నాలుగు నెలల క్రితమే మూడుముళ్లు వేశాడు. కట్నకానుకల రూపంలో సుమారు రూ.12 లక్షలు జేబులో వేసుకున్నాడు. జీవితాంతం తోడుంటానని అగ్నిసాక్షిగా బాసలు చేశాడు. అవన్నీ మరచిపోయాడు. రెండో పెళ్లిపై ఆశలు పెంచుకున్నాడు. భార్య స్వల్ప అనారోగ్యానికి గురైతే దాన్నే ఫిట్స్‌గా భూతద్దంలో చూపాడు. తనే భూతంలా మారిపోయి విడాకులు ఇవ్వాలని, చచ్చిపోవాలని వేధింపులు మొదలెట్టాడు. అక్కడితో ఆగకుండా భార్యకు ఫోన్ చేసి రెండో పెళ్లి చేసుకుంటున్నానని తెగేసి చెప్పాడా భర్త నారాయణరావు. దాంతో కుంగిపోయిన అమాయకురాలు సుజాత లావేరు మండలం బుడతవలసలోని తాతగారింట్లో ఉరేసుకుని తనువు చాలించింది. ఆగ్రహించిన స్థానికులు నయవంచక భర్తపై దాడి చేసి దేహశుద్ధి చేశారు. పోలీసులు అడ్డుపడటంతో అతను బతికిపోయాడు.
లావేరు, న్యూస్‌లైన్:
పెళ్లై నాలుగు నెలలే అయింది. ఏ ముచ్చటా తీరలేదు. ఇంతలో భర్తకు అనుమాన పిశాచం పట్టుకుంది. భార్యకు ఫిట్స్ ఉందని, విడాకులు ఇస్తే వేరే పెళ్లి చేసుకుంటానని వేధించడం మొదలుపెట్టాడు. దీన్ని తట్టుకోలేక ఆమె సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆగ్రహం చెందిన మృతురాలి బంధువులు, గ్రామస్తులు భర్తపై దాడి చేశారు. లావేరు మండలం బుడతవలసలో జరిగిన సంఘటన వివరాలు ఇవీ... రణస్థలం మండలం నగరంపాలెంకు చెందిన కెల్ల దాలమ్మ కుమారుడు సత్యనారాయణకు విజయనగరం జిల్లా గరివిడి మండలం అర్తమూరుకు చెందిన పున్నాన నారాయణరావు, వరలక్ష్మి దంపతుల(ప్రస్తుతం విజయవాడలో నివాసముంటున్నారు) కుమార్తె సుజాత(19)తో గత ఏడాది ఆగస్టు 30న పెళ్లయింది. ఆ తర్వాత పది రోజులకు సుజాత కాళ్లు, చేతులు కొట్టుకుంటూ స్పృహతప్పి పడిపోవడంతో ఫిట్స్ ఉందని భర్త, అత్త భావించారు. అప్పటి నుంచి ఆమెను వేధించసాగారు. దీన్ని తట్టుకోలేకపోయిన సుజాత కొద్ది రోజులకే పుట్టింటికి వెళ్లిపోయింది. గత నవంబర్‌లో పెద్దమనుషులు నచ్చజెప్పడంతో సుజాత అత్తారింటికి వచ్చింది. అయితే వేధింపులు తగ్గలేదు.
