విజయవాడ స్పోర్ట్స్ : బాబు వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామని, జాబు కావాలంటే బాబు రావాలని, ఉద్యోగాలు లేని నిరుద్యోగులకు జీవన భృతి కింద రూ.2 వేలు చొప్పున అందజేస్తామని గత ఎన్నికల్లో అనేక వాగ్దానాలతో మభ్యపెట్టిన తెలుగుదేశం పార్టీ నేతలు, ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తీరా అధికారంలోకి వచ్చాక ఆ ఊసే మరిచారు. కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలనూ ఊడబెరికారు. ఇప్పటి వరకు నిరుద్యోగ భృతి ఊసే లేదు. నిరుద్యోగ భృతి వాగ్దానాన్ని మేనిఫెస్టోలో ఐదో ప్రాధాన్యత అంశంగా పొందుపరచడం గమనార్హం. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఫొటో పక్కన పెట్టుకొని మరీ పత్రికల్లో ప్రకటన కూడా ఇవ్వడం కొసమెరుపు.
ఇదీ నిరుద్యోగుల లెక్క..
జిల్లాలో నేటి వరకు అధికారిక లెక్కల ప్రకారం 67,844 మంది నిరుద్యోగులున్నారు. ఇందులో గ్రామీణ ప్రాంతంలో పురుషులు 28,832, స్త్రీలు 11,397, పట్టణ ప్రాంతంలో పురుషులు 17,623, స్త్రీలు 9,992 మంది ఉపాధి కల్పన కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. ఓసీ కేటగిరీలో 17,963, ఎస్‌సీ కేటగిరీలో 20,196, ఎస్‌టీ కేటగిరీలో 3,462, బీసీ-ఏలో 6,951, బీసీ-బీలో 8,578, బీసీ-సీలో 1,660, బీసీ- డీలో 7,325, బీసీ-ఈలో 1,709 మంది ఉన్నారు.
సాధారణ నిరుద్యోగులు 60,344 మంది కాగా, వికలాంగులు దాదాపు 7,500 మంది. ఉపాధి కోసం దరఖాస్తు చేసుకున్నవారిలో నిరాక్షరాస్యులు ఏడుగురు, తొమ్మిదో తరగతి వరకు చదివినవారు 4,453 మంది, పదో తరగతి చదివినవారు 29,727, 10+2 చదివినవారు 16,303, గ్రాడ్యుయేట్లు 16,303, పోస్టుగ్రాడ్యుయేట్లు 10 మంది ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. వాస్తవానికి జిల్లా ఉపాధి కార్యాలయాల్లో పేర్లు నమోదు చేసుకున్నవారి కంటే కనీసం రెండు రెట్లు అధికంగానే నిరుద్యోగులు ఉంటారంటే అతిశయోక్తి కాదు.
గతంలో టెన్త్ పూర్తిచేసిన ప్రతి విద్యార్థి, విద్యార్థిని విధిగా జిల్లా ఉపాధి కార్యాలయాల్లో తమ పేర్లు నమోదుచేసుకునేవారు. 1991 తర్వాత ఉపాధి కల్పన కార్యాలయాలు నామమాత్రంగా మిగిలి పోవడంతో రాజీవ్ యువ కిరణాలు, చంద్ర కిరణాలు వంటి ప్రచార ఉపాధి కల్పన కార్యక్రమాలకు మినహా ఉపాధి కల్పన కార్యాలయాలు ప్రాధాన్యతలకు అనుగుణంగా పిలిచి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. అధికారిక లెక్కలు వేలల్లో ఉంటే వాస్తవంగా జిల్లాలో లక్షల్లో నిరుద్యోగులుంటారు.
అధికారిక లెక్కల ప్రకారం చూసుకున్నా... చంద్రబాబు మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారం నిరుద్యోగులకు ఇవ్వాల్సిన జీవనభృతి ఒక్కొక్కరికి రూ.2 వేలు చొప్పున జిల్లాలో నెలకు మొత్తం రూ.13 కోట్ల 56 లక్షల 88 వేలు ఇవ్వాల్సి ఉంది. చంద్రబాబు పాలన ఏడాది పూర్తయిన నేపథ్యంలో గత ఏడాది కాలంలో నిరుద్యోగులకు చెల్లించాల్సిన మొత్తం బకాయి రూ.162 కోట్ల 82 లక్షల 56 వేలు.
మరో 4,500 మందికి ఎసరు
విజయవాడ నగరపాలక సంస్థలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న డ్వాక్వా, సీఎంఈవై కార్మికులను కూడా తొలగించి పారిశుధ్య పనులను కాంట్రాక్టర్‌కు కట్టబెట్టాలని ప్రభుత్వం జీవో జారీచేసింది. ఏఐటీయూసీ, సీఐటీయూతో పాటు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యాన తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తంచేయడంతో కౌన్సిల్‌లో అధికార పక్షం వెనక్కి తగ్గింది. ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చుకోవాలని, పాత పద్ధతినే కొనసాగించాలని తీర్మానించి ప్రభుత్వానికి పంపింది. దీంతో తాత్కాలికంగా కార్మికులకు ఉపశమనం కలిగినా.. నమ్మకంగా వేటు వేయగల నైపుణ్యం గల చంద్రబాబు పాలనలో సుమారు 4,500 మంది పారిశుధ్య కార్మికుల ఉపాధికి భరోసా మాత్రం కరువైంది.
