కడప అర్బన్: ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (మద్యం డిపో)ను గురువారం ఇన్ కం ట్యాక్స్ అధికారులు సీజ్ చేశారు. మద్యం వ్యాపారులు మద్యాన్ని కొనుగోలు చేసి వెళ్లకుండా గోడౌన్‌లకు తాళాలు వేశారు. ఈ సందర్భంగా ఐటీ అధికారి గోపాల్‌నాయక్, ఇన్‌స్పెక్టర్లు పద్మనాభం, రఘురామయ్య, శ్రీనివాసులు తమ సిబ్బందితో వచ్చి మద్యం డిపో మేనేజర్ సురేష్‌రావును కలిసి స్టాక్ స్టేట్‌మెంట్‌ను తీసుకెళ్లారు. ఇన్ కం ట్యాక్స్ అధికారి గోపాల్‌నాయక్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మద్యం డిపోలపై తమ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దాడులు నిర్వహిస్తున్నామన్నారు.
అందులో భాగంగా కడప నగర శివార్లలోని ఏపీ బీసీఎల్(మద్యం డిపో)ను సందర్శించి సీజ్ చేశామన్నారు. 2004-05 సంవత్సరం నుంచి 2014-15 సంవత్సరం వరకు దాదాపు రూ. 116 కోట్లు ఇన్‌కం ట్యాక్స్ బకాయిలను కడప మద్యం డిపో వారు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉందన్నారు. రాష్ట్రంలోని మొత్తం ఏపీబీసీఎల్ డిపోలు 1468 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించాల్సి ఉందన్నారు.
మద్యం సరఫరా నిలిపివేత - ఇప్పటికే మద్యం కొనుగోలు చేసిన వ్యాపారులు
మద్యం డిపోను ఐటీ అధికారులు సీజ్ చేయడంపై డిపో మేనేజర్ సురేష్‌రావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఐటీ అధికారులు మద్యం డిపోలను సీజ్ చేస్తున్నారన్నారు. అందులోభాగంగా కడప నగర శివార్లలోని మద్యం డిపోను సీజ్ చేశారన్నారు. దాదాపుగా మద్యం కొనుగోలు మరో 10 రోజుల వరకు అవసరం ఉండకపోవచ్చన్నారు.
ఉపాధి కోల్పోయిన హమాలీలు
ఐటీ అధికారులు డిపోను సీజ్‌చేయడంతో ఏపీ బీసీఎల్‌లో హమాలీలుగా పనిచేస్తున్న 60 మంది ఉపాధి లేక వీధిన పడ్డారు. వారు పనివేళల్లో రోజుకు రూ. 500 నుంచి రూ. 800 వరకు సంపాదించేవారు. ఐటీ అధికారులు వారికి కట్టాల్సిన బకాయిల కోసం మద్యం డిపోను సీజ్ చేసి హమాలీల ఉపాధికి అడ్డు పడుతున్నారని బాధితులు వాపోయారు.
అధిక ధరలకు విక్రయిస్తే
కఠిన చర్యలు - డీసీ
మద్యం డిపోను సీజ్ చేసిన నేపథ్యంలో మద్యం వ్యాపారులు తమ వద్ద మద్యం స్టాకు లేదని కారణాలు చూపుతూ అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు చేపడతామని ఎక్సైజ్‌శాఖ డిప్యూటీ కమిషనర్ ప్రేమప్రసాద్ అన్నారు. ఇప్పటికే అధికారులు, సిబ్బందితో గట్టి నిఘా ఏర్పాటు చేశామన్నారు.
కడపలో మద్యం డిపో సీజ్
Published Fri, Mar 6 2015 2:38 AM | Last Updated on Thu, Sep 27 2018 4:47 PM
Advertisement