సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : ఉపాధిహామీ పథకం గాడి తప్పింది. జూలై ఆరంభం నుంచి ఏ ఒక్క కూలీకి వేతనం చెల్లించలేదు. రెక్కాడితేగానీ డొక్కాడని కూలీలు పని చేసి డబ్బులు ఇవ్వాలని అడిగితే అధికారులు మొహం చాటేస్తున్నారు. తమకేం తెలియదని... ప్రభుత్వం నుంచే విడుదల కావడం లేదని దాటవేస్తున్నారు. ఉన్న ఊళ్లోనే పని చేసుకుని బతుకుదామని ఉపాధిహామీ పథకాన్ని నమ్మకుంటే చివరికి చేతిలో చిల్లిగవ్వలేకుండా పోతోందని, ఇంట్లో బియ్యానికి డబ్బులు దొరకడం లేదని కూలీలు వాపోతున్నారు. ఈ పథకం పని కల్పించడం సంగతి ఎలా ఉన్నా వేతనం చెల్లింపులో మాత్రం హామీ ఇవ్వడం లేదని అంటున్నారు. జిల్లాలో 6.85 లక్షల జాబ్‌కార్డులు ఉన్నాయి. 2 లక్షల 54 వేల 189 కుటుంబాల్లోని 4 లక్షల 19 వేల 358 మందికి ఇప్పటివరకు ‘ఉపాధి’ సమకూర్చినట్లు అధికారులు చెబుతున్నారు. వీరిలో ఇప్పటివరకు 30 వేల కుటుంబాలకు మాత్రమే వందరోజుల పని కల్పించినట్లు పేర్కొంటున్నారు.
ఇలా ఉపాధి కల్పించడంలోనే జిల్లా పరిస్థితి అధ్వానంగా ఉండగా... పనిచేసిన వారికి వేతనాలు ఇచ్చేందుకు ప్రభుత్వాలకు చేతులు రావడం లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచి వేతనాల చెల్లింపులో పరిస్థితి దారుణంగానే ఉంది. నిబంధనల ప్రకారం ఉపాధిహామీ వేతన చెల్లింపులు ప్రతీ మూడు రోజులకు ఇవ్వా లి. వారానికోసారి ఇస్తున్నారు. లెక్కలు కాలేదని పంపిణీ చేసే ఏజెన్సీలు క్యాష్ హాలీడే వంటి కారణాలతో వారానికోసారి చెల్లింపులు జరిపే వి. జూలై 6 నుంచి జిల్లా వ్యాప్తంగా ఒక్క పైసా చెల్లింపులు జరపలేదు. దీంతో కూలీలకు ఇవ్వాల్సిన వేతనం మొత్తం ఇప్పటికే రూ.15 కోట్లకు చేరుకుంది.
వర్షాకాలం కావడంతో అసలే ఉపాధిహామీ పనులు తక్కువగా జరుగుతున్నాయి. ఉపాధిహామీ పనుల్లో భాగంగా చెట్ల పెంపకం కోసం గుంతలు తీసిన కూలీలకు చెల్లింపులు లేవు. వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు చెల్లించాల్సిన రూ.4,500లు చెల్లింపులు జరగడం లేదు. ఉపాధిహామీలో ఆన్‌లైన్ ద్వారా చెల్లింపులు జరిగినట్లు చూపిస్తున్నా కూలీల ఖాతాలకు మాత్రం జమ కావడంలేదు. చేసిన పనికి వేతన చెల్లింపులు అసలే లేకపోవడం పేద కుటుంబాలకు ఇబ్బందిగా మారుతోంది. నిత్యావసర వస్తువులు తెచ్చుకునేందుకు కూడా చేతిలో డబ్బులు లేక కూలీల కుటుంబాలు అవస్థలు పడుతున్నాయి.
కూలీకి హామీ ఏది?
Published Sat, Aug 24 2013 2:37 AM | Last Updated on Fri, Sep 1 2017 10:03 PM
Advertisement
Advertisement