![Who is the reason for Godavari pushkara tragedy? - Sakshi](/styles/webp/s3/article_images/2018/09/8/chhh.jpg.webp?itok=pVPyGkVe)
సాక్షి, రాజమహేంద్రవరం: ‘ఒకే చోట వీఐపీలందరూ స్నానం చేయాలన్న కారణంతో పోలీసులు సాధారణ భక్తులను ఆపేశారు. ఫలితంగానే తొక్కిసలాట జరిగింది’ అని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద గోదావరి పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాటపై జస్టిస్ సీవై సోమయాజులు నేతృత్వంలోనే ఏకసభ్య కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. దీనిపై గురువారం మంత్రివర్గ సమావేశంలోనూ చర్చ జరిగింది. దీంతో ఘటనకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని తేలిపోయింది. వీఐపీలందరికీ ప్రత్యేకంగా రాజమహేంద్రవరంలోనే సరస్వతీ ఘాట్‌ను కేటాయించినా.. సీఎం, ఆయన కుటుంబ సభ్యులు, మంత్రులందరూ ప్రజలకు కేటాయించిన పుష్కరఘాట్‌లో స్నానం చేశారు. షార్ట్ ఫిల్మ్ తీయాలని, అందులో భారీగా ప్రజలు కనిపించాలనే లక్ష్యంతో వారిని పుష్కర ఘాట్‌కు మళ్లించారు.
మార్గదర్శకాల అమల్లో విఫలం..
మార్గదర్శకాల ప్రకారం.. విపరీత రద్దీ ఏర్పడకుండా నిర్దేశిత ప్రాంతాల్లో భక్తులను నిలువరించాలి. ఇతర ఘాట్లకు మళ్లించాలి. ఘాట్లలో ప్రతి 50 మీటర్లను కంపార్ట్‌మెంట్లుగా విడగొట్టాలి. సీసీ టీవీలు ఏర్పాటు చేసి 72 గంటల రికార్డును ఉంచుకోవాలి.. కానీ ఇవేమీ అధికారులు చేయలేదు. పైగా పుష్కరఘాట్‌కు ప్రజలను మళ్లించారు. పూజ చేసిన అనంతరం సీఎం చంద్రబాబు ప్రజలకు అభివాదం చేసిన సమయంలో భారీగా జనం షార్ట్ ఫిల్మ్‌లో కనిపించాలనే ఉద్దేశంతోనే ఇలా చేసినట్లు స్పష్టమవుతోంది. కానీ వాస్తవాలు బయటకొస్తాయన్న కారణంతోనే నేషనల్ జియోగ్రాఫిక్ చానల్ చిత్రీకరించిన సార్ట్‌ఫిల్మ్‌ను నేటికీ విడుదల చేయలేదు.
అంబులెన్స్ వచ్చేందుకు దారిలేదు..
ఘాట్లలో అంబులెన్స్‌లు వచ్చేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లుండాలని మర్గదర్శకాల్లో ఉన్నా.. అలాంటివేం జరగనట్లు స్పష్టమవుతోంది. ఉదయం 8 గంటల సమయంలో తొక్కిసలాట జరగ్గా 9.15 గంటలకు మొదట బాధితుడిని ఆస్పత్రికి తీసుకొచ్చినట్లు అంబులెన్స్ లాగ్‌బుక్‌లో పేర్కొన్నారు. సరైన సమయంలో అంబులెన్సులు వచ్చి ఉంటే.. పలువురు బతికేవారని చెబుతున్నారు.
ఎవరిని బాధ్యులను చేస్తారు!
పుష్కరఘాట్‌లో వీఐపీల స్నానానికి అనుమతించిందెవరు? షార్ట్ ఫిల్మ్ కోసం గంటల తరబడి ప్రజలను ఆపిందెవరు? ఎవరి ఆదేశాలతో ఆపారు? దాదాపు మూడేళ్ల తర్వాత కమిషన్ తన విచారణ పూర్తి చేసి నివేదిక ఇచ్చింది. మరి బాధ్యులను ఎవరిని చేస్తారు? ఎవరిపై చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
మార్గదర్శకాలు అమలు చేయకే..
పుష్కరాల నిర్వహణ మార్గదర్శకాలకు భిన్నంగా వ్యవహరిచండంతోనే తొక్కిసలాట జరిగింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.
– ముప్పాళ్ల సుబ్బారావు, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు
బాబు ప్రచార యావే భక్తులను పొట్టనపెట్టుకుంది..
చంద్రబాబు ప్రచార యావ భక్తులను పొట్టన పెట్టుకుంది. 29 మంది చనిపోవడానికి సీఎం చంద్రబాబే కారణమని తేలింది.
– జక్కంపూడి విజయలక్ష్మి, న్యాయవాది, వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యురాలు
Comments
Please login to add a commentAdd a comment