సాక్షి, అమరావతి: ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ ఈనాడు రామోజీరావు బరితెగింపు రోజురోజుకీ మితిమీరుతోంది. తన ఆత్మ చంద్రబాబు వచ్చే ఎన్నికల్లోనైనా గట్టెక్కుతాడో లేదోనన్న అనుమానం ఆయనలో ఎక్కువైపోతోంది. దీంతో తన విషపుత్రిక ఈనాడులో ఏం రాస్తున్నారో కూడా చూసుకోలేని దుస్థితి ఆయనకు దాపురించింది. ఎందుకంటే.. తాజాగా ఈనాడులో ‘గుండె గోడు వినపడదా..?’ అంటూ మంగళవారం అచ్చేసిన ఓ తప్పుడు కథనం ఆయన పరిస్థితికి అద్దంపడుతోంది.
నిజానికి.. వైద్యానికి డబ్బులేక ఏ ఒక్క పేద వ్యక్తి గుండె ఆగిపోకూడదనే సంకల్పంతో సీఎం జగన్ డాక్టర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలుచేస్తున్నారు. రాష్ట్రంతో పాటు, దేశంలోనే వైద్య రంగంలో ఇదొక విప్లవాత్మక పథకమని సాక్షాత్తు నీతిఆయోగ్ సైతం ప్రశంసించింది. కానీ, రామోజీరావుకు మాత్రం ఇది అర్థకాదు. నిత్యం పథకంపై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారు. అందులో భాగమే ఈ క్షుద్ర రాతలు. అందులోని వాస్తవాలను పరిశీలిస్తే.. టీడీపీ ప్రభుత్వంలో కేవలం 1,059 ప్రొసీజర్లతో మొక్కుబడిగా ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలుచేశారు. దీంతో అప్పట్లో జబ్బుల బారినపడిన నిరుపేద ప్రజలు ఉచితంగా వైద్యసేవలు అందక నానా అవస్థలు పడ్డారు.
చేతి నుంచి డబ్బు ఖర్చుపెట్టి వైద్యం చేయించుకోలేక దేవుడిపై భారం వేసిన దుస్థితి వారిది. ఈ పరిస్థితుల్లో రామోజీ ఏనాడూ వీరి వేదనను పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం 3,257 ప్రొసీజర్లతో పథకాన్ని అమలుచేస్తూ, చికిత్స అనంతరం ఆరోగ్య ఆసరా ద్వారా కూడా రోగులకు అండగా నిలుస్తుండడంతో రామోజీ జీర్ణించుకోలేకపోతున్నారు. చంద్రబాబుకు ఇక ఎప్పటికీ అధికారం రాదనే కలవరంతో ఆయన ఇష్టమొచ్చింది చేతికొచ్చినట్లు రాసిపారేశారు.
4.53 లక్షల మందికి ఉచిత గుండె చికిత్సలు..
ఇక గుండె చికిత్సల విషయానికొస్తే.. 2019 నుంచి ఇప్పటివరకు సీఎం జగన్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద ఏకంగా 4,53,486 మంది హృద్రోగ బాధితులకు ఉచితంగా చికిత్స చేయించింది. ఇందుకు రూ.2,074 కోట్లను ఖర్చుచేసింది. ఇందులో..
♦ 23,789 మందికి కరోనరీ బైపాస్ సర్జరీలకు గాను రూ.278.88 కోట్లు..
♦ 2,255 మందికి ఇంట్రా కార్డియాక్ రిపేర్ ఆఫ్ ఏఎస్‌డీ సర్జరీకి రూ.17.66 కోట్లు చొప్పున వెచ్చించారు.
♦ అంతేకాక.. పథకాన్ని బలోపేతం చేయడంలో భాగంగా గత ఏడాది ప్యాకేజీ రివిజన్ ప్రక్రియలో టెక్నికల్ కమిటీ సలహాల మేరకు ఆరోగ్యశ్రీ చికిత్సలను ఆయుష్మాన్ భారత్, వివిధ రాష్ట్రాల ప్యాకేజీలతో సరిపోల్చి చాలావరకూ పెంచారు.
Comments
Please login to add a commentAdd a comment