M. Raghunandanravu
-
అక్టోబర్ నుంచి పింఛన్ పెంపు
కలెక్టర్ రఘునందన్‌రావు విజయవాడ సిటీ : అక్టోబర్ నుంచి ఫించన్ సొమ్ము పెరుగుతున్నందున సామాజిక భద్రతా పింఛన్ డేటాను ఆధార్‌తో అనుసంధానం చేసే ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని కలెక్టర్ ఎం. రఘునందన్‌రావు మండల అభివృద్ధి అధికారులను ఆదేశించారు. ఆధార్ అనుసంధానంపై బుధవారం ఆయన నగరంలోని సబ్-కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పింఛన్‌దారుల వివరాలను ఆధార్ వివరాలతో అనుసంధానాన్ని నూరుశాతం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సామాజిక భద్రతా పింఛను కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని చెప్పారు. ఎంపీడీవోలు తక్షణమే స్పందించాలని సూచించారు. వచ్చే అక్టోబర్ 2వ తేదీ నుంచి వృద్ధులు, వితంతువులకు రూ.200 నుంచి రూ. 1000, వికలాంగులకు రూ. 1000నుంచి రూ. 1500 వరకు పెరిగిందన్నారు. జిల్లాలో 3,13,026 మంది పింఛను దారులున్నారని వీరిలో ఇప్పటి వరకు 2,10,424 మంది పింఛనుదారులు ఆధార్ అనుసంధానం చేయించుకోగా, 25,264 మంది ఎన్రోల్మెంట్ అనుసంధానం చేశారని చెప్పారు. మిగిలిన 77,340 మంది ఫించనుదారుల ఆధార్ అనుసంధాన ప్రక్రియను ఈ మాసాంతానికి పూర్తిచేయాలని ఎంపీడీవోలకు కలెక్టర్ సూచించారు తీరప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలి... ఆధిక వర్షాలు, తుఫానులు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించే అవకాశాలున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యంగా పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో బెల్టుషాపులను అరికట్టాలన్నారు. జేసీ జె. ముర ళీ డీఆర్డీఏ పీడీ జనీకాంతారావు, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ సృజన పాల్గొన్నారు. -
సీఎం పర్యటనకు సర్వం సిద్ధం
నేడు బెజవాడ రానున్న చంద్రబాబు విజయవాడ సిటీ : రాష్ర్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం విజయవాడ రానున్నారు. ఆయన పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. సీఎం పర్యటించే ప్రాంతాల్లో శుక్రవారం కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు, జాయింట్ కలెక్టర్ మురళి ఏర్పాట్లను సమీక్షించారు. పోలీస్ కమిషనర్ బి.శ్రీనివాసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. గన్నవరం విమానాశ్రయంలో భారీ భద్రత చర్యలు చేపట్టారు. గన్నవరం నుంచి విజయవాడ వరకు జాతీయ రహదారి పొడవునా పోలీసులు తనిఖీలు నిర్వహించారు. చంద్రబాబు ప్రత్యేక విమానంలో శనివారం ఉదయం 10.45 గంటలకు గన్నవరం చేరుకుంటారు. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఆంధ్ర లయోల కళాశాలలో ఏపీఎన్జీవో అసోసియేషన్ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఇరిగేషన్ కార్యాలయ ప్రాంగణానికి చేరుకుంటారు. 3.05 గంటల నుంచి 4.05 గంటల వరకు జిల్లాలోని సీనియర్ అధికారులతో ఏర్పాటుచేసిన సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 4.40 గంటలకు గురునానక్ కాలనీలోని ఎన్ఏసీ కల్యాణ మండపంలో ప్రజాప్రతినిధులు, టీడీపీ శ్రేణులతో సమావేశమవుతారు. సాయంత్రం 6.30 గంటలకు బందరురోడ్డులోని శేషసాయి కల్యాణ వేదికలో జరిగే ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. రాత్రి 7.50 గంటలకు గన్నవరం నుంచి బయలుదేరి హైదరాబాద్ వెళ్తారు. -
