సార్వత్రిక ఎన్నికలు ఏర్పాట్లు పూర్తి
- 1,62,888 మంది కొత్త ఓటర్లు
- రెండు మూడురోజుల్లో సప్లిమెంటరీ ఓటర్ల జాబితా
- 23న మాక్ పోలింగ్
- కలెక్టర్ రఘునందన్‌రావు వెల్లడి
విజయవాడ, న్యూస్‌లైన్ : రానున్న సాధారణ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు చెప్పారు. స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఉదయం ఎన్నికల ఏర్పాట్లపై వివరించేందుకు ఎన్నికల పరిశీలకులు, రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులు తదితరులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్నికలలో ఓటర్లు ఓటు వినియోగించుకునేందుకు 400 గంటలు మాత్రమే సమయం ఉందని కలెక్టర్ చెప్పారు.
కొత్త ఓటర్లకు ఓటుహక్కు కల్పనకు చర్యలు...
2014 జనవరి నాటికి జిల్లాలో 15,79,374 మంది పురుషులు, 15,96,486 మంది మహిళలు, 226 మంది ఇతరులు ఓటర్లుగాఉన్నారని, కొత్తగా 2,06,924 మంది దరఖాస్తు చేసుకున్నారని కలెక్టర్ వివరించారు. వారిలో 1,62,888 మందికి ఓటు హక్కు కల్పించేందుకు చర్యలు పూర్తిచేసినట్లు చెప్పారు. రెండు మూడు రోజుల్లో సప్లిమెంటరీ ఓటర్ల జాబితా విడుదల చేస్తామన్నారు.
జిల్లా పరిధిలో 3,547 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, 3,521 మంది బూత్ లెవల్ అధికారులను నియమించామని చెప్పారు. జిల్లాలో కొత్తగా 26 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుకు, 46 పోలింగ్ కేంద్రాల ప్రదేశాల మార్పునకు ఎలక్షన్ కమిషన్‌కు సిఫార్స్ చేశామన్నారు. జిల్లాకు 9,578 బ్యాలెట్ యూనిట్లు, 7,804 కంట్రోల్ యూనిట్లు అవసరం కాగా 10,600 బ్యాలెట్ యూనిట్లు, 8,300 కంట్రోల్ యూనిట్లు కేటాయించినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఈవీఎంలకు సంబంధించి ఈ నెల పదిన మొదటి విడత తనిఖీని ట్రైనీ జాయింట్ కలెక్టర్ సీహెచ్ శ్రీధర్ ఆధ్వర్యంలో పూర్తి చేశామన్నారు.
23న మాక్ పోలింగ్...
జిల్లాలో ఈ నెల 23న పది శాతం ఈవీఎంలలో రాజకీయ పార్టీల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్, సహాయ ఎన్నికల వ్యయ పరిశీలకులు, ప్రత్యేక నోడల్, ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిస్టిక్ సర్వేలెన్స్ బృందాలకు, మండల స్థాయి అధికారులకు, పోలీసు సిబ్బందికి, పొలిటికల్ పార్టీలకు, ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు, ఇతర సిబ్బందికి 23న నిర్వహించే మాక్‌పోలింగ్ వివరాలతో పాటు తరువాత నిర్వహించే కార్యక్రమాల తేదీల వివరాలను కూడా వివరంగా తెలియజేస్తామన్నారు. ఎన్నికల నిర్వహణలో వివిధ రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రలోభపెట్టే అవకాశం ఉన్నందున వీడియో సర్వైవల్ బృందాలతో నిరంతరం నిఘా పెట్టినట్లు తెలిపారు. మచిలీపట్నంలో ఎల్‌పెరోజీ, విజయవాడ పరిధిలో సీహెచ్ శైలజ, మరో 16 మంది సహాయ పరిశీలకులు విధుల్లో పాల్గొన్నారన్నారు.
ఓటింగ్ శాతం పెంపునకు చర్యలు...
గతంలో జరిగిన ఓటింగ్ శాతం కన్నా అధికంగా పెరిగేందుకు పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో స్వీప్ విధానాన్ని జిల్లాలో అమలు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకునేలా వినూత్న కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ బీ శ్రీనివాసులు, జిల్లా ఎస్‌పీ జే ప్రభాకరరావు, జాయింట్ కలెక్టర్ జే మురళీ, ట్రైనీ జేసీ సీహెచ్ శ్రీధర్, ఉడా వీసీ పీ ఉషాకుమారి, వీఎంసీ కమిషనర్ సీ హరికిరణ్, సబ్‌కలెక్టర్లు హరిచందన, చక్రధర్‌బాబు, డీసీపీ రవిప్రకాష్ తదితరులు ప్రసంగించారు.