19న బాబు పథకం ప్రారంభం
పుంగనూరు: నీరు-చెట్టు పథకాన్ని ప్రారంభించి జిల్లాలో ఒక కోటీ 10 లక్షల మొక్కలను నాటాలని ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆ చెట్లకు నీరు పోస్తారు.. వాటిని ఎవరు సంరక్షిస్తారో తెలియక అధికారులు అయోమయంలో ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బి.కొత్తకోటలో ఈనెల 19న నీరు-చెట్టు పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈమేరకు జిల్లాలోని అన్ని గ్రామీణ ప్రాంతాల్లోను ఈ పథకం కింద మొక్కలు నాటాలని స్థానిక అధికారులకు ఉత్తర్వులు అందాయి. జిల్లాలో 1.1 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో కోటి మొక్కలను అటవీశాఖ, 10 లక్షల మొక్కలను డ్వామా అధికారులు నాటాలని పేర్కొంది. ఒక్కో మొక్క కొనుగోలుకు రూ.4 నుంచి రూ.5ల వరకు ఖర్చు చేయాలని సూచించారు. దీనిద్వారా సుమారు రూ.5 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ మొక్కలను జిల్లాలోని అటవీశాఖ భూములు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, రోడ్లకు ఇరువైపుల, చెరువుల్లోను నాటాలని రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ రామాంజనేయులు రాష్ర్టంలోని అందరు జిల్లా కలెక్టర్లకు, ఎంపీడీవోలకు ఉత్తర్వులు జారీచేశారు.
నీరు-చెట్టు ఇలా చేపట్టాలి
నీరు-చెట్టు పథకాన్ని అమలుపరిచేందుకు ఈనెల 13 నుంచి మండలాల్లో నీరు-చెట్టు కమిటీలు ఏర్పాటు చే యాల్సి ఉంది. 14న కమిటీలకు శిక్షణ, 15న గ్రామస్థాయిలో చేపట్టాల్సిన పనుల గుర్తింపు, 16న నీరు-చెట్టు పథకంపై ఆయా పాఠశాలలోని పిల్లలకు అవగాహన కల్పించడం, 17న మొక్కలు నాటేందుకు గుంతలుకొట్టడం, నాట డం, 18న అన్ని గ్రామాల్లోను ఈ పథకం కింద చైతన్య సదస్సులు నిర్వహించడం, 19న గ్రామాల్లో ఈ పథకంపై ర్యాలీలు నిర్వహించాలని ఆదేశాలు జారీచేశారు. కార్యక్రమాన్ని జిల్లాలో తొలిసారిగా ముఖ్యమంత్రి ఈనెల 19న ప్రారంభిస్తారని పేర్కొన్నారు.
నీరు ఎవరు పోస్తారు?
నీరు-చెట్టు పథకం కింద ఎంతో ఆర్భాటాలతో ప్రారంభమయ్యే కార్యక్రమాన్ని చివరిదాకా ఎవరు పర్యవేక్షిస్తారు.. నీటి సరఫరా ఎవరు చేస్తారనే విషయాలు ఉత్తర్వుల్లో లేకపోవడంతో అధికారుల్లో అయోమయంలో ఉన్నారు. వేసవిలో ప్రజలకు తాగేందుకు అవసరమైన నీరును సరఫరా చేయలేని అధికారులు, మొక్కలు నాటేందుకు నీరు సరఫరా చేయగలరా అంటూ ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆలోచించకుండా ఉత్తర్వులు ఇవ్వడంతో పథకం నవ్వులపాలవుతుందని పలువురు విమర్శిస్తున్నారు.
గ్రీన్‌బెల్ట్ పథకం ఏమైంది?
చంద్ర బాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గ్రీన్‌బెల్ట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటించారు. ఇందుకోసం ఒక పర్యవేక్షకుడిని ఏర్పాటుచేసి, అతడికి వేతనం ఇచ్చారు. అతడు చెట్లను పోషించాలని పేర్కొన్నారు. ఇందుకోసం కోట్లు ఖర్చుచేశారు. ఆపథకం అప్పటితో ఆర్భాటంగా ప్రారంభమై, అర్ధాంతరంగా ముగిసిపోయింది.
చెట్టుకు నీరెక్కడ?
Published Wed, Feb 18 2015 2:45 AM | Last Updated on Tue, Oct 2 2018 2:30 PM
Advertisement