
ఎవరి పనులు వారు చేయాలి
భారత రాజ్యాంగం మూడు వ్యవస్థలను ఏర్పాటు చేసి, వాటి పరిధులను నిర్దేశించి, ప్రజలకు చక్కని పరిపాలన అందించమని సూచించిందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ చెప్పారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ
సాక్షి, విజయవాడ: భారత రాజ్యాంగం మూడు వ్యవస్థలను ఏర్పాటు చేసి, వాటి పరిధులను నిర్దేశించి, ప్రజలకు చక్కని పరిపాలన అందించమని సూచించిందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ చెప్పారు. ఒక వ్యవస్థ సరిగా పనిచేయకపోతే మరో వ్యవస్థ దాన్ని స్వీకరించాల్సి వస్తోందన్నారు. ఒక వ్యవస్థ అధికారాలను న్యాయవ్యవస్థ లాక్కుంటోందనడం సరికాదని పేర్కొన్నారు. ఆయన ఆదివారం విజయవాడలో ‘జ్ఞాపకాలం’ (కంఠంనేని రవీంద్రరావు గారి ఆలోచనలు, డైరీలు - మిత్రుల అభిప్రాయాలు) పుస్తకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం కంఠంనేని రవీంద్రరావు తొలి స్మారకోపన్యాసం చేసిన జస్టిస్ ఎన్.వి.రమణ మాట్లాడుతూ ఎవరు చేయాల్సిన పనులు వారు చేయకపోతే రాజ్యాంగేతర శక్తులు ఆ స్థానాన్ని ఆక్రమించే ప్రమాదం ఉందని చెప్పారు. నేటి యువత మంచి ఉద్యోగాలు వస్తే సరిపోతుందని ఆలోచిస్తోందే తప్ప నాయకత్వం వహించేందుకు ముందుకు రావడం లేదన్నారు. సీనియర్ న్యాయవాది కంఠంనేని రవీంద్ర ప్రజలకు దగ్గరైనది ఆయన వద్ద డబ్బు, పదవులు ఉండటం వల్ల కాదని, పేదలకు సేవచేయటం వల్లేనని చెప్పారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ జస్టిస్ జి.భవానీప్రసాద్, చైన్నై డెట్స్ రికవరీ అప్పిలెట్ ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ కె.జి.శంకర్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తదితరులు ప్రసంగించారు.