సాక్షి, తూర్పుగోదావరి,రాజమహేంద్రవరం: గోదావరి పుష్కరాల తొలి రోజున జరిగిన తొక్కిసలాట ఘటనకు బాధ్యులు ఎవరన్నదానిపై ఓ వైపు చర్చ సాగుతున్న సమయంలో రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు మరింత వివాదాస్పదంగా మారుతున్నాయి. శుక్రవారం కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు వీఐపీ ఘాట్‌ను కాదని పుష్కర ఘాట్‌కు తనకు తానుగా వెళ్లలేదని, అప్పటి కలెక్టర్, ఎండోమెంట్ కమిషనర్, కంచికామకోటి పీఠాధిపతుల సూచన మేరకే పుష్కర ఘాట్‌లో స్నానం చేసేందుకు వెళ్లారని చెప్పారు. తొక్కిసలాట ఘటనపై విచారణ కోసం నియమించిన జస్టిస్ సీవై సోమయాజుల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి అందించిన నివేదికలో పుష్కర ముహూర్తంపై మీడియా ప్రచారం, భక్తుల మూఢ నమ్మకమే తొక్కిసలాటకు కారణమని పేర్కొంది. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలంటూ ఏడాది ముందుగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా చేసిన ప్రచారం కమిషన్ తన నివేదికలో ప్రస్తావించ లేదు.
వీఐపీ ఘాట్‌ను వదిలి సీఎం చంద్రబాబు పుష్కరఘాట్‌కు ఎందుకు వెళ్లారన్న విషయం కూడా ఎక్కడా పేర్కొన లేదు. వీఐపీలు స్నానం కోసం గంటల తరబడి పుష్కర ఘాట్‌లో ఉండి, అప్పటి వరకు భక్తులను నిలువరించి ఒక్కసారిగా వదలడంతోనే తొక్కిసలాట జరిగిందని అప్పటి కలెక్టర్ ఇచ్చిన ప్రాథమిక నివేదికనూ కమిషన్ పరిగణనలోకి తీసుకోకపోవడంపై నివేదిక విశ్వసనీయతపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రద్దీ ఎక్కువగా ఉంటే ఇతర ఘాట్లకు భక్తులను మళ్లించకపోడంపై ఎవరిది తప్పు? మళ్లించేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారన్న అంశాలను విచారణలో అఫిడవిట్‌దారులు ప్రస్తావించినా నివేదికలో ఆయా అంశాలపై కమిషన్ తన వైఖరిని నివేదికలో పేర్కొనలేదు. పైన పేర్కొన్న ఏ విషయాన్నీ నివేదికలో ప్రస్తావించని కమిషనర్ తొక్కిసలాటకు మీడియా, భక్తులునే బాధ్యులుగా చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న తరుణంలో సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
కలెక్టర్‌ను విచారణకు డిమాండ్ చేసినా..
విచారణ సమయంలో అఫిడవిట్‌దారులు ముప్పాళ్ల సుబ్బారావు, శ్రీనివాస్‌లు జిల్లా కలెక్టర్‌ను విచారించాలని పలుమార్లు డిమాండ్ చేశారు. అప్పుడే ఈ ఘటనపై నిజానిజాలు బయటకొస్తాయని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు వీఐపీ ఘాట్‌ను వదిలి పుష్కరఘాట్‌కు ఎలా వెళ్లారు? ఎవరు అనుమతిచ్చారు? అన్న విషయాలు తెల్చాలని విచారణలో కోరారు. రద్దీ నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అంబులెన్స్ వెళ్లేందుకు కూడా దారి లేదని, పుష్కరాల నిర్వహణ మార్గదర్శకాలు అడుగడుగునా ఉల్లంఘించారంటూ వాదనలు వినిపించారు. అయినా కమిషన్ ఇవేమీ పట్టించుకోకుండా తొక్కిసలాటకు, సీఎం చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేదంటూ తేల్చింది. 29 మంది ప్రాణాలు కోల్పోయి, 51 మంది గాయపడిన ఘటనలో ఎవరినీ బాధ్యులను చేయకపోవడం చరిత్రలో ఇదే ప్రథమమని కమిషన్ విశ్వసనీయతపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య వీఐపీలకు కేటాయించిన సరస్వతి ఘాట్‌ను వదిలి సీఎం చంద్రబాబు పుష్కర ఘాట్‌కు కలెక్టర్, ఎండోమెంట్ కమిషనర్, కంచికామకోటి పిఠాధిపతి సూచన మేరకే వెళ్లారని చెప్పడంతో విచారణ కమిషనర్ ఇవేమీ పట్టించుకోకుండా తూ తూ మంత్రంగా నివేదిక ఇచ్చిందన్న ఆరోపణలకు బలం చేకూరుతోంది.
