junnior assistant
-
ఉద్యోగాల పేరిట ఘరానా మోసం
కరీంనగర్ క్రైం, న్యూస్‌లైన్ : జిల్లాలోని వివిధ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఓ వ్యక్తి ఘరానా మోసానికి పాల్పడుతున్నాడు. తాను కలెక్టర్‌కు దగ్గరి బంధువునని చెప్పుకుంటూ నిరుద్యోగులను బుట్టలో వేసుకుంటున్నాడు. ఆపై ఉద్యోగాల ఆశచూపి వారి నుంచి రూ.లక్షలు దండుకుంటున్న వైనం గురువారం వెలుగుచూసింది. బాధితురాలి కథనం ప్రకారం.. గోదావరిఖనికి చెందిన ఓ యువతి డిగ్రీ పూర్తి చేసి పలు ఉద్యోగాల కోసం పరీక్షలు రాసింది. ఈ క్రమంలో ఆమెకు హుస్నాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. తాను కలెక్టర్‌కు దగ్గరి బంధువునని చెప్పి, పలుమార్లు సెల్ఫోన్లో కలెక్టర్‌తో మాట్లాడుతున్నట్టు నటించాడు. కలెక్టర్‌తో రికమండ్ చేసి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పడంతో ఆమె నమ్మింది. తర్వాత పెద్దపల్లి ఆర్డీవో కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఖాళీగా ఉందని, రూ.3లక్షలు ఇస్తే ఉద్యోగం వస్తుందని.. డబ్బులు వసూలు చేశాడు. ఎంతకూ ఉద్యోగం ఇప్పించకపోవడంతో యువతి నిలదీయగా నకిలీ కాల్‌లెటర్‌ను తయారు చేసిచ్చి అదే అపాయింట్‌మెంట్‌గా చెప్పాడు. దానిపై జీవో ఆర్టీ 352 ప్రకారం పెద్దపల్లి ఆర్డీవో కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగంలో జాయిన్ కావాలని 2014, ఏప్రిల్ 19వ తేదీతో ఆ పత్రాన్ని అందించాడు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రోడ్ విధాన పరిషత్ అని ఎక్కడా లేని చిరునామాను పేర్కొన్నాడు. కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేయడంతో పాటు సూపరిటెండెంట్ కార్యాలయం ముద్ర వేశాడు. సదరు యువతి ఆ పత్రాన్ని తీసుకుని పెద్దపల్లి ఆర్డీవో కార్యాలయంలో సంప్రదించగా.. అక్కడ ఉద్యోగాలు ఖాళీ లేవని తిప్పి పంపారు. ఆమె తిరిగి అతడిని నిలదీస్తే.. తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే పలు ఉద్యోగాలు భర్తీ కానున్నాయని, అందులో అవకాశం కల్పిస్తానని చెబుతున్నాడని బాధితురాలు వివరించింది. సదరు వ్యక్తి ఇలా ఇప్పటికే పలువురి నుంచి రూ.లక్షలు దండుకున్నట్టు తెలిసింది. గతంలో వికలాంగుల సర్టిఫికెట్ల జారీలో అవకతవకలకు పాల్పడటంతో ఉన్నతాధికారులు అతడిని సస్పెండ్ చేసినట్టు సమాచారం. దీనిపై అధికారులు లోతుగా విచారిస్తే అతడి మోసాల చిట్టా బయటపడే అవకాశముంది. -
ఏసీబీకి చిక్కిన అవినీతి ఉద్యోగి
కడప అర్బన్, న్యూస్‌లైన్: కడప ప్రగతి భవన్‌లోని సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డెరైక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న ఆరం రెడ్డి రూ.2 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కి అడ్డంగా దొరికిపోయాడు. బ్రహ్మంగారిమఠం సాంఘిక సంక్షేమశాఖ వసతి గృహంలో వార్డెన్‌గా పని చేస్తున్న నాగశంకర్‌కు ఇంక్రిమెంట్లు, స్పెషల్ గ్రేడ్ నిధుల మంజూరుకు సంబంధించిన ఫైలును జేడీకి పంపేందుకు గాను రూ.2 వేలు లంచంగా అడిగాడు. గత ఏడాది జనవరి నుంచి నిధులు విడుదల కాకపోవడంతో నాగశంకర్ పలుమార్లు ఆరం రెడ్డిని అడిగారు. అందుకు ప్రతిఫలంగా డబ్బుతో పాటు మద్యం బాటిల్ ఇవ్వాలని ఆరంరెడ్డి డిమాండ్ చేశారు. దీంతో బాధతుడు ఏసీబీని ఆశ్రయించారు. మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు ఆరంరెడ్డి తన చాంబర్లో ఉండగా నాగశంకర్‌తో రూ.2 వేలు నగదును ఏసీబీ అధికారులు పంపించారు. ఆ నగదును ఆరంరెడ్డికి అందజేయగా ఆయన తీసుకున్నారు. దీంతో తాము రెడ్‌హ్యాండెడ్‌గా ఆయన్ని పట్టుకున్నామని తిరుపతి రేంజ్ డీఎస్పీ రాజారావు విలేకరులకు తెలిపారు. ఏసీబీ సీఐలు పార్థసారథిరెడ్డి, చంద్రశేఖర్, రామ్‌కిశోర్, సుధాకర్‌రెడ్డి, లక్ష్మికాంత్‌రెడ్డి పాల్గొన్నారు. -
