కరీంనగర్ క్రైం, న్యూస్‌లైన్ : జిల్లాలోని వివిధ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఓ వ్యక్తి ఘరానా మోసానికి పాల్పడుతున్నాడు. తాను కలెక్టర్‌కు దగ్గరి బంధువునని చెప్పుకుంటూ నిరుద్యోగులను బుట్టలో వేసుకుంటున్నాడు. ఆపై ఉద్యోగాల ఆశచూపి వారి నుంచి రూ.లక్షలు దండుకుంటున్న వైనం గురువారం వెలుగుచూసింది. బాధితురాలి కథనం ప్రకారం.. గోదావరిఖనికి చెందిన ఓ యువతి డిగ్రీ పూర్తి చేసి పలు ఉద్యోగాల కోసం పరీక్షలు రాసింది. ఈ క్రమంలో ఆమెకు హుస్నాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. తాను కలెక్టర్‌కు దగ్గరి బంధువునని చెప్పి, పలుమార్లు సెల్‌ఫోన్‌లో కలెక్టర్‌తో మాట్లాడుతున్నట్టు నటించాడు. కలెక్టర్‌తో రికమండ్ చేసి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పడంతో ఆమె నమ్మింది. తర్వాత పెద్దపల్లి ఆర్డీవో కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఖాళీగా ఉందని, రూ.3లక్షలు ఇస్తే ఉద్యోగం వస్తుందని.. డబ్బులు వసూలు చేశాడు.
ఎంతకూ ఉద్యోగం ఇప్పించకపోవడంతో యువతి నిలదీయగా నకిలీ కాల్‌లెటర్‌ను తయారు చేసిచ్చి అదే అపాయింట్‌మెంట్‌గా చెప్పాడు. దానిపై జీవో ఆర్‌టీ 352 ప్రకారం పెద్దపల్లి ఆర్డీవో కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగంలో జాయిన్ కావాలని 2014, ఏప్రిల్ 19వ తేదీతో ఆ పత్రాన్ని అందించాడు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రోడ్ విధాన పరిషత్ అని ఎక్కడా లేని చిరునామాను పేర్కొన్నాడు. కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేయడంతో పాటు సూపరిటెండెంట్ కార్యాలయం ముద్ర వేశాడు. సదరు యువతి ఆ పత్రాన్ని తీసుకుని పెద్దపల్లి ఆర్డీవో కార్యాలయంలో సంప్రదించగా.. అక్కడ ఉద్యోగాలు ఖాళీ లేవని తిప్పి పంపారు.
ఆమె తిరిగి అతడిని నిలదీస్తే.. తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే పలు ఉద్యోగాలు భర్తీ కానున్నాయని, అందులో అవకాశం కల్పిస్తానని చెబుతున్నాడని బాధితురాలు వివరించింది. సదరు వ్యక్తి ఇలా ఇప్పటికే పలువురి నుంచి రూ.లక్షలు దండుకున్నట్టు తెలిసింది. గతంలో వికలాంగుల సర్టిఫికెట్ల జారీలో అవకతవకలకు పాల్పడటంతో ఉన్నతాధికారులు అతడిని సస్పెండ్ చేసినట్టు సమాచారం. దీనిపై అధికారులు లోతుగా విచారిస్తే అతడి మోసాల చిట్టా బయటపడే అవకాశముంది.
ఉద్యోగాల పేరిట ఘరానా మోసం
Published Fri, May 30 2014 2:06 AM | Last Updated on Sat, Sep 2 2017 8:02 AM
Advertisement
Advertisement