మాట్లాడుకుందాం రా! | White Settlement Police Department | Sakshi
Sakshi News home page

మాట్లాడుకుందాం రా!

Published Sat, Jan 4 2014 5:35 AM | Last Updated on Sat, Sep 2 2017 2:17 AM

White Settlement Police Department

ఖమ్మం, న్యూస్‌లైన్: జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లు సెటిల్‌మెంట్లకు అడ్డాలుగా మారాయి. రక్షణ కల్పించాల్సిన పోలీసులు మధ్యవర్తులతో చేతులు కలిపి జనం జేబులకు చిల్లు పెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. న్యాయం కోసం స్టేషన్లకు వస్తే ముందుగా కలవాల్సింది మధ్యవర్తులనేనని, లేకపోతే స్టేషన్‌లో అడుగు పెట్టడం కుదరడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదో విధంగా కేసు నమోదైనా... వెంటనే ఆయా ప్రాంతాలలో నాయకులో, పెద్దమనుషులో జోక్యం చేసుకుంటారని, వారు మాట చెప్పనిదే కేసు ముందుకు నడిచే పరిస్థితి చాలా చోట్ల లేదని తెలుస్తోంది. జిల్లాలోని పలు స్టేషన్ల అధికారులు మధ్యవర్తులతో సంబంధాలు ఏర్పర్చుకొని, వారు ‘ఎంత చెబితే అంత’ అన్నట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. మారుమూల గిరిజన ప్రాంతాలు మొదలుకొని ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు, సత్తుపల్లి, ఇల్లెందు ప్రాంతాల్లో కూడా మధ్యవర్తుల పంచాయితీలు నిత్యకృత్యమయ్యాయని పలువురు చెబుతున్నారు. జిల్లాలోని కొన్ని స్టేషన్లలో తీరు ఎలా ఉందంటే...
 
 ఖమ్మం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో చీటింగ్‌పై ఫిర్యాదులు వస్తున్నా... కేసులు నమోదు చేయడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. టూటౌన్ పరిధిలో చైన్ స్నాచింగ్, ఇంటి తాళాలను పగులగొట్టి దోచుకోవడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నా.. రికవరీలో పోలీసులు విఫలమయ్యారు. త్రీటౌన్ పరిధిలో వచ్చిన ఫిర్యాదులను కేసు నమోదు చేయకుండా సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. అనేక కేసులను పోలీస్‌స్టేషన్ బయటే సెటిల్ చేస్తున్నారు. మున్నేరు పరివాహక ప్రాంతంలో ఇతర జిల్లాల నుంచి వచ్చి పేకాట ఆడుతున్నప్పటికీ చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. మహిళా పోలీస్‌స్టేషన్‌లోనూ బాధితులకు న్యాయం జరగడం లేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇక ఖమ్మం అర్బన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మధ్యవర్తులు లేకుం డా ఏ ఒక్క కేసూ నమోదు కావడంలేదనే విమర్శలున్నాయి. స్టేషన్ ఎదుట దళారులు మాటు వేసి, అధికారులతో కుమ్మక్కై ఫిర్యాదుదారులతో బేరసారాలు కుదుర్చుకుంటున్నారని, వారికి నచ్చితే ఒక తీరుగా, లేకుంటే మరో రకంగా కేసు నమోదయ్యేలా చూస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
 
  వైరాలో అధికార పార్టీ నాయకులు స్టేషన్‌లో కేసులు నమోదు కాకుండా పోలీసులపై ఒత్తిడి తీసుకొస్తున్నారని, అక్కడ వారే పెత్తనం చెలాయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇక కొణిజర్ల పోలీస్‌స్టేషన్‌లో గత ఏడాది అత్యధికంగా రోడ్డు ప్రమాదానికి సంబంధించిన కేసులు మాత్రమే నమోదయ్యాయి.
 
