‘ఆరోగ్యశ్రీ’కి అనారోగ్యం..!
పేరు మార్చి గాలికొదిలేసిన
{పభుత్వం జిల్లాలో కుంటుపడ్డ ఆరోగ్యశ్రీ సేవలు
శస్త్రచికిత్సలూ అంతంత మాత్రమే
రమణమ్మ. వయసు 54 ఏళ్లు. పెద్దమండ్యంలోని ఓ మారుమూల గ్రామంలో నివసిస్తోంది. గర్భసంచిలో గడ్డతో ఆరు నెలలుగా బాధపడుతోంది. ఐదు నెలల క్రితం ఆరోగ్యశ్రీ పథకం కింద శస్త్ర చికిత్స కోసం దరఖాస్తు చేసుకుంది. జిల్లాలోని ఆరోగ్యమిత్ర ఈ వివరాలు ఇప్పటికే ఆస్పత్రికి పంపించారు. ఇప్పటి వరకు ఆమెకు శస్త్ర చికిత్స చేయలేదు.
రసూల్ మూడో తరగతి విద్యార్థి. ఇతనిది సురుటుపల్లె. ఈ కుర్రాడి గుండెలో చిల్లు ఉంది. దీనిని ఆరోగ్యశ్రీ కింద బాగుచేయించాలని ఎనిమిది నెలలుగా జిల్లా కలెక్టర్ నుంచి సిబ్బంది వరకు అందరి వద్దకు తిరిగాడు. ఓ కార్పొరేట్ ఆస్పత్రి యాజమాన్యం మందులిచ్చి, చేతులు దులుపుకుంది. మినహా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
చిత్తూరు (అర్బన్): రమణమ్మ, రసూల్ తరహాలోనే ఆరోగ్యశ్రీ చికిత్స కోసం నిరీక్షిస్తూ చాలా మంది మృత్యువుకు సమీపిస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వ పథకాల పేర్లను మార్చడంలో చూపించిన శ్రద్ధ వాటిని అమలు చేయడంలో ఏ మాత్రం చూపలేదని నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరిట ఉన్న పథకాన్ని ‘డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య సేవ’గా పేరు మార్పు చేశారు. మినహా వైద్య సేవలు అందించడంలో మాత్రం చిత్తశుద్ధి లోపించింది.
ఏడేళ్లల్లో రూ.232 కోట్లు ఖర్చు
జిల్లాలో 2007లో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం అమల్లోకి వచ్చింది. దివంగత సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకానికి నాంది పలికారు. 2007-08 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 1361 మందికి ఆరోగ్యశ్రీ కింద శస్త్ర చికిత్సలు చేయగా వీరి కోసం రాజశేఖరరెడ్డి అప్పట్లో రూ.5.95 కోట్లు ఖర్చుపెట్టారు. 2008-09లో 7565 ఆపరేషన్లు నిర్వహించగా రూ.23.49 కోట్లు, 2009-10లో 10493 మందికి శస్త్ర చికిత్సలు చేయగా రూ.30 కోట్లు, 2010-11లో 13,755 ఆపరేషన్లు చేసి రూ.37.75 కోట్లు, 2011-12లో 15,902 మంది కోసం 42.31 కోట్లు, 2012-13లో 16,870 మందికి శస్త్ర చికిత్సలకు 42.79 కోట్లు, 2013-14లో 18,889 మందికి ఆపరేషన్లు చేసి రూ.50.41 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే గడచిన ఏడేళ్ల కాలంలో ఆరోగ్య కోసం రూ.232 కోట్లు ఖర్చు పెట్టినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2014-15 ఆర్థిక సంవ్సరంలో ఈనెల 15వ తేదీ వరకు జిల్లాలో 22,846 మందికి ఆపరేషన్లు చేయగా వీరికి రూ.43 కోట్లు ఖర్చు చేశారు. అయితే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ ఆర్నెల్ల కాలంలో జిల్లాలో కేవలం మూడు వేల మందికి మాత్రమే శస్త్ర చికిత్సలు జరిగాయి.
బాగానే చేస్తున్నాం
శస్త్ర చికిత్సలు నిర్వహించడంలో ఎక్కడా జాప్యం జరగలేదు. గత నెల మాత్రం ఆన్‌లైన్‌లో చిన్నపాటి సాంకేతిక సమస్య వచ్చింది. దీంతో పైఅధికారుల నుంచి కొన్ని అనుమతులు ఆలస్యంగా వచ్చాయి. అంతే తప్ప మరే ఇబ్బంది. ఇప్పుడు పరిస్థితి బాగానే ఉంది.
-శివకుమార్, జిల్లా మేనేజర్, ఎన్టీఆర్ ఆరోగ్య సేవా విభాగం