విద్యాశాఖాధికారులు సిద్ధ్దం కండి
అందరికీ పాఠ్య పుస్తకాలందించాలి కొత్తయూనిఫాంలు పంపిణీ చేయాలి మౌలిక సౌకర్యాలు తప్పనిసరి అధికారులతో కలెక్టర్ విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : పాఠశాలలు పునః ప్రారంభం నాటికే ప్రతి విద్యార్థికీ పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలతో పాటు పాఠశాలలు, వసతిగృహాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులు దృష్టి కేంద్రీకరించాలని కలెక్టర్ ఎం. రఘునందన్‌రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. సాంఘిక సంక్షేమ, విద్య, రాజీవ్ విద్యామిషన్, అనుబంధ శాఖల అధికారులతో బుధవారం కలెక్టర్ విజయవాడలో తన క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూన్ 12వ తేదీన జిల్లాలో అన్ని పాఠశాలలు పునః ప్రారంభం కానున్న దృష్ట్యా విద్యార్థులందరికీ పాఠ్య పుస్తకాలు, యూనిఫాంలు తప్పనిసరిగా అందించాలన్నారు. అదే రోజు ప్రతి విద్యార్థి కొత్త యూనిఫాం, పాఠ్యపుస్తకాలతో తరగతులకు హాజరయ్యేలా చూడవలసిన బాధ్యత అధికారులపై ఉందని చెప్పారు. అన్ని సబ్జక్టుల పాఠ్యపుస్తకాలు అందరికీ అందాలన్నారు. ప్రతీ విద్యార్థికి రెండు జతల యూనిఫాంలు అందించాలన్నారు. మధ్యాహ్న భోజనం అందించేందుకు ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలని చెప్పారు. విద్యార్థుల డ్రాప్అవుట్లు లేకుండా చూడాలని, నూరు శాతం విద్యార్థులు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన కోరారు. ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులను విద్యాభివృద్ధికి ఖర్చుచేస్తున్నందున, అధికారులు చిత్తశుద్ధితో విధులను నిర్వర్తించాలని తెలిపారు. మండల విద్యాశాఖాధికారులు వ్యక్తిగతంగా ప్రతి పాఠశాలకు వెళ్లి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫాంలు అందినదీ లేనిదీ తెలుసుకోవాలని చెప్పారు. సంక్షేమ వసతి గృహాలను పాఠశాలల పునః ప్రారంభానికి అన్ని సౌకర్యాలతో సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. అధికారులు వసతి గృహాలను పరిశీలించి తాగు నీరు, విద్యుత్,మరుగుదొడ్ల సదుపాయాల వంటి మౌలిక వసతులను పరిశీలించాలన్నారు. సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు డీ. మదుసూదనరావు, జిల్లా విద్యాశాఖాధికారి టీ. దేవానందరెడ్డి, రాజీవ్ విద్యామిషన్ పీడీ పద్మావతి, జిల్లా బీసీ సంక్షేమ శాఖాధికారి చినబాబు, తదితరులు పాల్గొన్నారు. అమృత హస్తమందించండి... ఇందిరమ్మ అమృత హస్తం పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు అన్ని అంగన్ వాడీ కేంద్రాల్లో గ్యాస్ కనెక్షన్లు ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎం. రఘునందన్‌రావు ఐసీడీఎస్ అధికారులను ఆదేశించారు. జిల్లా సమగ్ర శిశు అభివృద్ధి సంస్థ అమలు తీరుపై బుధవారం కలెక్టర్ నగరంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు, బాలింతలు పౌష్టికాహారాన్ని అందించే అమృత హస్తం పథకాన్ని ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకునేలా అధికారులు చూడాలన్నారు. అంగన్వాడీ వర్కర్లు, సూపర్ వైజర్లు, సీడీపీవోలకు ర్యాంకింగ్ విధానం ద్వారా వారి ప్రతిభను నమోదు చేయాలని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేసేవారికి ప్రతీ నెలా జీతాలందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఐసీడీఎస్ అధికారులను ఆదేశించారు. ఐ.సీ.డీ.ఎస్. ప్రాజెక్ట్ డైరక్టర్ కె. కృష్ణకుమారి, సీడీపీవోలు లలిత కుమారి, అంకమాంబ, జయలక్ష్మి, సంధ్య, స్వరూపరాణి, సూపర్ వైజర్లు పాల్గొన్నారు. -