     పాలేరు నియోజకవర్గంలోని పోలీస్ ఠాణాలు ప్రైవేట్ పంచాయితీలకు నిలయాలుగా మారాయి. నిత్యం భూ తగాదాలు, సివిల్ విషయాలలో పోలీసులు జోక్యం చేసుకుంటున్నారని, వాటికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని సమాచారం. ఏదైనా కేసు విషయంలో గ్రామాలకు వెళ్లిన పోలీస్ సిబ్బంది వాహన ఖర్చులంటూ ఇరు వర్గాల నుంచి డబ్బులు తీసుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. భార్యాభర్తల కేసులు, భూ తగాదాల్లో పోలీసులు అతిగా వ్యవహరిస్తూ ఆయా గ్రామాల పెద్ద మనుషులతో పరోక్షంగా పంచాయితీలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. నేలకొండపల్లి మండలం అప్పల నర్సింహాపురానికి చెందిన ఓ మహిళ.. తనను ఖమ్మానికి చెందిన యువకుడు మోసం చేశాడని, పెళ్లి చేసుకోవాలంటే పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేసినా.. ఆమె ఆవేదనను పట్టించుకోలేదు. ఫిర్యాదుదారులు   వస్తే రిసెప్షన్ కౌంటర్‌లో ఉన్న సిబ్బంది పిటిషన్ రాయాలని, పోలీస్  స్టేషన్‌కు వచ్చే ప్రజల పట్ల మర్యాదగా వ్యవహరించాలని స్వయంగా జిల్లా పోలీస్ బాస్ చెప్పినా అది ఎక్కడా అమలు కావడంలేదు. ఖమ్మం రూరల్, కూసుమంచి, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి స్టేషన్లలో ఎక్కువగా అధికార పార్టీ నాయకులు చెప్పిన వారికే న్యాయం జరుగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
 
     కొత్తగూడెంలో మూడు పోలీస్‌స్టేషన్లు ఉన్నాయి. 1/70 చట్టం అమలులో ఉన్న  ఏరియా కావడంతో భూ వివాదాలపై వచ్చిన ఫిర్యాదులలో ఎక్కువగా బయటే సెటిల్‌మెంట్లు చేస్తున్నారు. దీంతోపాటు ఈ స్టేషన్ల పరిధిలో ఎక్కువగా చిన్న చిన్న గొడవలు జరగడం, అవి స్టేషన్ వరకు వస్తే రాజకీయ నాయకులు రంగ ప్రవేశం చేసి సెటిల్‌మెంట్లు చేయడం షరా మామూలవుతోంది. ఇక ఇసుక మాఫియా సైతం కొత్తగూడెం పట్టణంలో ఎక్కువగా ఉంది. వీటిపై పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పాల్వంచలో రెండు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. కుటుంబ కలహాలపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే వాటిని రాజకీయ నాయకులు బయట పంచాయితీలు పెట్టి పరిష్కరిస్తున్నారు. చోరీలకు సంబంధించిన కేసులు సక్రమంగా నమోదు కావడం లేదు.  
 
     అశ్వారావుపేట పోలీసులు నల్లబెల్లం, సారా రవాణాను నియంత్రించడమే పనిగా పెట్టుకున్నారు. ఎక్సైజ్ అధికారుల విధులు వీరు నిర్వహిస్తుండగా, కొందరు కింది స్థాయి సిబ్బంది మాత్రం నల్లబెల్లం వ్యాపారం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. దమ్మపేట, వేలేరుపాడు, చండ్రుగొండ, కుక్కునూరు, ముల్కలపల్లి మండలాల్లో ముందుగా రాజకీయ నాయకుల వద్ద పంచాయితీలు పెడతారు. అప్పటికీ పరిష్కారం కాకుంటే పోలీస్ స్టేషన్‌కు వెళుతుంటారు. ఈ కేసుల్లో పెద్దమనుషులు చెప్పినట్లుగా పోలీసులు నడుచుకుంటారు.
 