ఈ నేపథ్యంలో నవంబర్ 23న సుజాతను ఆమె తండ్రి నారాయణరావు శ్రీకాకుళం తీసుకువెళ్లి పరీక్షలు చేయించగా ఫిట్స్ లేదని తేలింది. ఈ విషయాన్ని సత్యనారాయణకు చెప్పినా వినిపించుకోకుండా వేధింపులు కొనసాగించారు. విసిగిపోయిన సుజాత కొద్ది రోజులకే బుడతవలసలో ఉంటున్న తాతయ్య రౌతు అప్పలనరసయ్య, అమ్మమ్మ ఆదిలక్ష్మి ఇంటికి వెళ్లిపోయింది. ఇదిలా ఉంటే డిసెంబర్ 31న సుజాతకు ఫోన్ చేసిన సత్యనారాయణ జనవరి 1న రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు చెప్పాడు. దీంతో ఆమె రణస్థలం మం డలం వేల్పురాయికి చెందిన రమణమూర్తి(వరుసకు సోదరుడు)తో కలిసి రణస్థలంలో భర్త నడుపుతున్న సెల్ పాయింట్‌కు వెళ్లి ఆయనతో మాట్లాడి సాయంత్రం తిరిగి బుడతవలస వెళ్లిపోయింది. గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని ఉన్న సుజాతను చూసిన మేనమామ కూతురు సంధ్య కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. గ్రామస్తుల సహకారంతో గది తలుపులు తెరిచి చూడగా సుజాత మృతి చెందినట్లు గుర్తించి విజయవాడలో ఉంటున్న నారాయణరావు, వరలక్ష్మికి సమాచారం అందించారు. శుక్రవారం ఉదయం ఆయన వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రణస్థలం సీఐ అశోక్‌కుమార్, లావేరు ఎస్‌ఐ రామారావు, ఎచ్చెర్ల ట్రైనీ ఎస్‌ఐ కృష్ణ సిబ్బందితో వచ్చి వివరాలు సేకరించారు. సత్యనారాయణ వేధింపులు తాళలేక సుజాత ఉరివేసుకున్నట్లు ఆమె తల్లిదండ్రులు చెప్పారు. డిప్యూటీ తహశీల్దార్‌సుధాప్రకాష్, ఆర్‌ఐ శ్రీనివాసరావు, గ్రామ పెద్దల సమక్షంలో శవపంచానామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని అరెస్టు చేసి జైలుకు పంపిస్తామని సీఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నామని సీఐ, ఎస్‌ఐ తెలిపారు.
మృతురాలి భర్తపై బంధువులు, గ్రామస్తుల దాడి
ఇదిలా ఉండగా సుజాత మృతికి కారకుడని సత్యనారాయణపై మృతురాలి బంధువులు, బుడతవలస గ్రామస్తులు దాడికి దిగారు. సుజాత గురువారం సాయంత్రం మృతి చెందితే శుక్రవారం ఉదయం వరకూ భర్త రాకపోవడంతో వారి ఆగ్రహం కట్టలు తెంచుకుంది.దీంతో పోలీసులు రక్షణగా నిలిచి సత్యనారాయణను ఓ ఇంట్లోకి తీసుకువెళ్లారు. సుమారు రెండు గంటల తర్వాత పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళుతుండగా గ్రామస్తులు వెంటాడారు. ముఖ్యంగా మహిళలు శాపనార్థాలు పెట్టారు. ఓ దశలో గ్రామస్తులు పోలీసులతో వాదనకు దిగడంతో కొద్దిసేపు తోపులాట జరిగింది.
కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు
సుజాత జీవితం బాగుంటుందని పెళ్లి సమయంలో కట్నకానుకల కింద *12 లక్షలు ఇచ్చామని నారాయణరావు, వరలక్ష్మి చెప్పారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తె జీవితం పెళ్లి ముచ్చట్లు తీరకముందే ఇలా అవుతుందని అనుకోలేదని రోదిస్తూ చెబుతున్న వారిద్దరినీ ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. సత్యనారాయణను కఠినంగా శిక్షించాలని వారు కోరారు. ఇదిలా ఉండగా సత్యనారాయణకు రణస్థలంలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న యువతితో సబంధం ఉన్నట్లు తెలిసింది. ఆమెను పెళ్లి చేసుకోడానికే భార్య సుజాతకు ఫిట్స్ ఉన్నట్లు ప్రచారం చేసి వేధిస్తుండేవాడని సమాచారం. రణస్థలానికి చెందిన యువతిని పెళ్లిచేసుకుంటానని సత్యనారయణ చెప్పాడని అతని స్నేహితుడు రమణమూర్తి చెప్పడం గమనార్హం.
వేధింపుల ‘ముడి’ వేశాడు!
Published Sat, Jan 4 2014 2:37 AM | Last Updated on Sat, Sep 2 2017 2:15 AM
Advertisement
Advertisement