అనంతపురం క్రైం/రూరల్, న్యూస్‌లైన్ : త్యాగాలకు, ఉద్యమాలకు అనంతపురం జిల్లా పుట్టినిల్లని వక్తలు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజనపై ప్రకటన వెలువడగానే అనంతపురంలోని సప్తగిరి సర్కిల్‌లోనే సమైక్య ఉద్యమం పుట్టిందని, ఇక్కడ ఎగసిన జ్వాల రాష్ట్రమంతా వ్యాపించిందన్నారు. అనంతపురం శివారులోని సీఆర్‌ఐటీ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో శుక్రవారం ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభ నిర్వహించారు. ఏపీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ సభకు సీమాంధ్రతో పాటు హైదరాబాద్ నుంచి ఉద్యోగ, మేధావి, విద్యార్థి సంఘాల నాయకులు హాజరయ్యారు. సభ ప్రారంభం నుంచి జై సమైక్యాంధ్ర నినాదాలు హోరెత్తాయి.
ఈ సందర్భంగా ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. యువత తలచుకుంటే విభజన జరగదన్నారు. తాజాగా జిల్లాకు ఒక టీఎంసీ కూడా కేటాయించకుండా బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పుతో తీరని అన్యాయం జరిగినట్లైందన్నారు. ఇక రాష్ట్రం విడిపోతే అనంత ఎడారవుతుందన్నారు. హైదరాబాద్ మనదన్న భావనతో అంతా కలిసి అభివృద్ధి చేసుకుంటే ఇప్పడు హైదరాబాద్‌పై సీమాంధ్రులకు హక్కులేదని చెప్పడం నీతిమాలిన రాజకీయాలకు నిదర్శనమన్నారు. హైదరాబాద్‌ను యూటీ చేయాలని, ఒక వేళ రాష్ట్రం విడిపోతే సీమాంధ్రకు ఏడాదికి రూ.40 వేల కోట్లు చొప్పున 20 ఏళ్ల పాటు నిధులు ఇవ్వాలని కోరడం మన ప్రజాప్రతినిధుల చేతకానితనానికి నిదర్శనమన్నారు. సమైక్యాంధ్ర కోసం కేంద్రం వద్ద భిక్షమెత్తడం మానేయాలని సూచించారు.
రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సమైక్య ఉద్యమంలో ఎంతో మంది మృతి చెందగా అందులో ఆరుగురు రెవెన్యూ ఉద్యోగులు ఉన్నారన్నారు. తెలంగాణ బిల్లు వస్తే హైదరాబాద్ నడిబొడ్డున సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారితో మిలియన్ మార్చ్ చేస్తామన్నారు. సీఆర్‌ఐటీ కళాశాల అధినేత చిరంజీవిరెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీలో తెలంగాణ బిల్లు పెట్టేలోపు ప్రజల ఆకాంక్షల మేరకు సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలన్నారు. పదవులు పట్టుకుని వేలాడితే రాజకీయ సమాధి కడతారన్నారు. ‘అన్నం సున్నమైపోవచ్చు.. గుర్రం ఎగరావచ్చు.. సమైక్యాంధ్రపై ఎవరూ ఆశలు వదులుకోవద్దు’ అంటూ మహిళా నేత లలితమ్మ చేసిన ప్రసంగం ఆకట్టుకుంది.