జిల్లాలో పోలింగ్ ప్రశాంతం
సాక్షి, మచిలీపట్నం : జిల్లాలో బుధవారం జరిగిన 16వ సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా మొత్తం మీద 78.34 శాతం పోలింగ్ నమోదైంది. 2009 సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో 80.86 శాతం పోలింగ్ జరగగా ఈసారి 2.52 శాతం తగ్గింది. గత ఎన్నికల కంటే జిల్లాలో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. జిల్లా రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు నేతృత్వంలోని జిల్లా యంత్రాంగం ఓటు హక్కు వినియోగంపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించింది. దీంతో దాదాపు 85 శాతం వరకు ఓటింగ్ జరుగుతుందని భావించారు. అందుకు భిన్నంగా గతం కంటే కూడా పోలింగ్ శాతం తగ్గడం గమనార్హం. జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు, ఎస్పీ జె.ప్రభాకరరావులు చేపట్టిన చర్యలు ఫలితాన్నిచ్చాయి. చిన్నపాటి ఘటనలు మినహా దాదాపు జిల్లా అంతటా పోలింగ్ ప్రశాంతంగానే సాగింది. మొరాయించిన ఈవీఎంలు జిల్లాలో దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ పలు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. ఈవీఎంలను ముందుగానే పరిశీలించుకోండి, అవి పనిచేయలేదని పోలింగ్ ఆలస్యం కాకూడదని తొలినుంచీ కలెక్టర్ చెబుతున్నా ఫలితం లేకపోయింది. దీంతో అరగంట నుంచి రెండు గంటలపాటు పలుచోట్ల పోలింగ్ నిలిచిపోయింది. పట్టణ ఓటర్లు ఉదయం నుంచే బారులు తీరితే పల్లెల్లో మాత్రం క్రమంగా ఓటింగ్ పుంజుకుంది. జిల్లా అంతటా ఫ్యాన్ గాలి ప్రభంజనం కనిపించింది. ఓటర్లు సెలైంట్ ఓటింగ్‌తో దుమ్ము దులిపేశారు. జగ్గయ్యపేటలో వైఎస్సార్సీపీ శ్రేణులపై టీడీపీ శ్రేణులు కవ్వింపు చర్యలకు దిగాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి వారిని చెదరగొట్టారు. అవనిగడ్డ నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు నిబంధనలను అతిక్రమించారు. పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటేయాలని ప్రచారం నిర్వహించారు. దీనిపై వైఎస్సార్సీపీ శ్రేణులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు, ఎన్నికల సిబ్బంది రంగంలోకి దిగి నిబంధనలు అతిక్రమిస్తున్న టీడీపీ శ్రేణుల్ని వారించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయి వైఎస్సార్సీపీ కేడర్‌పై దాడులు చేసి గాయాలపాలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు ఈసారి జాగ్రత్తలు తీసుకుని బందోబస్తు కట్టుదిట్టం చేయడంతో అవాంఛనీయ ఘటనలు జరగలేదు. ఎన్నికల్లో ఓటమి భయంతో టీడీపీ డబ్బు, మద్యం పెద్ద ఎత్తున పంచింది. నియోజకవర్గాల వారీగా పోలింగ్ పదనిసలు ఇవీ... మచిలీపట్నంలోని రాంజీ హైస్కూల్లో 122 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు సరిగా పనిచేయలేదు. పోలింగ్ అధికారులు ఫిర్యాదుతో టెక్నీషియన్ వచ్చి దాన్ని సరిచేశాడు. 