సాక్షి, హైదరాబాద్: వోల్వో బస్సు ప్రమాద కారకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, బస్సు యాజమాన్యంపైన కేసులు నమోదు చేస్తామని రవాణా మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. సంయుక్త రవాణా కమిషనర్ ప్రసాద్‌రావు సమర్పించే ప్రాథమిక నివేదిక ఆధారంగా, మోటారు వాహనాల చట్టంలోని నిబంధనల ప్రకారం వాహనం ఎవరి పేరుతో రిజిస్టర్ అయి ఉంటే వారిపైనే కేసులు ఉంటాయన్నారు. గురువారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. దివాకర్ ట్రావెల్స్‌పై కేసులు పెడతారా అన్న ప్రశ్నకు కేంద్ర మోటారు వాహన చట్టంలోని నిబంధనల ప్రకారం వాహన యజమానిపైనే చర్యలు తీసుకోవలసి ఉంటుందని చెప్పారు.
ఇప్పటి వరకు లభించిన సమాచారం మేరకు డ్రైవర్ నిర్లక్ష్యం, మితిమీరిన వేగం, రెండవ డ్రైవర్ లేకపోవడం, నిబంధనలకు విరుద్ధంగా బస్సులో ఎక్కువమందిని ఎక్కించుకోవడం వంటి ఉల్లంఘనలు తమ దృష్టికి వచ్చాయని చెప్పారు. సీఎంవీ రూల్స్ ప్రకారమేగాక ప్రయాణికుల మరణానికి కారకులైన వారందరిపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేస్తారని తెలిపారు. ఈ సంఘటనపై కర్ణాటక అధికారులు సైతం దర్యాఫ్తు ప్రారంభించారని ఆయన చెప్పారు. ప్రయాణికులు ప్రైవేట్ బస్సుల్లో వెళ్లవద్దని, ఆర్టీసీ బస్సుల్లోనే పయనించాలని సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా 25 బస్సులు స్వాధీనం: కాగా తాజా బస్సు దుర్ఘటనతో కళ్లు తెరిచిన రవాణాశాఖ గురువారం రాష్ట్రవ్యాప్తంగా విస్తృత తనిఖీలు జరిపింది. హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ, మెదక్, వరంగల్, గుంటూరు, విజయవాడ, విజయనగరం, నెల్లూరు, కడప, ఖమ్మం, తదితర జిల్లాల్లో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 60 బస్సులపై కేసులు నమోదు చేశారు. 25 బస్సుల ను స్వాధీనం చేసుకున్నారు.
బస్సు యజమానులపై చర్యలు: మంత్రి బొత్స
Published Fri, Nov 1 2013 6:24 AM | Last Updated on Fri, Jul 12 2019 3:10 PM
Advertisement
Advertisement