భక్తుల ఉసురు ఖచ్చితంగా తగలుతుంది
సీఎం చంద్రబాబు ప్రచార యావ వల్లే తొక్కిసలాట జరిగిందని ఎవరిని అడిగినా చెబుతారు. వీఐపీ ఘాటను వదిలి పుష్కరఘాట్‌కు వెళ్లకపోతే భక్తులను ఆపేవారు కాదు. తొక్కిసలాట జరిగేదీ కాదు. గంటల కొద్దీ సీఎం చంద్రబాబు స్నానం, పూజలు చేశారు. ముహూర్తం ఉదయం 6:26కే సీఎం చంద్రబాబు, ఇతర వీఐపీలు స్నానం చేశారు. కమిషనర్ పేర్కొన్నట్లు భక్తులది మూఢనమ్మకమైతే సీఎం చంద్రబాబుది కూడా మూఢ నమ్మకమేనా? కృష్ణా పుష్కరాల్లో ప్రమాదం జరిగి ఒకరు చనిపోతే అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారులపై చర్యలు తీసుకున్నారు. ఇక్కడ 29 మంది చనిపోయి, పదుల సంఖ్యలో గాయపడితే కనీసం చిన్నస్థాయి అధికారిపై కూడా చర్యలు తీసుకోలేదు. తొక్కిసలాట పాపం ఖచ్చితంగా చంద్రబాబుకు తగులుతుంది.– జక్కంపూడి విజయలక్ష్మి,న్యాయవాది, అఫిడవిట్‌దారు, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యురాలు
బుచ్చయ్య చౌదరిగారు నివేదికను చదివినట్లు లేదు
బుచ్చయ్య చౌదరిగారు నివేదికను చదివినట్లు లేదు. చదివితే ఇది అసంపూర్తిగా ఉన్నట్లు తాను అంచనాకు వస్తారు. విచారణలో వాదనలు నివేదికలో లేవు. నిబంధనలు ఉల్లంఘించారని స్పష్టంగా రాతపూర్వకంగా ఆధారాలు చూపించాం. మార్గదర్శకాలు, ఉల్లంఘనులు స్పష్టంగా పేర్కొన్నాం. అవేమీ పట్టించుకోలేదు. ఏదో నామమాత్రంగా రాసి ఇచ్చేశారు. మీడియా, భక్తుల మూఢనమ్మకాలే కారణం అంటూ చెప్పడం దారుణం. ప్రతిపక్షాలు ప్రచారం కోసం మాట్లాడుతుంటాయనడం సరికాదు. ఫలానా వ్యక్తి ముహూర్తం పెట్టారని బుచ్చయ్య చౌదరి చెబుతున్నారు. దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వాణిజ్య ప్రకటనలు ఇచ్చింది. మరి ఈ తప్పు ఎవరిది? మీడియా ముహూర్తం పెట్టినట్లు, ప్రచారం చేసినట్లు కమిషన్ పేర్కొంది. నివేదికను బుచ్చయ్య చౌదరి గారికి పంపుతాం. చదవండి, – ముప్పాళ్ల సుబ్బారావు,
న్యాయవాది, ఏపీ బార్‌కౌన్సిల్ సభ్యుడు, రాజమహేంద్రవరం.
Comments
Please login to add a commentAdd a comment