23వ వార్డులో ఒక పార్టీకే ఓటేస్తే మరో పార్టీ గుర్తు వద్ద లైట్ వెలగడంతో ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడ ఈవీఎంను మార్పు చేశారు. 119వ పోలింగ్ స్టేషన్లో ఓటర్ స్లిప్ ఉన్నప్పటికీ ఒక వృద్ధురాలి ఓటును వేరొకరు వేయడంతో వివాదం రేగింది. పెడన నియోజకవర్గంలో 45, 57, 185 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. వాటి స్థానంలో వేరే వాటిని పెట్టారు. గూడూరు మండలం గురిజేపల్లిలో ఇద్దరు వ్యక్తులు డబ్బు పంచుతుండగా వారి వద్ద నుంచి రూ.96 వేలు స్వాధీనం చేసుకున్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో ఘంటసాల మండలం చిట్టూర్పు వద్ద ఈవీఎంలు మొరాయించడంతో గంట ఆలస్యంగా పోలింగ్ మొదలైంది. చల్లపల్లి మండలం రామానగరంలోని ఒక బూత్‌లో ఈవీఎం మొరాయించడంతో అప్పటి వరకు వేసిన ఓట్లు పోయాయని కంగారుపడ్డారు. తరువాత మరమ్మతు చేసి అప్పటి వరకు వేసిన ఓట్లు ఉన్నాయని ప్రకటించారు. నాగాయలంక మండలం భావదేవరపల్లి, నంగేగడ్డ, చోడవరం ప్రాంతంలో టీడీపీ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ వెంట వచ్చిన 50 మంది కార్యకర్తలు సైకిల్ గుర్తుకు ఓటేయాలని ప్రచారం నిర్వహించి హల్చల్ చేశారు. కోడూరు మండలం ఐబీ పేటలో టీడీపీ నాయకులు బూత్‌లోకి వెళ్లి సైకిల్‌కు ఓటు వేయాలని ఓటర్లపై ఒత్తిడి చేశారు. దీంతో పోలింగ్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. పోలింగ్ కేంద్రాల సమీపంలోనే టీడీపీ కేడర్ స్లిప్పులు, మద్యం పంపిణీ చేశారు. దీంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు తహశీల్దార్ టీఆర్ రాజేశ్వరరావుకు ఫిర్యాదు చేయడంతో ఆయన పోలీసులతో వచ్చి టీడీపీ వాళ్లను పంపించి వేశారు. నాగాయలంకలో సజ్జా గోపాలకృష్ణ, తలశిల సత్యనారాయణ నేరుగా 198, 199 పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లి ‘మన గుర్తు తెలుసుగా.. గట్టిగా గుద్దండి’ అంటూ ప్రచారం నిర్వహించారు. అధికారులు సైతం అడ్డు చెప్పలేదు. నాగాయలంక మండలం టి.కొత్తపాలెంలో పోలింగ్ బూత్ వద్దే టీడీపీ నాయకులు డబ్బు పంచారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. పెనమలూరు నియోజకవర్గంలో తొమ్మిది ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యమైంది. పలుచోట్ల సిబ్బందికి ఈవీఎంలను సెట్ చేయడం రాకపోవడంతో పోలింగ్ అరగంట ఆలస్యమైంది. పామర్రు నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడంతో గంట ఆలస్యంగా పోలింగ్ మొదలైంది. టీడీపీ నేతలు నిమ్మకూరు గ్రామంలో డబ్బులు పంచడం వివాదాస్పదమైంది. గుడివాడలో 90, 118 పోలింగ్ కేంద్రాల్లో, పెదపారుపూడి మండలంలో ఒకచోట ఈవీఎంలు మొరాయించాయి. టీడీపీ అభ్యర్థి తమ ప్రాంతంలో డబ్బులు ఇవ్వలేదని గుడివాడలో పార్టీ కార్యాలయం ముందు పలువురు ఓటర్లు ధర్నా చేశారు. పోలీసులు వచ్చి వారిని చెదరగొట్టారు. గన్నవరంలో సావరిగూడెం, ముస్తాబాద, బీబీ గూడెంలో ఈవీఎంలు మొరాయించడంతో ఆలస్యంగా పోలింగ్ మొదలైంది. వాటి స్థానంలో వేరే ఈవీఎంలను ఏర్పాటు చేశారు. బుద్ధవరం గ్రామంలో పోలింగ్ బూత్ వద్ద మహిళా సమాఖ్య అధ్యక్షురాలు టీడీపీకి