కడప ప్రగతి భవన్‌లోని సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డెరైక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న ఆరం రెడ్డి రూ.2 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కి అడ్డంగా దొరికిపోయాడు.
కడప అర్బన్, న్యూస్‌లైన్: కడప ప్రగతి భవన్‌లోని సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డెరైక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న ఆరం రెడ్డి రూ.2 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కి అడ్డంగా దొరికిపోయాడు. బ్రహ్మంగారిమఠం సాంఘిక సంక్షేమశాఖ వసతి గృహంలో వార్డెన్‌గా పని చేస్తున్న నాగశంకర్‌కు ఇంక్రిమెంట్లు, స్పెషల్ గ్రేడ్ నిధుల మంజూరుకు సంబంధించిన ఫైలును జేడీకి పంపేందుకు గాను రూ.2 వేలు లంచంగా అడిగాడు.
గత ఏడాది జనవరి నుంచి నిధులు విడుదల కాకపోవడంతో నాగశంకర్ పలుమార్లు ఆరం రెడ్డిని అడిగారు. అందుకు ప్రతిఫలంగా డబ్బుతో పాటు మద్యం బాటిల్ ఇవ్వాలని ఆరంరెడ్డి డిమాండ్ చేశారు. దీంతో బాధతుడు ఏసీబీని ఆశ్రయించారు. మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు ఆరంరెడ్డి తన చాంబర్‌లో ఉండగా నాగశంకర్‌తో రూ.2 వేలు నగదును ఏసీబీ అధికారులు పంపించారు. ఆ నగదును ఆరంరెడ్డికి అందజేయగా ఆయన తీసుకున్నారు. దీంతో తాము రెడ్‌హ్యాండెడ్‌గా ఆయన్ని పట్టుకున్నామని తిరుపతి రేంజ్ డీఎస్పీ రాజారావు విలేకరులకు తెలిపారు. ఏసీబీ సీఐలు పార్థసారథిరెడ్డి, చంద్రశేఖర్, రామ్‌కిశోర్, సుధాకర్‌రెడ్డి, లక్ష్మికాంత్‌రెడ్డి పాల్గొన్నారు.