిప్ పరికరాలు తీసుకున్న రైతులకు మళ్లీ సబ్సిడీపై డ్రిప్ పరికరాలు ఇచ్చేలా చర్యలు తీసుకోండని’ విన్నవించారు. రైతులతో ముఖాముఖిలో అడిగిన ఈ చిన్న విన్నపానికి కూడా చంద్రబాబు తన ప్రసంగంలో నిర్దిష్టమైన హామీ ఇవ్వలేదు. ఆయన ప్రసంగం ఆద్యంతం ‘మహిళలను లక్షాధికారులను చేస్తా.. వ్యవసాయాన్ని లాభసాటి చేస్తా.. ఇజ్రాయెల్ టెక్నాలజీ.. కోల్డ్ స్టోరేజిలు.. ప్రాసెసింగ్ సెంటర్లు తీసుకొస్తా’ అంటూ పెద్ద పెద్ద మాటలతోనే సాగింది.
వయ్యారి భామ.. వైరస్
వ్యవసాయం గురించిన ప్రాథమిక అంశాలపై తనకు ఎంత అవగాహన ఉందో చంద్రబాబు తన ప్రసంగంలో బయటపెట్టుకున్నారు. ఆయన తన ప్రసంగంలో ‘ఈ జిల్లాలో మూడు నాలుగేళ్ల క్రితం వయ్యారి భామ వైరస్ తెగులు వల్ల వేరుశనగ పంటకు తీవ్రమైన నష్టం జరిగింది. అలాంటి వైరస్‌ను అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోమని ఇప్పుడే కలెక్టర్‌ను ఆదేశించా’అని అన్నారు.
చంద్రబాబు వయ్యారి భామను వైరస్‌గా పేర్కొంటుంటే సమావేశానికి వచ్చిన రైతులు ముఖాలు చూసుకోవాల్సి వచ్చింది. వాస్తవానికి వయ్యారి భామ అనేది ఓ మొండి కలుపు మొక్క. ఈ కలుపును అరికట్టడం రైతులకు శక్తికి మించిన పనిగా ఉంది. ఏది కలుపు మొక్కో... ఏది వైరస్ తెగులో తెలీయకుండా చంద్రబాబు మాట్లాడుతున్నా వేదిక మీద ఉన్న ఎవ్వరూ ఆయన మాటలను సరిచేసే ప్రయత్నం కూడా చేయకపోవడం విశేషం.
రాజును మించిన రాజభక్తి
జిల్లా మంత్రులు పోటీపడి మరీ చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తారు. పల్లె రఘునాథ రెడ్డి మాట్లాడుతూ ‘రుణాలను మాఫీ చేసిన చంద్రబాబు రుణాన్ని రైతు, డ్వాక్రా మహిళలు ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేరు’ అని అన్నారు. 12 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలను ఇచ్చిన జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబుకు సదా రుణపడి ఉంటామని జిల్లా ప్రజలందరి తరఫునా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
మరో మంత్రి పరిటాల సునీత తన ప్రసంగంలో ‘మహిళా రుణాలు మాఫీ చేసిన చంద్రబాబుకు ప్రాణం ఉన్నంత వరకూ రుణపడి ఉంటామని’ జిల్లా మహిళల తరఫున వకాల్తా పుచ్చుకుని మాట్లాడారు. రాజుగారిని పొగడటంతోనే తమ బాధ్యత తీరిపోలేదని.. పనిలోపనిగా ప్రతిపక్ష నేత జగన్‌పై కూడా మంత్రులిద్దరూ విమర్శలు గుప్పిస్తూ.. ఆ రకంగా ముందుకెళ్లారు. మంత్రుల తీరు చూసి.. ఒక్కటంటే ఒక్క హామీ సీఎం దృష్టికి తీసుకెళ్లి.. ఇది ‘అనంత’ జనం కోసం చేయాల్సిందే అని అడిగిన పాపాన పోలేదంటూ ఆ పార్టీ కార్యకర్తలే గుసగుసలుపోయారు.
కంగుతిన్న కామ్రేడ్లు
చంద్రబాబు జిల్లా పర్యటన సందర్భంగా సీపీఐ నేతలు అనంతపురం బంద్‌కు పిలుపు ఇచ్చారు. జిల్లా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిర్దిష్ట హామీలను కోరుతూ వారు ఆందోళన చేపట్టారు. అయితే, జిల్లా టీడీపీ నేతలు సీపీఐ వారితో మాట్లాడి, జిల్లా అభివృద్ధికి సంబంధించి మీ డిమాండ్లను చంద్రబాబుకు విన్నవించే అవకాశం కల్పిస్తాం. సీపీఐ ప్రతినిధి బృందాన్ని చంద్రబాబు వద్దకు తీసుకెళ్లి నేరుగా మాట్లాడిస్తాం అని హామీ ఇచ్చి వారిచేత బంద్ పిలుపును విరమింపచేశారు. అయితే రెండు రోజుల పర్యటనలో సీపీఐ వారికి చంద్రబాబుతో మాట్లాడే అవకాశం అటుంచి.. ఆ పరిసరాలకు కూడా వారిని అనుమతించలేదు. మమ్మల్ని ఇంత మోసం చేస్తారా అని కామ్రేడ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. ‘ఈ సీపీఐ వారికి చారిత్రక తప్పిదాలు చేయడం అలవాటే. తెలుగుదేశం వారి మాటలు నమ్మి ఆందోళన విరమించుకోవడం అంత మూర్ఖత్వం ఇంకోటుంటుందా’ అని జిల్లా ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.