హైదరాబాద్ను ఎందుకు పొగొట్టుకోవాలి
న్యూఢిల్లీ : రాష్ట్రం కలిసి ఉండాలని దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కోరుకున్నారని ఆయన సతీమణి వైఎస్ విజయమ్మ అన్నారు. తెలుగు ప్రజలంతా కలిసి ఉండాలని, అందరూ సంతోషంగా ఉండాలని వైఎస్ కోరుకున్నారన్నారు. సమన్యాయం చేయాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుధవారం ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ధర్నా చేపట్టింది. పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నేతృత్వంలో పార్టీ నేతలు ఈ ధర్నాలో పాల్గొన్నారు.
విజయమ్మ ముందుగా ధర్నా ప్రాంగణంలోని వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ధర్నాలో కూర్చున్నారు. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ పాలన గాడి తప్పిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నేడు ఏ ఒక్కరూ సంతోషంగా లేరని ఆమె అన్నారు. వైషమ్యాలకు టీడీపీ, కాంగ్రెస్ పార్టీలే కారణమని విజయమ్మ వ్యాఖ్యానించారు. రాష్ట్రం అగ్నిగుండంగా మారిందని అన్నారు.తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు రగిల్చారని విజయమ్మ పేర్కొన్నారు. రాష్ట్ర విభజనపై సమన్యాయం చేయాలనే డిమాండ్తోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే ఏవిధంగా న్యాయం చేస్తారన్నారు.
రాష్ట్రం కలిసి ఉండాలని వైఎస్ఆర్ కోరుకున్నారని విజయమ్మ తెలిపారు. అన్ని ప్రాంతా అభివృద్ధికి వైఎస్ కృషి చేశారన్నారు. హైదరాబాద్ను తెలుగువాళ్లు ఎందుకు పోగొట్టుకోవాలని విజయమ్మ ప్రశ్నించారు. మూడు ప్రాంతాల ప్రజలు కలిసి అభివృద్ధి చేసుకున్న హైదరాబాద్ నగరాన్ని ఒక్క తెలంగాణ ప్రాంతానికే ఎలా కేటాయిస్తారంటూ వైఎస్ విజయమ్మ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్ర విభజన విషయంలో అసెంబ్లీలో తీర్మానం అవసరం లేదనటం ఎంతవరకూ సమంజసమన్నారు. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాలు చేసింది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనని విజయమ్మ పేర్కొన్నారు. కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ ఫార్మెట్లో రాజీనామాలు చేస్తే సీడబ్ల్యూసీ వెనక్కి తగ్గుతుందన్నారు.