స్వాతంత్య్ర... గణతంత్ర దినోత్సవాల రోజున ఉత్తమ అధికారిగా పురస్కారం అందుకోవడం గతంలో ఓ పెద్దగౌరవం. పక్కాగా ఉత్తముల ఎంపిక జరిగేది. రాను రాను...‘ఉత్తముల జాబితా’పై ఆసక్తి తగ్గింది. సింహభాగం శాఖాధికారులకు అనుకూలంగా ఉండేవారికే స్థానం దక్కుతోందని, నిజమైన ఉత్తములకు గౌరవం దక్కడం లేదని కొంతమంది ఉత్తమ సేవలు అందించినవారు
ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఏడాది వీటికి చెక్‌పెట్టేందుకు కలెక్టర్ కోనశశిధర్ ఉపక్రమించారు.
సాక్షి, కడప: జనవరి 26 గణతంత్ర వేడుకలకు అయిదు రోజుల వ్యవధి ఉంది. జిల్లాలో ఉత్తమ ఉద్యోగులకు పురస్కారాలపై మళ్లీ ఉత్కంఠ మొదలైంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏటా 18వతేదీ లోగా ఉత్తమ ఉద్యోగుల జాబితా అందజేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించడం, చాలామంది అధికారులు 25వ తేదీ కూడా జాబితా ఇవ్వడం జరుగుతోంది. ఈక్రమంలో ఈ ఏడాది ఉత్తమ అధికారుల ఎంపికను పక్కాగా సిద్ధం చేసేందుకు జిల్లా అధికారులు కుస్తీలు పడుతున్నారు.
గతేడాది స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉద్యోగుల జాబితా ఇవ్వాలని కలెక్టరు కోరినప్పుడు కూడా ఇదే సందిగ్ధం నెలకొంది. నిబంధనలను నిక్కచ్చిగా చూస్తారనే భయంతో ముందురోజు రాత్రి వరకూ కూడా కొన్ని ప్రభుత్వశాఖల అధికారులు జాబితాలు అందజేయలేదు. స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకుని ఏటా 450 నుంచి 500 మంది వరకూ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు ఇస్తున్నారు. అందులో ఎందరు ఉత్తములనే ది గుర్తించడం కష్టంగా మారింది. దీంతో కలెక్టర్ శశిధర్ ఈ పురస్కారాల వ్యవహారాన్ని గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
అందరూ బాగా పనిచేస్తున్నారని భావిస్తే, ఉత్తముల్లో ఉత్తములను గుర్తించాలని అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో ఎంపిక జాబితాలో ఆరోపణలున్నవారు ఉంటే ఎలా?అని పలు శాఖల అధికారులు జంకుతున్నారు. ఈ నెల 18లోపే జాబితాను సమర్పించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు అందాయి.
జిల్లాలో 104 ప్రభుత్వ శాఖలు ఉన్నాయి. వీరిలో కొంతమంది మాత్రమే జాబితాను పంపారు. ముహూర్తం ముంచుకొచ్చాక ఆగమేఘాల మీద తయారుచేసే జాబితాల్లో తప్పులుదొర్లి అర్హులకు ఏటా అన్యాయమే జరుగుతోందని కొందరు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉత్తమ ఉద్యోగి ఎవరో..!
Published Wed, Jan 22 2014 2:48 AM | Last Updated on Sat, Sep 2 2017 2:51 AM
Advertisement