గులాబీల్లాంటి మీ పిడికిళ్లను బిగించి ఉద్యమంలో ముందుండాలంటూ విద్యార్థులకు సూచించారు. ప్రతి మంచి వెనుకా ఒక ఆడది ఉంటే.. సోనియా మాత్రం చెడువైపు నడుస్తోందని ధ్వజమెత్తారు. ‘సమైక్య ఉద్యమంలో అనంత పాత్ర’ అన్న పుస్తకాన్ని త్వరలో తీసుకురానున్నట్లు చెప్పారు. హైదరాబాద్ వాసి కుమార్ చౌదరి మాట్లాడుతూ.. సమైక్యాంధ్ర కోసం ప్రాణాలైనా అర్పిస్తామన్నారు. కేసీఆర్ లత్కోరు రాజకీయాలకు సమైక్యవాదులు సమాధి కట్టాలని పిలుపునిచ్చారు. ‘రాష్ట్రం ముక్కలైతే ఉన్నత చదువులకు, ఉద్యోగాలకు ఎక్కడికెళ్లాలి.. హైదరాబాద్‌ను మనవాళ్లంతా అభివృద్ధి చేసుకున్నారు. ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణలో చేరితో మా గతి ఏంటి’ అంటూ బీటెక్ ఫైనలియర్ విద్యార్థినులు తేజశ్విని, హిమబిందు ఉద్వేగభరిత ప్రసంగం అందరినీ ఆలోచింపజేసింది. సమైక్యాంధ్ర కోసం తాము ఎందాకైనా పోరాడతామని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిన బాధ్యత అశోక్‌బాబుపైనే ఉందన్నారు. కార్యక్రమంలో ఏపీ ఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు దేవరాజ్, కర్నూలు ఎస్వీర్, గుత్తి గేట్స్, అనంత లక్ష్మి ఇంజనీరింగ్ కళాశాలల అధినేతలు ఏవీ రమణారెడ్డి, సుధీర్‌రెడ్డి, వెంకటరమణ, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ సుబ్బయ్య, ఏసీటీఓ పద్మావతి తదితరులు పాల్గొన్నారు.
దేవరాజుతో అశోక్‌బాబు ఏకాంత చర్చలు
ఏపీ ఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు దేవరాజుతో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు సుమారు గంటన్నరపాటు ఏకాంత చర్చలు జరిపారు. శుక్రవారం ఉదయం అనంతపురం రైల్వే స్టేషన్‌కు చేరుకున్న అశోక్‌బాబుకు దేవరాజుతో పాటు పలువురు నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఓ హోటల్‌కు చేరుకుని పలు అంశాలపై ఏకాంతంగా చర్చలు జరిపారు. ఉద్యోగుల సమస్యలు, రాయల తెలంగాణ అంశంపై జిల్లాలో జరుగుతున్న పరిస్థితులు, సమైక్యాంధ్ర ఉద్యమం, రాజకీయాలపై చర్చించినట్లు తెలిసింది.
సమస్యల్ని రైతులకు వివరించండి
రాష్ట్రం విడిపోతే జరిగే నష్టాలు, వచ్చే సమస్యల గురించి రైతులకు వివరించాలని నీటి పారుదల శాఖ ఉద్యోగులకు అశోక్‌బాబు సూచించారు. శుక్రవారం అనంతపురం ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన నీటి పారుదల ఉద్యోగుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం రెండుగా విడిపోతే తుంగభధ్ర, పోతిరెడ్డిపాడు తదితర నీటి ప్రాజెక్ట్‌ల నుండి నీటివాటపై యుద్ధాలు జరుగుతాయన్నారు. దీనికి తోడు రాయల తెలంగాణ అంశాన్ని కొందరు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ విషయంపై కూడా ఉద్యోగులు తిరగబడాలన్నారు. రాష్ట్ర నాయకులను నమ్ముకునేకంటే జాతీయ నాయకులను నమ్ముకోవడం ఎంతోమేలన్నారు. ఇప్పటికే బీజేపీతో పాటు డీఎంకే, తృణముల్, సమాజ్‌వాది పార్టీ, బీఎస్పీ తదితర జాతీయ పార్టీలను కలవడం జరిగిందని వారందరు కూడా తెలంగాణకు వ్యతిరేకంగానే ఉన్నారన్నారు.
తెలంగాణ బిల్లు వస్తే మిలియన్ మార్చ్
Published Sat, Nov 30 2013 3:26 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement
Advertisement