  సత్తుపల్లి పరిసర ప్రాంతాలలో క్రికెట్ బెట్టింగులు, పేకాట, కోడిపందేలు వంటివి జరుగుతున్నా.. కేసుల నమోదు నామమాత్రమే. ఇటీవల ఇక్కడి నుంచి బదిలీ అయిన ఓ సీఐ సత్తుపల్లి పోలీస్‌స్టేషన్‌ను కార్పొరేట్  కార్యాలయంగా తయారుచేశారు. స్టేషన్‌కు వెళ్లగానే చల్లని ఏసీ గాలి తగులుతుంది. స్టేషన్ మొత్తం వాస్తు పేరుతో మరమ్మతులు చేశారు. అంతా గ్లాస్ ఫిటింగ్, పచ్చని గార్డెన్‌తో కళకళలాడుతోంది. అయితే ప్రతి పనికి డబ్బులు లేనిదే కుదిరేది కాదనే ప్రచారం ఉంది. అతడి సంపాదనపై తోటి ఉద్యోగులే   కథలు.. కథలుగా చెప్పుకుంటున్నారంటే.. ఫార్మాల్టీల పేరుతో ఆయన ఎంత వసూళ్లుకు పాల్పడ్డారో అర్ధం చేసుకోవచ్చని ఓ అధికారి ఉన్నతాధికారులకు ఉప్పందించినట్లు ప్రచా రం జరుగుతోంది. డిపార్ట్‌మెంట్ ఎం క్వైరీ కూడా జరుగుతున్నట్లు విశ్వసనీయ వర్గాల కథనం. మరో యువ ఎస్సై ఫార్మాల్టీల పేరుతో డబ్బులు బాగా వసూలు చేస్తున్న ట్లు ప్రచారం జరుగుతోంది. రాజకీయ నాయ కులతోనే సెటిల్‌మెంట్లు చేయించి డబ్బులు తీసుకుంటారనే ఆరోపణలు ఉన్నాయి.  
 
  భద్రాచలం పట్టణ పోలీస్ స్టేషన్ సెటిల్‌మెంట్‌లకు అడ్డాగా మారుతోందనే విమర్శలున్నాయి. రాజకీయ నేతల అండదండలతో కేసుల సెటిల్‌మెంట్‌లు ఎక్కువగా జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటితో పాటు గిరిజన చట్టాలు అమలులో ఉండటంతో భారీగా భూ దందాలు జరుగుతున్నాయి. కొంత మంది ముఠాలుగా ఏర్పడి ఈ దందాలను యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. ఈ సెటిల్‌మెంట్‌లు, భూదందాలపై ఉక్కుపాదం మోపాల్సిన పోలీసులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే  ఆ రోపణలున్నాయి. కొద్ది నెలల క్రితం భద్రాచలం వచ్చిన ఎస్‌పీ రంగనాథ్ సెటిల్‌మెం ట్లను సహించేది లేదని, ఎటువంటి అధికారులనైనా ఉపేక్షించబోమని హెచ్చరించినా పరి స్థితులలో మార్పు రాకపోవడం గమనార్హం.
 
   ఇల్లెందు నియోజకవర్గంలోని గార్ల పోలీస్‌స్టేషన్ బయట పిటీ కేసుల పరిష్కారం కోసం అప్పుడప్పుడు పంచాయితీలు కొనసాగుతాయి. ఫిర్యాదులకు పోలీస్‌స్టేషన్‌లో రశీదులు ఇచ్చేదే లేదు. కామేపల్లి పోలీస్‌స్టేషన్‌లోనూ ఫిర్యాదులకు రశీదులు ఇచ్చిన దాఖలాలు లేవు. ఫిర్యాదుదారుడు ఎవరైనా.. వెంటనే కేసు నమోదు చెయ్యరు.. రశీదు ఇవ్వరు. ఇక్కడ అధిక మొత్తంలో కేసులు సెటిల్‌మెంట్ ద్వారానే పరిష్కారం అవుతుంటాయి. అయితే కామేపల్లి పీహెచ్‌సీలో వ్యాపారులు గత నెల 21న అక్రమంగా సుబాబుల్ చెట్లు నరకగా వైద్యాధికారి వారిపై గత నెల 24న ఫిర్యాదు కూడా చేశారు. దానిపై ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదు.. కనీసం విచారణ కూడా చేపట్టలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement