gopal nayak
-
నీటి పారుదల శాఖ డీఈ ఇంటిపై ఏసీబీ దాడి
రూ.10 కోట్లకుపైగా ఆస్తులు ఉన్నట్లు గుర్తింపు ప్రొద్దుటూరు (వైఎస్సార్ జిల్లా): వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని వైఎంఆర్ కాలనీలో ఉంటున్న నీటి పారుదల శాఖ డీఈ బుక్కె గోపాల్ నాయక్ ఇంటిపై బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కర్నూలు జిల్లా శ్రీశైలం కుడికాలువ ప్రాజెక్టు పరిధిలోని బనగానపల్లె కార్యాలయంలో డీఈగా పని చేస్తున్న ఈయన చాలా ఏళ్లుగా ప్రొద్దుటూరులో ఉంటున్నారు. ఇతను అక్రమంగా అస్తులు కలిగి ఉన్నారన్న సమాచారంతో ఏసీబీ కడప డీఎస్పీ ఎన్.నాగరాజు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. అనంతరం డీఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ.. గోపాల్ నాయక్‌కు హైదరాబాద్‌లో మూడు, ప్రొద్దుటూరులో 10 ఇళ్ల స్థలాలు, ప్రస్తుతం ఉంటున్న ఇంటితోపాటు పెన్నానగర్లో మరో రెండు ఇళ్లు ఉన్నాయన్నారు. గోపవరం, కామనూరు గ్రామాల పరిధిలో 13 ఎకరాల భూమి, కడప పరిధిలోని రామరాజుపల్లె వద్ద 70 సెంట్ల స్థలం ఉన్నట్లు గుర్తించామన్నారు. ప్రొద్దుటూరులోని ఇంటిలో 190 గ్రాములు, ఎస్బీఐ లాకర్లో 20 తులాల బంగారం ఉందని చెప్పారు. ఒక ఇన్నోవా, మరో షిఫ్ట్ కారుతోపాటు రెండు మోటార్ సైకిళ్లు ఉన్నాయన్నారు. రిజిస్టర్ విలువ ప్రకారం ఈ ఆస్తుల విలువ రూ.3 కోట్లు, మార్కెట్ వ్యాల్యూ ప్రకారం రూ.10-12 కోట్లు ఉంటుందన్నారు. డీఈ బంధువులు ఉంటున్న సుండుపల్లెలో కూడా తనిఖీలు చేశామని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి ఆయన్ను రిమాండ్‌కు తరలిస్తున్నామని చెప్పారు. దాడుల్లో తిరుపతి ఏసీబీ డీఎస్పీ శంకర్‌రెడ్డి, చిత్తూరు, నెల్లూరు, వైఎస్ఆర్ జిల్లాల పరిధిలో పనిచేస్తున్న సీఐలు సుధాకర్‌రెడ్డి, శివకుమార్, శంకర్‌నాయక్ పాల్గొన్నారు. -
కడపలో మద్యం డిపో సీజ్
కడప అర్బన్: ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (మద్యం డిపో)ను గురువారం ఇన్ కం ట్యాక్స్ అధికారులు సీజ్ చేశారు. మద్యం వ్యాపారులు మద్యాన్ని కొనుగోలు చేసి వెళ్లకుండా గోడౌన్లకు తాళాలు వేశారు. ఈ సందర్భంగా ఐటీ అధికారి గోపాల్‌నాయక్, ఇన్స్పెక్టర్లు పద్మనాభం, రఘురామయ్య, శ్రీనివాసులు తమ సిబ్బందితో వచ్చి మద్యం డిపో మేనేజర్ సురేష్‌రావును కలిసి స్టాక్ స్టేట్మెంట్ను తీసుకెళ్లారు. ఇన్ కం ట్యాక్స్ అధికారి గోపాల్‌నాయక్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మద్యం డిపోలపై తమ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దాడులు నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగా కడప నగర శివార్లలోని ఏపీ బీసీఎల్(మద్యం డిపో)ను సందర్శించి సీజ్ చేశామన్నారు. 2004-05 సంవత్సరం నుంచి 2014-15 సంవత్సరం వరకు దాదాపు రూ. 116 కోట్లు ఇన్‌కం ట్యాక్స్ బకాయిలను కడప మద్యం డిపో వారు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉందన్నారు. రాష్ట్రంలోని మొత్తం ఏపీబీసీఎల్ డిపోలు 1468 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించాల్సి ఉందన్నారు. మద్యం సరఫరా నిలిపివేత - ఇప్పటికే మద్యం కొనుగోలు చేసిన వ్యాపారులు మద్యం డిపోను ఐటీ అధికారులు సీజ్ చేయడంపై డిపో మేనేజర్ సురేష్‌రావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఐటీ అధికారులు మద్యం డిపోలను సీజ్ చేస్తున్నారన్నారు. అందులోభాగంగా కడప నగర శివార్లలోని మద్యం డిపోను సీజ్ చేశారన్నారు. దాదాపుగా మద్యం కొనుగోలు మరో 10 రోజుల వరకు అవసరం ఉండకపోవచ్చన్నారు. ఉపాధి కోల్పోయిన హమాలీలు ఐటీ అధికారులు డిపోను సీజ్‌చేయడంతో ఏపీ బీసీఎల్లో హమాలీలుగా పనిచేస్తున్న 60 మంది ఉపాధి లేక వీధిన పడ్డారు. వారు పనివేళల్లో రోజుకు రూ. 500 నుంచి రూ. 800 వరకు సంపాదించేవారు. ఐటీ అధికారులు వారికి కట్టాల్సిన బకాయిల కోసం మద్యం డిపోను సీజ్ చేసి హమాలీల ఉపాధికి అడ్డు పడుతున్నారని బాధితులు వాపోయారు. అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు - డీసీ మద్యం డిపోను సీజ్ చేసిన నేపథ్యంలో మద్యం వ్యాపారులు తమ వద్ద మద్యం స్టాకు లేదని కారణాలు చూపుతూ అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు చేపడతామని ఎక్సైజ్‌శాఖ డిప్యూటీ కమిషనర్ ప్రేమప్రసాద్ అన్నారు. ఇప్పటికే అధికారులు, సిబ్బందితో గట్టి నిఘా ఏర్పాటు చేశామన్నారు.