ఎస్కేయూ, న్యూస్‌లైన్: శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాలకు సంబంధించి బయోటెక్నాలజీ సమాధానపత్రాల గల్లంతు వ్యవహారంలో ఓ జూనియర్ అసిస్టెంటును సస్పెండ్ చేస్తూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గోవిందప్ప మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మే నెలలో జరిగిన బయోటెక్నాలజీ మూడో సంవత్సరం రెండో సెమిస్టర్, ఇమ్యునాలజీ సబ్జెక్టు పరీక్షకు సంబంధించిన 20 సమాధాన పత్రాలు గల్లంతైన విషయం తెలిసిందే.
అయితే, సమాధాన పత్రాలు గల్లంతు కాలేదని చెప్తూ వచ్చిన యూనివర్సిటీ ఉన్నతాధికారులు నాలుగు నెలల తర్వాత మంగళవారం ఓ జూనియర్ అసిస్టెంట్‌ను ఇందుకు బాధ్యుడిని చేస్తూ సస్పెండ్ చేశారు. ఒక ఉద్యోగిని మాత్రమే ఎలా బాధ్యుడిని చేస్తారంటూ బోధనేతర ఉద్యోగుల సంఘం నేతలు పలుసార్లు వీసీ, రిజిస్ట్రార్లకు విన్నవించినా ఫలితం లేకపోయింది. ఈ ఉత్తర్వులను ఆ ఉద్యోగి తీసుకోలేదని తెలిసింది.
మరింత లోతుగా విచారణ
ఈ వ్యవహారంపై రిజిస్ట్రార్ కన్వీనర్‌గా ఏర్పాటైన కమిటీ సభ్యులు ఫిజికల్ సెన్సైస్ డీన్ ప్రొఫెసర్ రామాంజప్ప, సీడీసీ డీన్ రంగస్వామి, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ నాగభూషణరాజులు పరిపాలన భవనంలో మంగళవారం లోతుగా విచారణ చేపట్టారు. సమాధాన పత్రాల కోడింగ్ ఎలా జరిగింది, వాటిని ఎక్కడ భద్రపరచారు.
గోడౌన్ ఎవరు తీశారు. వాటి తాళాలు ఎవరి వద్ద ఉన్నాయనే కోణాల్లో సిబ్బందిని విచారణ చేసినట్లు తెలిసింది. యూజీ డీన్ ప్రొఫెసర్ రవీంద్రారెడ్డి, పరీక్షల కో-ఆర్డినేటర్ డాక్టర్ బాలసుబ్రమణ్యం, డీఆర్ నరసింహారెడ్డి, సూపరింటెండెంట్లు నారాయణస్వామి, వెంకటకృష్ణారెడ్డి, సీనియర్ అసిస్టెంట్లు చంద్రబాబు, లక్ష్మీకాంతప్ప, పవన్‌కుమార్, జూనియర్ అసిస్టెంట్లు గోవిందరాజులు, నరేష్, జయచంద్రారెడ్డిలను ప్రత్యేకంగా నివేదిక ఇవ్వాలని కమిటీ సూచించినట్లు తెలిసింది.
సమాధాన పత్రాల గల్లంతు.. ఉద్యోగి సస్పెన్షన్
Published Wed, Oct 9 2013 2:31 AM | Last Updated on Fri, Sep 1 2017 11:27 PM
Advertisement
Advertisement