మద్యం మత్తులో భార్యను హతమార్చిన భర్త
Published Tue, Aug 27 2013 3:32 AM | Last Updated on Mon, May 28 2018 1:08 PM
మాధవపట్నం (సామర్లకోట), న్యూస్‌లైన్ : అనుమానం పెనుభూతమైంది. భార్యను హతమార్చి, కుమారుడిపై కత్తితో దాడి చేసేందుకు ప్రేరేపించింది. జిల్లాలో సోమవారం సంచలనం కలిగించిన ఈ సంఘటన మాధవపట్నంలో జరిగింది. ఇంద్రపాలెం పోలీసులు, స్థానికుల వివరాలు ఇలా ఉన్నాయి.
మాధవపట్నంలోని సూరమ్మ చెరువు వద్ద వైఎస్సార్ కాలనీలో అనుకూరి కృష్ణ, బుజ్జమ్మ(40) దంపతులు నివసిస్తున్నారు. అతడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండగా, బుజ్జమ్మ గ్రామంలో వడ్డీ వ్యాపారం చేస్తోంది. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ముగ్గురికీ వివాహలు అయిపోవడంతో వేర్వేరుగా ఉంటున్నారు. పెద్ద కుమారుడు హైదరాబాద్‌లో నివసిస్తుండగా, చిన్న కుమారుడు శ్రీను తండ్రి ఇంటి ఎదురుగా ఉంటున్నాడు. ఆదివారం రాత్రి ఇంటికొచ్చిన కృష్ణ మద్యం మత్తులో భార్యతో గొడవ పడ్డాడు. అక్రమ సంబంధం అంటగట్టి.. ఇంట్లో ఉన్న కత్తితో బుజ్జమ్మపై ఆరుసార్లు వేట్లు వేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది. తీవ్రంగా గాయపడి, అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను మాయం చేయాలన్న ఉద్దేశంతో దుప్పట్లలో మూట కట్టి.. ఇంట్లో ఓ మూలన ఉంచాడు.
ఈ విషయం తెలిస్తే కుమారుడు తనపై దాడి చేస్తాడని అతడికి అనుమానం వచ్చింది. ఈ క్రమంలో అతడు కుమారుడు శ్రీను వద్దకు వెళ్లి ‘అమ్మకు అనారోగ్యంగా ఉంది, ఆస్పత్రికి తీసుకెళ్లాలి’ అని చెప్పి ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికి వచ్చిన వెంటనే అక్కడున్న కత్తితో కృష్ణ అతడిపై దాడి చేశాడు. రెండు చేతులు తెగి వేలాడడంతో అతడు వేసిన కేకలు ఈ ప్రాంతంలో దద్దరిల్లాయి. స్థానికులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
అక్కడ బుజ్జమ్మ మరణించగా, శ్రీను కోమాలో ఉన్నాడు. నిందితుడు కృష్ణ పరారీ ఉన్నాడు. అక్రమ సంబంధం అనుమానంతో నిందితుడు ఈ హత్యకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే తరుచూ భార్య వద్ద ఉన్న నగదు కోసం కృష్ణ గొడవ పడుతుండే వాడని స్థానికులు తెలిపారు. సర్పంచ్ పిల్లి కృష్ణప్రసాద్ ఫిర్యాదు మేరకు ఇంద్రపాలెం ఎస్సై మురళీకృష్ణ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. హత్యకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేయాల్సి ఉందన్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడని ఎస్సై చెప్పారు.
Advertisement
Advertisement