సచివాలయంలో కూడా దాడులు చేస్తాం
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత అవినీతి శాఖలను ఏసీబీ గురువారం ప్రకటించింది. అవినీతిలో రెవెన్యూ శాఖ మొదటి స్థానంలో ఉండగా, రెండోస్థానంలో హోంశాఖ, మూడో స్థానంలో పంచాయతీ రాజ్ శాఖ నిలిచింది. అవినీతిని నిర్మూలించేందుకు ప్రభుత్వశాఖల్లో ఇంటెలిజెన్స్‌ను ఏర్పాటు చేస్తామని, ఆయా శాఖల్లో అత్యంత అవినీతిపరుడిని గుర్తించి వల వేస్తామని ఏసీబీ డీజీ ఏకే ఖాన్ తెలిపారు. అవసరం అయితే సచివాలయంలో కూడా దాడులు చేస్తామన్నారు.
2013లో రెవెన్యూ శాఖ అధికారులపై 98 కేసులు నమోదు కాగా, హోంశాఖలో 46 కేసులు నమోదైనట్లు ఏకే ఖాన్ తెలిపారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నవారిపై కూడా దృస్టి సారిస్తామని ఆయన చెప్పారు. ఎక్కువ అవినీతికి పాల్పడుతున్న వారి సమాచారం సేకరించామని ఏకే ఖాన్ తెలిపారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా చెక్పోస్టులపై తనిఖీలు కొనసాగుతాయని ఆయన చెప్పారు. ప్రజల సహకారంతో ఎట్టకేలకు అవినీతిని నిర్మూలిస్తామని ఏకే ఖాన్ పేర్కొన్నారు.