మహిళా పోలీసు స్టేషన్ ఎక్కడ..?
Published Fri, Jan 17 2014 2:59 AM | Last Updated on Sat, Sep 2 2017 2:40 AM
విజయనగరం క్రైం, న్యూస్‌లైన్: విజయనగరంలో మహిళా పోలీసు స్టేషన్ ఎక్కడుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. గతంలో ట్రాఫిక్ పోలీసు స్టేషన్ మేడపై మహిళా పోలీసు స్టేషన్ ఉండేది. అయితే ఇప్పుడు పద్మావతి నగర్‌లో రూ.లక్షలు ఖర్చుచేసి మహిళా పోలీస్ స్టేషన్ కోసం నూతన భవనాన్ని నిర్మించారు. సాధారణంగా చదువుకున్నవారికే నేమ్‌బోర్డు ఉంటేనే గాని పోలీసు స్టేషన్ గురించి తెలియదు. అందులోనూ ఇప్పుడు పట్టణంలో పెద్దపెద్దభవంతులు, ఇళ్లు వెలిశాయి. రంగురంగుల భవనాలు ఉన్న పద్మావతినగర్ 2వ లైన్‌లో మహిళా పోలీసు స్టేషన్‌ను నిర్మించారు. గత ఏడాది అక్టోబర్ నెలలో పోలీస్ స్టేషన్‌ను ఇక్కడికి మార్చారు.
దాదాపు మూడు నెలల దాటినా పోలీసు అధికారులు స్టేషన్‌కు నేమ్ బోర్డు ఏర్పాటు చేయలేదు. ఒకటో పట్టణ, రెండో పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలోని మహిళలు డెరైక్ట్‌గా మహిళా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయవచ్చు. డెంకాడ, నెల్లిమర్ల, రూరల్ పోలీసు స్టేషన్‌కు సంబంధించిన మహిళల ఫిర్యాదులపై కేసులు ఆయా పోలీసు స్టేషన్‌లలో నమోదు చేసి తదుపరి చర్యల కోసం మహిళా పోలీసు స్టేషన్‌కు పంపిస్తారు. విజయనగరంలో ఉన్న మహిళలకే మహిళా పోలీసు స్టేషన్ ఎక్కడుందో తెలియకపోతే చుట్టుపక్కల పరిసర ప్రాంతాల పోలీసు స్టేషన్‌ల నుంచి వచ్చే మహిళలకు ఎలా తెలుస్తుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మహిళా పోలీసు స్టేషన్‌కు నేమ్‌బోర్డు ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.
Advertisement
Advertisement