ప్రతీకాత్మక చిత్రం
ఏలూరు (మెట్రో): చంద్రన్న పెళ్లికానుక.. పథకంపై సర్కారు కినుక వహించింది. ఈ పథకాన్ని ప్రకటించి నెలలు కావస్తున్నా.. అమలుకు నోచుకోవడం లేదు. ఫలితంగా సంది గ్ధం నెలకొంది. పేదకుటుంబాల్లోని యువతుల వివాహం వారి తల్లిదండ్రులకు భారం కాకూడదన్న ఉద్దేశంతో కొంత ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. దీనికి చంద్రన్న పెళ్లికానుకగా నామకరణ చేసింది.
కానుక ఇలా
పెళ్లికానుకగా.. బీసీ, మైనారిటీలకు రూ.35 వేలు, ఎస్సీ, ఎస్టీలకు రూ.50 వేలు, కాపులకు రూ.30 వేలు పెళ్లి పందిట్లోనే ఇవ్వాలని నిర్ణయించింది. 7 నెలల కిందటే దీనిని ప్రకటించింది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి పథకం పట్టాలెక్కుతుందని చెప్పింది. అయినా ఇప్పటికీ స్పష్టమైన విధివిధానాలు ఖరారు కాలేదు.
పెళ్లిళ్ల జోరు
ప్రస్తుతం పెళ్లిళ్లు జోరుగా జరుగుతున్నాయి. దీంతో పెదిళ్లలో చంద్రన్న పెళ్లికానుకపై అయోమయం నెలకొంది. దరఖాస్తు, లబ్ధి కోసం పేదలు అధికారుల చుట్టూ తిరుగుతున్నా.. స్పష్టత రావడం లేదు. ఈ ఏడాది ఫిబ్రవరి 23వ తేదీ నుంచే వివాహాల సందడి మొదలైంది. మార్చి నెలాఖరు వరకూ పెళ్లిళ్లు జరగనున్నాయి.
కల్యాణ మిత్రల ఎంపికకే పరిమితం
చంద్రన్న పెళ్లికానుక పథకాన్ని అమలు చేసేందుకు మండలానికి ముగ్గురు చొప్పున కల్యాణ మిత్రలను నియమించాలని ప్రభుత్వం సంకల్పించింది. దీనికోసం వెలుగు ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళలను ఎంపిక చేశారు. ఆయా మండలాల పరిధిలో ముగ్గురుని ఎంపిక చేసి వారిలో ఇద్దరిని శాశ్వతంగా.. మరొకరిని అదనంగా నియమించారు. వీరిలో శాశ్వతంగా నియమించిన వారికి మండలంలోని పంచాయతీలను సమానంగా కేటాయిస్తారు. ఏ పంచాయతీలో కల్యాణమిత్ర పనిచేయకుంటే అక్కడ అదనంగా ఏర్పాటు చేసిన కల్యాణమిత్రకు ఆ వివాహ బాధ్యతను అప్పగిస్తారు.
ఈ విధంగా జిల్లాలో 48 మండలాల్లో 144 మందిని ఎంపిక చేశారు. వీరికి గౌరవ వేతనంగా ఒక్క పెళ్లికి రూ.300 చొప్పున నిర్ణయించారు. అదే పెళ్లి రాత్రి సమయాల్లో నిర్వహిస్తే ఆ పెళ్లికి వెళ్లేందుకు రూ.500 కల్యాణమిత్రకు అందించనున్నారు. అయినా ఎదురుచూపులకే పథకం పరిమితమైంది. గత రెండు రోజులుగా అంటే ఈనెల 16, 17 తేదీల్లో ఎంపిక చేసిన కల్యాణ మిత్రలకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిక్షణలో పెళ్లి జంటలను ఏ విధంగా గుర్తించాలి, ధరఖాస్తులను ఏవిధంగా అప్‌లోడ్ చేయాలనే వాటిపై శిక్షణ ఇచ్చారు.
ఇప్పటికే 246 జంటలు
జిల్లా వ్యాప్తంగా ఫిబ్రవరి నెలాఖరు నుంచి ఇప్పటి వరకూ 246 జంటలు ఒక్కటయ్యాయని తెలుస్తోది. ఈ పెళ్లిళ్లల్లో సుమారు 200 జంటలు పేద వర్గాల వారే ఉన్నట్లు అంచనా. అయితే వీరందరూ చంద్రన్న పెళ్లి కానుకను కోల్పోవాల్సి వచ్చింది.
అసలు ఉద్దేశం ఇదీ..
ప్రధానంగా బాల్యవివాహాలను అరికట్టేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకంలో లబ్ధిపొందాలంటే వధువుకు 18, వరునికి 21 సంవత్సరాలు నిండడం తప్పనిసరి. ఆధార్‌కార్డును ఈ వివరాల కోసం పరిగణలోకి తీసుకుంటారు. బ్యాంకు ఖాతాలను అనుసంధానం చేయడం ద్వారా పెళ్లికానుక లబ్ధిదారుల ఖాతాలోకి చేరుతుంది. ఇప్పటి వరకూ ప్రతి వివాహాన్ని రిజస్ట్రేషన్ చేయించాలన్న ఆదేశాలు అమలు కావడం లేదు.
తాజాగా చంద్రన్న పెళ్లికానుక పొందాలంటే తప్పక పెళ్లి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కావాలి. 2019వ సంవత్సరం నుంచి పదోతరగతి కూడా వధూవరులు పూర్తి చేయాలనేది నిబంధనగా విధించారు. దీనివల్ల అక్షరాస్యత పెరుగుతుందనేది ప్రభుత్వ వాదన. అయితే ఇంతటి కీలకమైన పథకం అమలులో సర్కారు మీనమేషాలు లెక్కిస్తోంది. త్వరగా ఈ పథకం అమలు చేయాలని పేదలు కోరుతున్నారు.
శిక్షణ పూర్తి చేశాం
ఇప్పటికే కల్యాణమిత్రల ఎంపిక పూర్తి చేశాం. ఎంపికైన వారికి రెండు రోజుల పాటు శిక్షణ ఇచ్చాం. వీరికి డివైజ్‌లు అందించాం. పథకం ఎప్పటి నుంచి అమలు చేయాలో ఇప్పటివరకూ ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదు. ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభిస్తారని సమాచారం. ప్రభుత్వం పథకం ఆచరణలో పెట్టాలని ఆదేశించిన మరుక్షణం జిల్లాలో అమలుకు సిద్ధంగా ఉన్నాం.
కె.శ్రీనివాసులు, డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment