అనంతపురం రూరల్, న్యూస్‌లైన్ : సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఏపీ ఎన్‌జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు విరుచుకుపడ్డారు. వారు గాడిదలు.. మూర్ఖులు అంటూ ధ్వజమెత్తారు. శుక్రవారం నగరంలోని ఎన్‌జీఓ కార్యాలయంలో ఆ సంఘం జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమైక్య ఉద్యమంలో ఐదేళ్ల పిల్లవాడి నుంచి వయో వృద్ధుల వరకు పెద్దఎత్తున పాల్గొంటే... సీమాంధ్ర ప్రజాప్రతినిధులు మాత్రం ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
సీమాంధ్ర కేంద్ర మంత్రులు ఇప్పటికైనా సోనియాగాంధీ భజన మానుకోవాలని హితవు పలికారు. సీమాంధ్రలో అన్ని రాజకీయ పార్టీలు ఒకే వేదికపైకి రావాలని, రాజకీయ విభేదాలను పక్కనబెట్టి ఉద్యమం చేయాలని కోరారు. 1956 కంటే ముందున్న తెలంగాణ కావాలంటే ఖమ్మం, నల్గొండ జిల్లాలు ముక్కలు కావాల్సిందేనన్నారు. సమైక్యాంధ్ర విషయంలో ఏ ఒక్క అంశంలోనూ రాజీపడే ప్రసక్తేలేదన్నారు. యూటీ వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదన్నారు. రాజ్యాంగం, చట్టాలను ఉల్లంఘించడం యూపీఏ ప్రభుత్వానికి వెన్నతో పెట్టిన విద్య అని, అలా ఉల్లంఘించి రాష్ట్ర విభజనకు పూనుకున్నా రాష్ట్రపతి ఆమోదం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ లభించదని చెప్పారు.
తెలంగాణ బి ల్లును పార్లమెంట్‌లో పెడితే.. మరుక్షణమే గుర్ఖాలాండ్ తదితర నాలుగు రాష్ట్రాల ఉద్యమాలు పుట్టుకొస్తాయన్నారు. ఉద్యోగులకు ఉద్యమం, ఉద్యోగం రెండు కళ్లు లాంటివన్నారు. ఉద్యమ కాలానికి సం బంధించి ప్రభుత్వం అడ్వాన్స్ ఇచ్చినా.... కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రం ఇప్పటి వరకు వేతనాలు అందలేదన్నారు. ఈ విషయమై సీఎంతో మాట్లాడగా... సంబంధిత ఫైలుపై సంతకం చేశారన్నారు. ఉద్యోగులకు పీఆర్‌తో పాటు ఐఆర్ ఇవ్వాలన్నారు. హెల్త్‌కార్డుల్లో మార్పులు చేయాలన్నారు. వీటిపైనా సీఎంతో మాట్లాడతామన్నారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయించడానికి ప్ర యత్నిస్తామన్నారు.
అవసరమైతే ఉద్యోగులకు అందే పీఆర్, ఐఆర్ ఒకట్రెండు శాతమైనా తగ్గించుకుని...కాంట్రాక్టు ఉద్యోగులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం సమైక్యాంధ్ర ఉ ద్యమంపై ఉపాధ్యాయ జేఏసీ నాయకుడు ఎంవీ రమణారెడ్డి ఆధ్వర్యంలో రూపొందించిన ‘సమైక్యాం ధ్ర- ఇదీ మన చరిత్ర’ అనే పుస్తకాన్ని అశోక్‌బాబు ఆవిష్కరించారు.
సమావేశంలో ఎన్‌జీఓ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి, జిల్లా అధ్యక్షుడు దేవరాజు, సంయుక్త అధ్యక్షుడు అతావుల్లా, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటనరసయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు ఈశ్వరయ్య, రెవెన్యూ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడు బి.వెంకటేశ్వర్లు, ధర్మవరం సమైక్య జేఏసీ కన్వీనర్ రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు.
గాడిదలు.. మూర్ఖులు..
Published Sat, Nov 30 2013 3:24 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement
Advertisement