సమాధాన పత్రాల గల్లంతు.. ఉద్యోగి సస్పెన్షన్
ఎస్కేయూ, న్యూస్‌లైన్: శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాలకు సంబంధించి బయోటెక్నాలజీ సమాధానపత్రాల గల్లంతు వ్యవహారంలో ఓ జూనియర్ అసిస్టెంటును సస్పెండ్ చేస్తూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గోవిందప్ప మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మే నెలలో జరిగిన బయోటెక్నాలజీ మూడో సంవత్సరం రెండో సెమిస్టర్, ఇమ్యునాలజీ సబ్జెక్టు పరీక్షకు సంబంధించిన 20 సమాధాన పత్రాలు గల్లంతైన విషయం తెలిసిందే. అయితే, సమాధాన పత్రాలు గల్లంతు కాలేదని చెప్తూ వచ్చిన యూనివర్సిటీ ఉన్నతాధికారులు నాలుగు నెలల తర్వాత మంగళవారం ఓ జూనియర్ అసిస్టెంట్‌ను ఇందుకు బాధ్యుడిని చేస్తూ సస్పెండ్ చేశారు. ఒక ఉద్యోగిని మాత్రమే ఎలా బాధ్యుడిని చేస్తారంటూ బోధనేతర ఉద్యోగుల సంఘం నేతలు పలుసార్లు వీసీ, రిజిస్ట్రార్లకు విన్నవించినా ఫలితం లేకపోయింది. ఈ ఉత్తర్వులను ఆ ఉద్యోగి తీసుకోలేదని తెలిసింది. మరింత లోతుగా విచారణ ఈ వ్యవహారంపై రిజిస్ట్రార్ కన్వీనర్‌గా ఏర్పాటైన కమిటీ సభ్యులు ఫిజికల్ సెన్సైస్ డీన్ ప్రొఫెసర్ రామాంజప్ప, సీడీసీ డీన్ రంగస్వామి, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ నాగభూషణరాజులు పరిపాలన భవనంలో మంగళవారం లోతుగా విచారణ చేపట్టారు. సమాధాన పత్రాల కోడింగ్ ఎలా జరిగింది, వాటిని ఎక్కడ భద్రపరచారు. గోడౌన్ ఎవరు తీశారు. వాటి తాళాలు ఎవరి వద్ద ఉన్నాయనే కోణాల్లో సిబ్బందిని విచారణ చేసినట్లు తెలిసింది. యూజీ డీన్ ప్రొఫెసర్ రవీంద్రారెడ్డి, పరీక్షల కో-ఆర్డినేటర్ డాక్టర్ బాలసుబ్రమణ్యం, డీఆర్ నరసింహారెడ్డి, సూపరింటెండెంట్లు నారాయణస్వామి, వెంకటకృష్ణారెడ్డి, సీనియర్ అసిస్టెంట్లు చంద్రబాబు, లక్ష్మీకాంతప్ప, పవన్‌కుమార్, జూనియర్ అసిస్టెంట్లు గోవిందరాజులు, నరేష్, జయచంద్రారెడ్డిలను ప్రత్యేకంగా నివేదిక ఇవ్వాలని కమిటీ సూచించినట్లు తెలిసింది. -
విద్యార్థులకు మళ్లీ పరీక్ష
ఎస్కేయూ, న్యూస్‌లైన్: వర్సిటీ పరిధిలోని ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు సంబంధించి యూజీ విభాగంలో గల్లంతైన సమాధాన పత్రాలు నాలుగు నెలలైనా బయటపడలేదు. ఇందుకు బాధ్యుడైన జూనియర్ అసిస్టెంట్‌ను సస్పెండ్ చేసేందుకు ఉన్నతాధికారులు ఫైల్ సిద్ధం చేశారు. 2013 మేలో బీటెక్ బయో టెక్నాలజీ మూడో సంవత్సరం రెండో సెమిస్టర్లో 20 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. సమాధాన పత్రాలను ఇంజినీరింగ్ కళాశాల అధికారులు సీలు వేసి యూజీ విభాగానికి భద్రంగా చేరవేశారు. బీటెక్ అన్ని సంవత్సరాల సమాధాన పత్రాలను కోడింగ్ చేసే ప్రక్రియలో బయోటెక్నాలజీ ఐదో పేపర్ ఇమ్యునాలజీ పేపర్లు గల్లంతయ్యాయి. ఈ విషయంపై మీనమేషాలు లెక్కిస్తూ వచ్చిన అధికారులు నాలుగు నెలల తర్వాత మేల్కొని