ఓటేయాలని ప్రచారం చేయడంతో వైఎస్సార్సీపీ, సీపీఎం నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె అక్కడ్నుంచి వెళ్లిపోయింది. కేసరపల్లి వద్ద ఏ బటన్ నొక్కినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే ఓట్లు పడుతున్నాయంటూ టీడీపీ నేతలు హడావుడి చేసి ఆందోళన నిర్వహించారు. దీంతో జిల్లా అదనపు కలెక్టర్ చెన్నకేశవరావు, ట్రైనీ కలెక్టర్ కాళీచరణ్, రిటర్నింగ్ అధికారి ఎన్వీవీ సత్యనారాయణ వచ్చి ఆ ఈవీఎం సక్రమంగానే ఉందని నిర్ధారించారు. అయినా టీడీపీ వివాదం చేయడంతో దానిని మార్చి మరోటి ఏర్పాటు చేశారు. నూజివీడు నియోజకవర్గంలో ఐదు ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ కొద్దిసేపు ఆలస్యమైంది. దీంతో వాటిని మార్పు చేసి వేరేవాటిని ఏర్పాటు చేశారు. కైకలూరు హైస్కూల్లో రెండు సెంటర్లు, గుమ్మళ్లపాడు, వెలంపేటలో ఈవీఎంలు మొరాయించాయి. తిరువూరు నియోజకవర్గంలో నాలుగు కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా మొదలైంది. వాటిని మార్పు చేసి వేరే వాటిని ఏర్పాటుచేశారు. బందోబస్తు సక్రమంగా లేకపోవడంతో ఇబ్బంది ఏర్పడింది. మైలవరం నియోజకవర్గం తోలుకోడు గ్రామంలో టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నడుమ వివాదం రేగింది. పోలీసులు రంగంలోకి దిగడంతో వివాదం సద్దుమణిగింది. రెడ్డిగూడెంలో టీడీపీ కార్యకర్త దురుసుగా ప్రవర్తించడంతో కానిస్టేబుల్ చేయి చేసుకున్నారు. దీంతో టీడీపీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేశారు. చంద్రాలలో 39వ నంబర్ పోలింగ్ బూత్‌లో ఈవీఎం మొరాయిడంతో 20 నిమిషాలు పోలింగ్ ఆలస్యమైంది. రెడ్డిగూడెం మండలంలో రెండుచోట్ల, జి.కొండూరు మండలంలో ఒకచోట ఈవీఎంలు మొరాయించాయి. నందిగామలో టీడీపీ కార్యకర్తలు డబ్బులు పంచుతుండగా లక్ష రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నియోజకవర్గంలో తొమ్మిది చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో వాటిని సరిచేయడంతో ఆలస్యంగా ఓటింగ్ జరిగింది. జగ్గయ్యపేటలో కవ్వింపు చర్యలు... జగ్గయ్యపేటలో టీడీపీ అభ్యర్థి శ్రీరాం తాతయ్య ఇంట్లో ఆ పార్టీ కార్యకర్తలు ఓటర్లకు డబ్బులు పంచేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి రావడంతో వారంతా చెల్లాచెదురయ్యారు. టీడీపీ నాయకుడు నూకల కుమార్‌రాజా పోలింగ్ కేంద్రం వద్ద డబ్బు పంచడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టణంలోని పలు వార్డుల్లో టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. పోలీసులు లాఠీచార్జి చేసి వారిని చెదరగొట్టారు. జగ్గయ్యపేట మండలం రామచంద్రునిపేటలో టీడీపీకి చెందిన ఓ మహిళ రెండు దొంగ ఓట్లు వేయడానికి ప్రయత్నించడంతో వైఎస్సార్సీపీ ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీ ఏజెంట్లపై దాడిచేసి కొట్టారు. మరోచోట దొంగ ఓటు వేసే ప్రయత్నం చేసిన టీడీపీ కార్యకర్తను వైఎస్సార్సీపీ ఏజెంట్లు పోలీసులకు పట్టించారు. షేర్‌మహ్మద్‌పేటలో ఈవీఎం మొరాయించడంతో రెండు గంటలు ఆలస్యంగా పోలింగ్ మొదలైంది. గవరవరంలో అరగంట పాటు ఈవీఎం మొరాయించింది. గురుకుల పాఠశాల, గండ్రాయిల్లో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాల్లో, వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాల్లోను