ఎస్కేయూ, న్యూస్‌లైన్: వర్సిటీ పరిధిలోని ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు సంబంధించి యూజీ విభాగంలో గల్లంతైన సమాధాన పత్రాలు నాలుగు నెలలైనా బయటపడలేదు. ఇందుకు బాధ్యుడైన జూనియర్ అసిస్టెంట్‌ను సస్పెండ్ చేసేందుకు ఉన్నతాధికారులు ఫైల్ సిద్ధం చేశారు. 2013 మేలో బీటెక్ బయో టెక్నాలజీ మూడో సంవత్సరం రెండో సెమిస్టర్‌లో 20 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. సమాధాన పత్రాలను ఇంజినీరింగ్ కళాశాల అధికారులు సీలు వేసి యూజీ విభాగానికి భద్రంగా చేరవేశారు. బీటెక్ అన్ని సంవత్సరాల సమాధాన పత్రాలను కోడింగ్ చేసే ప్రక్రియలో బయోటెక్నాలజీ ఐదో పేపర్ ఇమ్యునాలజీ పేపర్లు గల్లంతయ్యాయి. ఈ విషయంపై మీనమేషాలు లెక్కిస్తూ వచ్చిన అధికారులు నాలుగు నెలల తర్వాత మేల్కొని చర్యలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. కాగా సమాధాన పత్రాల స్క్రిప్ట్‌ను యూజీ డీన్ పర్యవేక్షణలో కింది నుంచి పై స్థాయి సిబ్బంది వరకు కోడింగ్, డీకోడింగ్ చేసి వాల్యూయేషన్‌కు పంపించాల్సి ఉంటుంది. అయితే అవి జూనియర్ అసిస్టెంట్ నిర్లక్ష్యంతోనే గల్లంతయ్యాయని.. చర్యలు ఒక్కరి మీదే తీసుకోవడం ఎంతవరకు సమంజసమని పలువురు వాపోతున్నారు.
విద్యార్థులకు మళ్లీ పరీక్ష?
నెల క్రితమే ఇంజినీరింగ్ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ తరుణంలో కళాశాలకు వచ్చిన బయోటెక్నాలజీ విద్యార్థులు పరీక్ష ఫలితాలు గురించి అధికారులను అడగ్గా సమాధానం లేదు. మళ్లీ పరీక్ష నిర్వహించే ఆలోచనలో ఉన్నామని, పరీక్షకు సన్నద్ధం కావాలని విద్యార్థులకు సూచించినట్లు తెలుస్తోంది.
వీటితో పాటు పీజీకి సంబంధించి సమాధాన పత్రాలు గల్లంతు కావడంతో వారికి సర్దిచెప్పినట్లు సమాచారం. ఈ విషయంపై రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గోవిందప్పను వివరణ కోరగా గల్లంతైన సమాధాన పత్రాలకు సంబంధించి సిబ్బందిని సస్పెండ్ చేసేందుకు ఫైల్ సిద్ధం చేశామన్నారు. సంతకం చేసి సోమవారం ఆ సిబ్బందికి నోటీసు అందజేస్తామన్నారు. అదేవిధంగా దీనిపై కమిటీ వేసి విద్యార్థులకు పరీక్ష పెట్టే ఆలోచనలో ఉన్నామని సమాధానమిచ్చారు.
విద్యార్థులకు మళ్లీ పరీక్ష
Published Mon, Sep 30 2013 3:10 AM | Last Updated on Fri, Jun 1 2018 8:36 PM
Advertisement
Advertisement