చర్యలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. కాగా సమాధాన పత్రాల స్క్రిప్ట్‌ను యూజీ డీన్ పర్యవేక్షణలో కింది నుంచి పై స్థాయి సిబ్బంది వరకు కోడింగ్, డీకోడింగ్ చేసి వాల్యూయేషన్‌కు పంపించాల్సి ఉంటుంది. అయితే అవి జూనియర్ అసిస్టెంట్ నిర్లక్ష్యంతోనే గల్లంతయ్యాయని.. చర్యలు ఒక్కరి మీదే తీసుకోవడం ఎంతవరకు సమంజసమని పలువురు వాపోతున్నారు. విద్యార్థులకు మళ్లీ పరీక్ష? నెల క్రితమే ఇంజినీరింగ్ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ తరుణంలో కళాశాలకు వచ్చిన బయోటెక్నాలజీ విద్యార్థులు పరీక్ష ఫలితాలు గురించి అధికారులను అడగ్గా సమాధానం లేదు. మళ్లీ పరీక్ష నిర్వహించే ఆలోచనలో ఉన్నామని, పరీక్షకు సన్నద్ధం కావాలని విద్యార్థులకు సూచించినట్లు తెలుస్తోంది. వీటితో పాటు పీజీకి సంబంధించి సమాధాన పత్రాలు గల్లంతు కావడంతో వారికి సర్దిచెప్పినట్లు సమాచారం. ఈ విషయంపై రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గోవిందప్పను వివరణ కోరగా గల్లంతైన సమాధాన పత్రాలకు సంబంధించి సిబ్బందిని సస్పెండ్ చేసేందుకు ఫైల్ సిద్ధం చేశామన్నారు. సంతకం చేసి సోమవారం ఆ సిబ్బందికి నోటీసు అందజేస్తామన్నారు. అదేవిధంగా దీనిపై కమిటీ వేసి విద్యార్థులకు పరీక్ష పెట్టే ఆలోచనలో ఉన్నామని సమాధానమిచ్చారు. -
వీళ్లు మారరు
ఎక్కడెక్కడో ఏసీబీ దాడులు చేసుకుంటే వీరు తమకేం అనుకుంటున్నారు. అవినీతి అధికారుల భరతం పడతామని హెచ్చరిస్తున్నా... ఏసీబీ నిత్యం దాడులు నిర్వహించి జైలుకు పంపిస్తున్నా... వీరు మాత్రం మారడం లేదు. లంచాలు తినమరిగి.. సామాన్యులను పీడిస్తూనే ఉన్నారు. శనివారం ఏసీబీ దాడుల్లో మరో ‘రెవెన్యూ’ చేప చిక్కింది. పహణీ నకల్ కోసం ఓ రైతు నుంచి తహశీల్దార్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ రూ.2 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రామడుగు, న్యూస్‌లైన్ : రామడుగు మండలం రాంచంద్రాపూర్‌కు చెందిన కడారి శంకర్ అనే రైతు ఈ నెల 5న పహణీ నకల్ కోసం తహశీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. అనంతరం కార్యాలయంలోని జూనియర్ అసిస్టెంట్ మూల చంద్రశేఖర్‌రెడ్డిని కలవగా డబ్బులు ఇస్తే పహణీ నకల్ ఇస్తానని చెప్పాడు. దీంతో అప్పుడే రూ.వెయ్యి అందించాడు. అయినా పహణీ ఇవ్వకపోవడంతో ఈ నెల 20న మళ్లీ వెళ్లి అడగగా మరో రెండు వేలు ఇస్తేనే పహణీ ఇస్తానని చెప్పాడు. తాను అంత ఇచ్చుకోలేనని, పహణీ ఇవ్వాలని కోరినా స్పందించకపోవడంతో విషయాన్ని తహశీల్దార్ దృష్టికి తీసుకెళ్లాడు. జూనియర్ అసిస్టెంట్ వద్దే పనిచేసుకోవాలని ఆయన సెలవివ్వడంతో చేసేదేమీ లేక మళ్లీ చంద్రశేఖర్‌రెడ్డి వద్దకే వచ్చాడు. పైసలు ఇవ్వనిదే పహణీ ఇవ్వనని ఆయన తెగేసి చెప్పడంతో విసిగిపోయిన శంకర్ కరీంనగర్‌లోని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రంగంలోకి ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ ప్రణాళిక ప్రకారం శంకర్‌కు శనివారం రూ.2 వేలు ఇచ్చి పంపించారు. అతడు కార్యాలయానికి వెళ్లి జూనియర్ అసిస్టెంట్‌కు ఆ డబ్బులు ఇవ్వగా అక్కడే ఉన్న డీఎస్పీతోపాటు ఇన్స్పెక్టర్లు రమణమూర్తి, శ్రీనివాసరాజు, సిబ్బంది కలిసి చంద్రశేఖర్‌రెడ్డిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎవరైనా లంచం అడిగితే 9440446150 నంబర్‌కు ఫోన్ చేయాలని డీఎస్పీ తెలిపారు.