
భార్యను కడతేర్చిన భర్త
భీమవరం అర్బన్ :తాళి కట్టిన ఆలి గొంతు కర్కశంగా నులిమేశాడు ఓ మృగాడు. పసుపు పారాణి ఆరకముందే నుదుట సింధూరం దిద్దిన చేతులతోనే ఆమె నిండు నూరేళ్ల జీవితాన్ని నిర్ధాక్షణ్యంగా చిదిమేశాడు. పట్టణంలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఈ హృదయవిదారక ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. స్థానిక గొల్లవానితిప్పరోడ్‌లోని ప్రకాష్‌నగర్ ప్రాంతంలోని లోసరి పంట కాలువ గట్టున నివాసముంటున్న మల్లుల వెంకటేశ్వరరావుకు పెనుమంట్ర మండలం బ్రాహ్మణచెరువు గ్రామానికి చెందిన ఉమామహేశ్వరి (19)కి ఈ ఏడాది మేలో వివాహమైంది. భవనాలకు టైల్స్ అతికే పనులు చేసే వెంకటేశ్వరరావు భార్య ఉమామహేశ్వరిని పెళ్లయిన నాటి నుంచి ఉన్మాదిగా మారి చీటికిమాటికీ వేధింపులకు గురిచేస్తుండేవాడు.
దీనిపై పలుమార్లు ఫోన్‌లో తల్లిదండ్రులకు ఉమామహేశ్వరి తన గోడును వెళ్లబోసుకునేది. దీంతో ఫోన్‌లో సైతం తల్లిదండ్రులతో మాట్లాడకుండా అడ్డుకునేవాడు. ఈ నేపథ్యంలో సోమవారం ఇంటి తలుపులు గడియ పెట్టి భార్యను చిత్రహింసలకు గురిచేశాడు. ఈ బాధలు తట్టుకోలేక ఆమె గట్టిగా కేకలు వేసింది. దీంతో ఉమామహేశ్వరి గొంతు నులిమి వెంకటేశ్వరరావు దారుణంగా హత్య చేశాడు. తొలుత బిగ్గరగా ఉమామహేశ్వరి కేకలు విన్న స్థానికులకు అనంతరం వెంకటేశ్వరరావు దుఃఖిస్తున్నట్టు వినిపించడం, ఉమామహేశ్వరి తలుపు తీయకపోవడంతో అనుమానించారు. వెంటనే తలుపులు కొట్టి పిలిచారు. లోపల నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో వడ్రంగి మేస్త్రిని పిలిచించి తలుపు గడియలను తొలగించి ఇంట్లోకి వెళ్లి చూశారు.
లోపల గదిలో మంచంపై ఉమామహేశ్వరి నిర్జీవంగా పడి ఉండటాన్ని గమనించి వెంకటేశ్వరరావును ప్రశ్నించగా అతను అక్కడ నుంచి పరారయ్యాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సీఐ జయసూర్య ఆధ్వర్యంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికులు, బంధువుల నుంచి వివరాలను ఆరా తీశారు. అదే సమయంలో ఏమీ తెలియనట్లు ఇంటికి వచ్చిన వెంకటేశ్వరరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉన్మాదిగా మారి ఉమామహేశ్వరిని కడతేర్చాడంటూ బంధువుల రోదిస్తున్న తీరు స్థానికులను కలచివేసింది. బంధువుల ఫిర్యాదు మేరకు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.