భట్టువారిపాలెం (కలిగిరి), న్యూస్‌లైన్: వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి తెలిపారు. భట్టువారిపాళెంలోని ఎస్సీ కాలనీలో గ్రావెల్ రోడ్డు పనులను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివారం ఇడుపులపాయలో జరిగిన ప్లీనరీ సమావేశాల్లో ప్రజల శ్రేయస్సు కోసం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారన్నారు.
జగన్‌మోహన్‌రెడ్డి ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటారన్నారు. రాజన్న రాజ్యం రావాలన్నా, వైఎస్సార్ చేపట్టిన సంక్షేమ పథకాలు అమలు కావాలన్నా జగన్‌తోనే సాధ్యమవుతుందని ప్రజలు ప్రగాఢ విశ్వాసంతో ఉన్నారన్నారు.
కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడినా ప్రజల ఆదరణతో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడాన్ని అడ్డుకోలేరన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. భట్టువారిపాలెం కాలనీవాసుల కోరిక మేరకు నియోజకవర్గ అభివృద్ధి పనుల్లో భాగంగా తన నిధుల నుంచి రూ. లక్ష కేటాయించినట్లు తెలిపారు. ప్రజలకు ఎళ్లవేళలా అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు. రోడ్డు ప్రమాదంలో కాలును కోల్పోయిన ఏడోతరగతి విద్యార్థిని మూలి అనూషకు అన్ని విధాలుగా సాయం అందిస్తామని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.
రాజన్నదళంకు ఓటు వేస్తే విలువ లేదు
నియోజకవర్గంలో కొత్తగా పుట్టుకొచ్చిన రాజన్నదళం పార్టీకి ఓట్లు వేస్తే విలువ ఉండదని మేకపాటి చంద్రశేఖరరెడ్డి అన్నారు. ఆ పార్టీ ఏర్పాటు చేసిన మెట్టుకూరు చిరంజీవిరెడ్డిని గతంలో అన్ని విధాలుగా ఆదరించానన్నారు. ఆయన సూచించిన వారికే పదవులను కట్టబెట్టామన్నారు. అయితే ఆయన నమ్మక ద్రోహం చేశారన్నారు. వారి పరిధిలోని గ్రామాలకు తనను అసలు తీసుకువెళ్లలేదన్నారు. తను, తన సోదరుడు నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి మండలంలో పర్యటిస్తుంటే అతను వేరే వారి వద్దకు వెళ్లడం ఎంత వరకు సబబన్నారు. వైఎస్సార్‌పై ప్రేమ, అభిమానాలతో తాము పదవులకు రాజీనామాలు చేసి జగన్‌మోహన్‌రెడ్డికి అండగా నిలిచామన్నారు. చిరంజీవిరెడ్డి వైఎస్సార్ బొమ్మతో ప్రజల్లోకి ఎలా వెళతారని ప్రశ్నించారు. జగన్‌మోహన్‌రెడ్డి తరఫున పోటీ చేస్తున్న తమను గెలిపించాలని, నమ్మకద్రోహులకు బుద్ధి చెప్పాలని ఆయన కోరారు.
కాలనీలో నిరుపయోగంగా ఉన్న బావిని పూడ్పించాలని కాలనీవాసులు ఎమ్మెల్యేని కోరారు. బావిని పూడ్చడానికి చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. రోడ్డు పనుల ప్రారంభంలో భాగంగా చర్చి ఫాదర్ ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఏఈ శ్రీనివాసులు, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ నోటి శ్రీనివాసులురెడ్డి, స్థానిక నాయకులు కందుల విల్సన్, మాదాల శ్రీనివాసులు, అంకిరెడ్డి, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తాం
Published Tue, Feb 4 2014 4:58 AM | Last Updated on Tue, May 29 2018 4:09 PM
Advertisement