
మోత్కుపల్లి... పయనమెటు!
టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు పయనమెటు..? జిల్లా తెలుగుదేశంలో ఇప్పుడిదో
హాట్ టాపిక్. ఆలేరు నుంచి వలసపోయిన ఆయన గత ఎన్నికల్లో తుంగతుర్తిలో పోటీ చేసి గెలిచారు. ఆయనకు ఆ ఎన్నికల్లో అన్నీ తానై వ్యవహరించిన ‘సంకినేని’ దూరం కావడంతో.. కేడరూ దూరమైపోయింది. దీంతో తుంగతుర్తి నుంచి సొంత నియోజకవర్గం ఆలేరుకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారని సమాచారం. ఈలోగా కొత్త ప్రచారమూ జరుగుతోంది..!!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : రాజ్యసభ ఎన్నికల్లో అధినేత చంద్రబాబు చేయి ఇవ్వడంతో జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు పూర్తిగా కామ్ అయ్యారు. వివిధ సమీకరణాల వల్ల తనకు రాజ్యసభ సీటు ఖాయమని భావించిన మోత్కుపల్లి జిల్లా టీడీపీ నేతలెవరితోనూ సత్సంబంధాలు నెరపలేదు. చివరకు రాజ్యసభ ఎన్నికల ముందు జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు ఉమామాధవరెడ్డి, వేనేపల్లి చందర్‌రావులతో కనీసం మాట్లాడినట్లు కూడా లేదని చెబుతున్నారు. చివరకు ఆయనకు అవకాశం రాలేదు. ఆయన తరఫున బాబు వద్ద మాట్లాడిన వారూ లేరు. చివరి నిమిషం దాకా ఆశపెట్టుకున్న ఆయనకు బాబు పెద్ద షాకే ఇచ్చారు.
దీంతో ఆయన పార్టీ మారుతారని, కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని, కాంగ్రెస్ నేత జానారెడ్డితో మంతనాలు కూడా జరిపారని ఇలా.. వివిధ రకాలుగా ప్రచారం జరిగింది. దీంతో కొందరు టీడీపీ నేతలు రంగంలోకి దిగి మోత్కుపల్లిని బుజ్జగించారు. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్ రావు ఈ విషయంలో ఓ అడుగు ముందుకేసి మోత్కుపల్లి టీడీపీలోనే కొనసాగేలా మాట్లాడారని సమాచారం. పార్టీ వర్గాలు చెబుతున్న వివరాల మేరకు మోత్కుపల్లి ఈ సారి తుంగతుర్తి నియోజవర్గం నుంచి పోటీ ఉండరు.
ఇక్కడి కేడర్ సంకినేనితో పాటే దాదాపు బయటకు వెళ్లిపోవడంతో ఆ నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి దయనీయంగా మారింది. ఈ పరిస్థితుల్లో అక్కడి నుంచి పోటీ చేసి గెలవడం సాధ్యం కాదన్న అభిప్రాయానికే వ చ్చినట్లు చెబుతున్నారు. ఇక సొంత పార్టీ నేతలతో ఏమాత్రం సత్సంబంధాల్లేని ఆయన కాంగ్రెస్ సీనియర్ నేతలతో మాత్రం మంచి సంబంధాలనే కలిగి ఉన్నారని చెబుతున్నారు. తుంగతుర్తి నుంచి బయటకు వచ్చి ఆలేరుకు వెళ్లాలనుకున్నా, జనరల్ స్థానం కావడం ప్రతికూలంగా మారిందంటున్నారు.
జిల్లాలోనే మరో ఎస్సీ రిజర్వుడు స్థానమైన నకిరేకల్‌పైనా ఆయన దృష్టి ఉందని చెబుతున్నారు. నకిరేకల్ టీడీపీ ఇన్‌చార్జ్ పాల్వాయిరజనీ కుమారి సొంత నియోజకవర్గం తుంగతుర్తి కావడం, ఆమెకు నకిరేకల్ కేడర్‌పై పట్టు చిక్కకపోవడం, ఇక్కడి నాయకలు ఆమెకు సహకరించక పోవడం వంటి కారణాలను పరిగణనలోకి తీసుకుని వ్యూహ రచన చేస్తున్నారని తెలుస్తోంది. రజనీకుమారిని తుంగతుర్తికి పంపించి, మోత్కుపల్లి నకిరేకల్ నుంచి బరిలోకి దిగే ఆలోచనాల చేశారన్నది పార్టీ వర్గాల సమాచారం. ఇక, ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయిన ఎన్నికల ఖర్చును తట్టుకునేందుకు మరో కొత్త ఎత్తూ వేశారంటున్నారు. అధినేత చంద్రబాబుకు దగ్గరి నేతగా పేరున్న ఖమ్మం ఎంపీ నాగా నాగేశ్వర్‌రావు మోత్కుపల్లిని ఖమ్మం జిల్లాకు ఆహ్వానించారని తెలుస్తోంది.
మధిర ఎస్సీ రిజర్వుడు స్థానంలో పోటీ చేయాలని, ఎన్నికల ఖర్చులు తాను భరిస్తానని నామా హామీ ఇచ్చారని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే, ఖమ్మం జిల్లాకే చెందిన మరో సీనియర్ నేత తుమ్మల నాగేశ్వర్‌రావు దీనికి విముఖంగా ఉన్నాని తెలుస్తోంది. పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతున్న ఈ ప్రచారాన్ని విశ్లేషిస్తే, మోత్కుపల్లి పయనం ఎటువైపో ఇదమిద్దంగా అర్థం కాని పరిస్థితి ఉంది. అయితే, తుంగతుర్తిలో పోటీ మాత్రం చేయరన్న ఒక సమాధానం మాత్రం లభిస్తోంది. ఎన్నికల నగరా మోగనున్న తరుణంలో ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.