నాయకత్వం ఉంది..పార్టీని బలోపేతం చేద్దాం
వైఎస్సార్ సీపీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి జిల్లాకు వచ్చిన ధర్మాన ప్రసాదరావుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు బుధవారం ఘన స్వాగతం పలికారు. ఆమదాలవలస రైల్వే స్టేషన్ నుంచి శ్రీకాకుళం వైఎస్సార్ కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడి బహిరంగ సభలో ధర్మాన మాట్లాడుతూ పార్టీని గ్రామీణ స్థాయిలో బలోపేతం చేద్దామని పిలుపునిచ్చారు.
శ్రీకాకుళం అర్బన్: జిల్లాలో వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీకి బలమైన నాయకత్వం ఉందని, కార్యకర్తలు, ప్రజల సహకారంతో, సమష్టి కృషితో గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేద్దామని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు అన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన తరువాత జిల్లాకు బుధవారం వచ్చిన ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన వైఎస్సార్ జంక్షన్ వద్ద ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ వంశధార ప్రాజ క్టుపైనే జిల్లా అభివృద్ధి ఆధారపడి ఉందని, నిర్మాణ పనుల కోసం గత ప్రభుత్వం కోట్లాది రూపాయలు కేటాయించిందని, పనులు పూర్తయ్యేలా మంత్రి, ఎమ్మెల్యేలు కృషిచేయాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో ప్రజాస్వామ్యం పట్ల ప్రజలకు ఒక నమ్మకం ఉండేదన్నారు.
ప్రభు త్వ పథకాలు ఏ ఒక్కరికో పరిమితం కాకుం డా పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల కు అందేలా ఆయన కృషి చేశారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు కావస్తున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో నేతలు ఘోరంగా విఫలం చెందారన్నారు. కేవలం కక్షసాధింపు చర్యలకే పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. రేషన్ డీలర్లను తొలగించి టీడీపీకి చెందిన వారికి కట్టబెట్టేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. విభజన వల్ల నష్టపోయిన రాష్ట్రాలకు కేం ద్రం ఇచ్చే సంస్థలు ఒక్కటి కూడా జిల్లాకు రాలేదన్నారు. జిల్లాకు చెందిన మంత్రి, ఎమ్మెల్యేలు వారి వాదనలు గట్టిగా వినిపించకపోవడం వల్లే ఈ దుస్థితి నెలకొందని దుయ్యబట్టారు. చంద్రబాబు రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులను పూర్తిగా మోసం చేశారన్నారు.
మాజీ మంత్రి తమ్మినేని సీతారాం మాట్లాడుతూ పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శిగా ధర్మాన ప్రసాధరావును, పార్టీ బీసీసెల్ రాష్ట్ర అధ్యక్షునిగా ధర్మాన కృష్ణదాస్‌ను, పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా రెడ్డి శాంతి లను నియమించడం హర్షణీయమన్నారు. వీరి నాయకత్వంలో పార్టీని అభివృద్ధి చేసేందుకు ముందుకు వెళదామన్నారు. చంద్రబాబు పాలన ఔరంగజేబును తలపిస్తోందన్నారు. కర్నూలులో స్వాతంత్య్ర వేడుకలు, విశాఖలో మొదటి క్యాబినెట్ సమావేశం, విజయవాడలో కలెక్టర్‌ల సమావేశం... ఇలా రకరకాల కార్యక్రమాలు రకరకాల చోట్ల నిర్వహిస్తున్నారన్నారు. ప్రభుత్వం చేసే పాపాలను పార్టీ పరంగా ఎండగడుతూ, అంతా ఐకమత్యంతో పనిచేసి 2019 సంవత్సరంలో జరి గే ఎన్నికల్లో జిల్లాలో పది అసెంబ్లీస్థానాలు, ఒక పార్లమెంట్ స్థానం సాధించుకునేలా పనిచేద్దామన్నారు. పార్టీ బీసీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ ప్రధాన ప్రతి పక్షంగా ఉంటూ ప్రజల కోసం పోరాడతామన్నారు.
పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి మాట్లాడుతూ జగన్‌మోహనరెడ్డి ఆశలు, ఆశయాలకు అనుగుణంగా జిల్లాలో అందరినీ కలుపుకుంటూ పార్టీని పటిష్టం చేస్తామన్నారు. హైదరాబాద్ నుంచి రైలులో ఆమదాలవలస రైల్వే స్టేషన్‌కు చేరుకున్న ధర్మానకు కార్యకర్తలు ఘన స్వాగతం పలికి ఊరేగింపుగా తీసుకువచ్చారు. దారిపొడవునా బాణసంచా కాల్చారు. మహిళలు హారతులి చ్చారు. పాలకొండ రోడ్డులోని విజయగణపతి ఆలయంలో ధర్మాన ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు పూర్ణకలశంతో స్వాగతం పలికి దీవెనలు అందించారు. అనంతరం వైఎస్‌ఆర్ కూడలి వద్దనున్న వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిం చారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యేలు మీసాల నీలకంఠంనాయుడు, జుత్తు జగన్నాయకులు, పార్టీ కేంద్రకార్యనిర్వాహకమండలి సభ్యుడు అంధవరపు సూరిబాబు, పార్టీ నేతలు దువ్వాడ శ్రీనివాస్, గొర్లె కిరణ్, నర్తు రామారావు, మార్పు ధర్మారావు, బల్లాడ జనార్దన రెడ్డి, దువ్వాడ వాణి, అంధవరపు వరహానరసింహం (వరం), ఎం.వి.పద్మావతి, చల్లా అలివేలు మంగ, డాక్టర్ పైడి మహేశ్వరరావు, ధర్మాన రామ్‌మనోహర్‌నాయుడు, తమ్మినేని చిరంజీవి నాగ్, ఎం.స్వరూప్, కేవీవీ సత్యన్నారాయణ, టి.కామేశ్వరి, జె.ఎం.శ్రీనివాస్, శిమ్మ వెంకట్రావు, శిమ్మ రాజశేఖర్, మామిడి శ్రీకాంత్, ఎన్ని ధనుం జయ్, కోణార్క్ శ్రీను, మండవిల్లి రవి, కె.ఎల్.ప్రసాద్, గుంట జ్యోతి, టి.మోహిని, పైడి నిర్మల్‌కుమార్, సుంకరి కృష్ణ, మహమ్మద్ సిరాజుద్దీన్, చింతాడ గణపతి, దువ్వాడ శ్రీధర్, డాక్టర్ శ్రీనివాస్ పట్నాయక్, సీపాన భాస్కరరావు, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.