అమరావతి జీఎస్‌టీ జోన్ ఎక్కడ?
అమరావతి: జీఎస్‌టీని అట్టహాసంగా ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం దాన్ని అమలు చేయడంలో మాత్రం విఫలమవుతోంది. జీఎస్‌టీ అమల్లోకి వచ్చి మూడు రోజులు దాటినా రాష్ట్రంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (సీబీఈసీ) వ్యవస్థ పూర్తిస్థాయిలో ఏర్పాటుకాలేదు. రాజధాని అమరావతి కేంద్రంగా జీఎస్‌టీ అమరావతి జోన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు జూన్ 16నే సీబీఈసీ నోటిఫికేషన్ జారీ చేసినా ఇంతవరకూ ఏర్పాటు కాలేదు. ఇప్పటివరకూ విశాఖపట్నం కేంద్రంగా చీఫ్ కమిషనర్ నేతృత్వంలో కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ అండ్ సర్వీస్ ట్యాక్స్ విభాగం పని చేసేది.
జీఎస్‌టీ అమలుకు విశాఖలోని చీఫ్ కమిషనరేట్ కార్యాలయాన్ని రద్దుచేసి దానిస్థానంలో జీఎస్‌టీ అమరావతి జోన్‌ను ఏర్పాటు చేశారు. అమరావతి కేంద్రంగా పనిచేసే ఈ జీఎస్‌టీ జోన్ కింద తిరుపతి, గుంటూరు, విశాఖపట్నం కమిషనరేట్లతో కలిసి మొత్తం 113 రేంజ్‌లుంటాయి. అమరావతి జీఎస్‌టీ జోన్‌ను ఇంకా ఎక్కడ ఏర్పాటు చేయాలన్నదానిపై స్పష్టత రాకపోవడం ఉద్యోగుల్లో గందరగోళానికి తెరతీస్తోంది.
విశాఖ కమిషనరేట్ కార్యాలయంలో పనిచేసే 256 మంది ఉద్యోగుల్లో చాలామంది అమరావతి రావడానికి సుముఖంగా లేరు. దీంతో దీనికి రాజకీయరంగు పులుముతున్నారు. విశాఖలో ఉన్న కేంద్ర సంస్థను అమరావతికి తరలించడంపై వీరు అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్థానిక ప్రజాప్రతినిధులను కలుస్తున్నారు. ఇదే సమయంలో రాజధాని ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులూ ప్రధాన కార్యాలయం అమరావతిలోనే ఉండాలంటున్నారు.
చీఫ్ కమిషనరేట్ కూడా లేరు: అమరావతి జోన్‌ను ప్రకటించినా ఇంతవరకూ దీనికి చీఫ్ కమిషనర్‌ను కూడా నియమించలేదు. ప్రస్తుతం హైదరాబాద్‌కు చెందిన చీఫ్ కమిషనర్ సందీప్ భట్నాగరేకే ఇన్‌చార్జి బాధ్యతలు అప్పచెప్పారు. ఆయన కూడా మొత్తం హైదరాబాద్‌కే పరిమితమై రాష్ట్ర వ్యవహారాలు పట్టించుకోవడంలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ప్రస్తుతం ముగ్గురు కమిషనరేట్లతో కాలం గడుపుతున్నామని, ఇలాంటి కీలక సమయాల్లో ఉన్నతాధికారులు లేకపోవడంతో నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరుగుతోందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. రూ.1.50 కోట్ల లోపు టర్నోవర్ ఉన్న వారిలో 90 శాతం మంది రాష్ట్ర వాణిజ్యశాఖ పరిధిలోకి, 10 శాతం సెంట్రల్ ఎక్సైజ్ పరిధిలోకి వస్తారు. రూ.1.50 కోట్ల టర్నోవర్ దాటితే బాధ్యతలను సమానంగా పంచుకుంటారు. కానీ ఈ పని విభజన ఇంకా పూర్తికాకపోవడంతో ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఉద్యోగులున్నారు.