అచ్చంపేట : మేఘాలు ముఖం చాటేశాయి.. చినుకు జాడే కరువయింది. వాతావరణం ఎండాకాలాన్ని తలపిస్తోంది. ఏరోజుకారోజు వర్షం పడకపోతుందా అని రైతులు ఆతృతతో ఎదురుచూస్తున్నారు. ఆరంభ శూరత్వంలా ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాగానే వానముసురు పడటంతో రైతులు తెగ సంబరపడిపోయారు. ఈ ఏడాది వర్షాలు సకాలంలో కురుస్తాయని ఆశతో అచ్చంపేట మండలంలో మూడువేల హెక్టార్లలో రైతులు పత్తి పంట వేశారు.
వర్షాధారంగా వేసిన ఈ పంటల్లో ఐదు రోజులకు మొలకెత్తాల్సిన పత్తి మొక్కలు పదిరోజులకు మొలిచాయి. పక్కనే కృష్ణానది ప్రవహిస్తున్నా చేపట్టిన ఎత్తిపోతల పథకాలు పురిటినొప్పులు పడటంతో నీళ్లొచ్చే మార్గాలు కనిపించడంలేదు. గింజుపల్లి, వేల్పూరు, పెదపాలెం, గ్రంధశిరి గ్రామాల్లో ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. అవి ప్రారంభమై ఆరేళ్లయినా ఎప్పటికప్పుడు ఇదిగో ఈ ఏడాది నీళ్లు ఇస్తామంటూ అధికారులు కాలయాపన చేస్తున్నారే తప్ప ఇచ్చిన పాపాన పోలేదు. మరో వారం, పదిరోజుల్లో వర్షాలు పడకుండా ఇదే విధంగా ఎండలు మండిపోతే రైతులు భారీగా నష్టపోతారు.
అసలే బ్యాంకుల్లో అప్పులు పుట్టక, ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బుతో పంటలు వేసిన రైతులు అప్పుల ఊబిలో కూరుకోయాడు. పత్తి రైతుల పరిస్థితి ఇలా ఉంటే వర్షాన్ని నమ్ముకుని రైతులు మిరప నారుమళ్లు వేసేందుకు సాహసించలేక పోతున్నారు. కేవలం బోర్లు, బావులు, కాలువలు అందుబాటులో ఉన్న రైతులు మాత్రమే మిరప నారుమళ్లు వేస్తున్నారు.
చినుకు జాడేదీ?
Published Fri, Jul 10 2015 1:22 AM | Last Updated on Sun, Sep 3 2017 5:11 AM
Advertisement