
శాడిస్ట్ అరవింద్‌ను చితకబాదుతున్న దృశ్యం
కర్నూలు, డోన్: ఓ శాడిస్టుకు భార్యతో పాటు ఆమె తరఫు బంధువులు దేహశుద్ధి చేశారు. ఈ ఘటన సోమవారం డోన్ పట్టణ పోలీసుస్టేషన్ ఎదుట చోటుచేసుకుంది. వివరాలిలా.. డోన్ తారకరామనగర్‌కు చెందిన కావ్యకు గత డిసెంబర్ 7న అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన అరవింద్‌తో వివాహమైంది. పెళ్లయిన నాటి నుంచే ఆమెను అదనపు కట్నం కోసం వేధించడమే కాకుండా శారీరకంగా చిత్రహింసలు పెట్టేవాడు. పైగా వాటిని వీడియో తీసేవాడు. దీంతో వారం క్రితం ఆమె తన భర్తపై డోన్ పట్టణ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణకు పిలవడంతో అరవింద్ సోమవారం స్టేషన్ సమీపంలోకి రాగానే కావ్య, ఆమె తరఫు బంధువులు మూకుమ్మడిగా దాడి చేశారు. చెప్పులతో కొడుతూ..కాళ్లతో తంతూ దేహశుద్ధి చేశారు. దీంతో పోలీసులు అప్రమత్తమై వారిని నియంత్రించడంతో అరవింద్ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని స్టేషన్‌లోకి పరుగు తీశాడు.