చంద్రబాబు తాను మారలేదని మరోసారి నిరూపించుకుంటున్నారు. పర్మినెంట్ ఉద్యోగ విధానాలకు తిలోదకాలిస్తూ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు విధానాన్ని ప్రవేశపెట్టిన ఆయనే ఒక్క ఎస్‌ఎంఎస్ పోటుతో చిరుద్యోగులను తొలగిస్తున్నారు. దానికి ఉదాహరణలు ఇవీ...
►వృద్ధాప్య పింఛన్లు ఇచ్చే దాదాపు రెండువేల మంది సీపీఎస్‌లను ‘మీ సేవలు ఇక చాల’ంటూ ఒక్క ఎస్‌ఎంఎస్ పోటుతో తొలగించారు.
►కాంగ్రెస్ వాళ్లంటూ 750 మంది ఆదర్శ రైతులను నిర్దాక్షిణ్యంగా తీసేశారు.
►ఐకేపీ కింద సేంద్రియ వ్యవసాయం చేసే క్లస్టర్ యాక్టివిస్ట్, విలేజ్ యాక్టివిస్ట్‌లుగా ఉన్న దాదాపు 300 మంది ఉద్యోగాలు కోల్పోయారు.
►హౌసింగ్ కార్పొరేషన్‌లో ఇప్పట్లో గృహనిర్మాణాలు ఏమీ లేవని, మిమ్మల్ని భరించలేమని పేర్కొంటూ వర్క్ ఇన్‌స్పెక్టర్లను, సర్వేయర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లను 98 మందిని ఊడబీకారు. వీళ్లకు ప్రభుత్వం జీతం ఇవ్వకపోయినా లబ్ధిదారుల రుణాల నుంచి రూ.5 వేలు కట్ చేసి వేతనంగా ఇస్తారు. అయినా వారిని తొలగించారు.
►వైద్యవిధాన పరిషత్‌లో అవుట్‌సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులను కూడా భరించలేమని పేర్కొన్నారు. దీనిపై యూనియన్ నేతలు వ్యతిరేకత వ్యక్తం చేయడంతో ప్రభుత్వం మూడేసి నెలలు గడువు పెంచుకుంటూ పోతోంది. ఒకేసారి తీసేస్తే వ్యతిరేకత వస్తుందన్న ఉద్దేశంతో చిన్నచిన్న కారణాలతో దాదాపు జిల్లాలో 10 మందిని ఇప్పటికే తొలగించినట్లు సమాచారం.
►ఇంటికో ఉద్యోగం అంటూ ఆశలు కల్పించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ విధంగా జిల్లాలో దాదాపు 3,200 మందిని తొలగించారు. ఉద్యోగాలు కోల్పోయి రోడ్డునపడేలా చేశారు.
►హాస్టళ్లలో అవుట్ సోర్సింగ్ కింద పనిచేస్తున్న వంట మనుషులు, ఇతర సిబ్బందిని కూడా తొలగించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.
పాఠశాలల రేషనలైజేషన్‌లో భాగంగా రాజీవ్ విద్యామిషన్ ద్వారా బీఈడీ అర్హతతో పనిచేస్తున్న క్లస్టర్ రిసోర్స్ పర్సన్‌లను తొలగించి వారి స్థానంలో ఉన్న టీచర్లనే నియమించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
నిరుద్యోగ భృతి ఊసేదీ...
టీడీపీ అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి నెలకు రూ.2 వేలు ఇస్తామని ఆశ చూపారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఆ సంగతే మరిచారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కల్పన లేనే లేదు. వాగ్దానాలు చేయటమే తప్ప అమలు చేయటం లేదు. డిగ్రీ, ఆపైన చదివిన వారు ఉద్యోగాలు లేక ఇక్కట్ల పాలవుతున్నారు. ప్రభుత్వం నుంచి నిరుద్యోగ భృతి వస్తుందని ఆశించినా ఫలితం లేకుండాపోయింది.
- ఎం.జాన్‌వెస్లీ, మచిలీపట్నం
ఉపాధి చూపలేదు
నిరుద్యోగ యువతకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పటమే తప్ప ఇంతవరకు ఆ దిశగా ప్రయత్నాలు కూడా ప్రభుత్వం చేయలేదు. నవ్యాంధ్రప్రదేశ్‌లో అందరికీ ఉద్యోగాలు లభిస్తాయనే ఆశతో నిరుద్యోగులు ఉన్నారు. ప్రభుత్వం మాత్రం కొత్త ఉద్యోగాల మాట ఎలా ఉన్నా కాంట్రాక్టు పద్ధతిపై పనిచేసే చిరుద్యోగులను తొలగించేసింది. దీంతో వారు రోడ్డున పడాల్సి వచ్చింది.
- కె.రవితేజ, మచిలీపట్నం
బాబు ఆయా.. జాబు గయా
Published Sat, May 30 2015 4:23 AM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM
Advertisement
Advertisement