
మువ్వాకు బిగుస్తున్న ఉచ్చు
నెల్లూరు (సెంట్రల్): జిల్లా విద్యాశాఖాధికారిగా వ్యవహరిస్తూ సస్పెన్షన్‌కు గురైన మువ్వా రామలింగంకు ఉచ్చు బిగుసుకుంటోంది. ఆయన పనితీరుపై పలు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. అందులో భాగంగా రెండు రోజుల క్రితం హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులు నెల్లూరు డీఈఓ కార్యాలయానికి వచ్చి పలు ఫైళ్లు తనిఖీ చేసుకున్నారు. కొన్నింటిని తమ వెంట తీసుకెళ్లారు. ఈ విషయంలో విద్యాశాఖలో కలకలం రేపుతోంది. విచారణ ఎటుపై ఎటువచ్చి ఎవరి మెడకు బిగుసుకుంటుందోనని పలువురు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా రామలింగం కోటరీగా వ్యవహరించిన వారిలో గుబులు మొదలైంది.
అసలేం జరిగింది..?
డీఈవోగా రామలింగం పనిచేస్తున్న సమయంలో పలువురు ఉపాధ్యాయులు కరస్పాండెన్స్ పద్ధతిలో పీజీ, డీగ్రీలను సాధించి స్కూలు అసిస్టెంట్లుగా ప్రమోషన్లు పొందారు. వీరిలో చాలా మంది పరీక్షలకు హాజరుకాకుండానే సర్టిఫికెట్లు పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. పరీక్షలు జరిగిన సమయంలో ఉపాధ్యాయులు విధుల్లోనే ఉన్నట్లు రిజిస్టర్‌లో సంతకాలు ఉన్నట్లు ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన విచారణలో తేలింది.
టీపీ గూడూరు మండలానికి చెందిన ఓ ఉపాధ్యాయురాలు ఇదే కోవలో ఉద్యోగోన్నతి పొందినట్లు, ఆమెలాగా చాలా మంది ఉన్నట్లు అధికారులు తేల్చారు. మరోవైపు రామలింగం హయాంలో జరిగిన ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతుల్లో అక్రమాలు జరిగాయని పలు ఉపాధ్యాయ సంఘాలు అప్పట్లోనే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాయి.
విచారణ కమిటీ సభ్యులు తీగలాగితే డొంక కదిలినట్టు మువ్వా అక్రమాల పుట్ట పగిలింది. ప్రభుత్వ ఆర్డర్ల పేరుతో పెద్దఎత్తున ఉపాధ్యాయుల అక్రమ బదిలీలకు పచ్చజెండా ఊపినట్టు తెలిసింది. ఇందులో లక్షలకు లక్షలు చేతులు మారినట్లు సమాచారం.
అర్హత లేని వారిని డిప్యూటీ ఈవోలుగా నియమించి తనకు ఆర్థిక వనరులు సంపాదించి పెట్టేందుకు మార్గాన్ని సుగమం చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి.
తనను ప్రశ్నించిన వారి పాఠశాలలను ఒకటికి పదిసార్లు తనిఖీలు చేయడం, వారి మీద సస్పెన్షన్ వేటు వేయడం, అదే సమయంలో తన అనుయాయులు పాఠశాలకు వెళ్లకపోయినా పట్టించుకోరని రామలింగం ఆరోపణలు ఎదుర్కొన్నారు.
ప్రభుత్వ అధికారులు చేసిన విచారణలోనూ రామలింగం హయాంలో అనేక అవకతవకలు జరిగాయని తేల్చారు. ఉద్యోగోన్నతులపై విచారణ జరపాలని ఉన్నతాధికారులు ఆదేశించినా ఆయన పట్టించుకోలేదని తెలిసింది. తనకు అనుకూలంగా ఉన్న వారు ఉద్యోగోన్నతులు పొందడంతోనే ఆయన విచారణ జరపలేదని ప్రస్తుత విచారణలో తేలినట్లు సమాచారం.