ఈవీఎంలు మొరాయించాయి. ఆసక్తి చూపని నగర ఓటరు విజయవాడ నగరంలో ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు అంతగా ఆసక్తి చూపలేదు. దీంతో ఆ మూడు నియోజకవర్గాల్లోనూ తక్కువ శాతం పోలింగ్ నమోదైంది. తూర్పు నియోజకవర్గంలోని పటమట పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు రెండుసార్లు మొరాయించాయి. స్వల్ప ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వర్షంలోనూ ఓటర్లు ఓటేసేందుకు ముందుకొచ్చారు. మధ్యాహ్నం అరగంటపాటు కురిసిన వర్షంతో కొద్దిసేపు అంతరాయం కలిగినా... ఆ తర్వాత ఓటేసేందుకు జనం క్యూకట్టారు. కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటువేసిన పలువురికి సార్వత్రిక ఎన్నికల్లో ఓటు దక్కకపోవడంతో లబోదిబోమన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు కొద్దిసేపు ఇబ్బందిపడ్డారు. గుణదల, సత్యనారాయణపురం ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడంతో కొద్దిసేపు ఆలస్యం జరిగింది. -
పోస్టల్ బ్యాలెట్లపై నిఘా : కలెక్టర్
దుర్వినియోగం చేస్తే క్రిమినల్ కేసులు ఓటర్ స్లిప్పు ఉంటే గుర్తింపు కార్డు అక్కర్లేదు విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ల వినియోగంపై గట్టి నిఘా ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు వెల్లడించారు. శనివారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పోస్టల్ బ్యాలెట్లు దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల విధులకు హాజరవుతూ పోస్టల్ బ్యాలెట్‌ను దుర్వినియోగం చేయటం చట్టరీత్యా నేరమన్నారు. పోస్టల్ బ్యాలెట్ దుర్వినియోగం చేస్తూ పట్టుబడితే ఉద్యోగం కోల్పోయే ప్రమాదముందన్నారు. అటువంటివారిపై క్రిమినల్ కేసులు కూడా పెడతామని చెప్పారు. జిల్లాలో 25 వేల మందికి పోస్టల్ బ్యాలెట్లు ఇస్తున్నామన్నారు. ఈ నెల 28, 29 తేదీల్లో విజయవాడ సిద్ధార్థ ఆడిటోరియంలో పోస్టల్ బ్యాలెట్ల వినియోగంపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశామని చెప్పారు. ఎన్నికల సిబ్బంది ఆయా తేదీల్లో వచ్చి లోక్‌సభ, అసెంబ్లీ బ్యాలెట్లు తీసుకుని ఓటుహక్కు వినియోగించుకోవచ్చని సూచించారు. ఆ రెండు రోజుల్లో దరఖాస్తులు సమర్పించి, బ్యాలెట్లు తీసుకుని వెంటనే ఓటుహక్కు వినియోగించుకోవాలన్నారు. జిల్లాలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గ ప్రధాన కేంద్రాల్లో పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి ఫెసిలిటేట్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. నేటినుంచి స్లిప్పుల పంపిణీ... ఆదివారం నుంచి జిల్లాలో ఓటర్లకు స్లిప్పుల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నట్లు కలెక్టర్ చెప్పారు. 28, 29 నాటికి స్లిప్పులు మొత్తం పంపిణీ జరిగేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఓటర్ స్లిప్పులు ఉంటే ఎటువంటి గుర్తింపు కార్డూ అవసరం లేదని ఎన్నికల కమిషన్ తాజాగా ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఒకరి ఓటర్ స్లిప్పులు సంబంధంలేని వారి వద్ద ఉంటే ఎన్నికల నేరంగా పరిగణించి వారిపై కేసు పెడతామని చెప్పారు. సమావేశంలో నగర పోలీస్ కమిషనర్ బి.శ్రీనివాసులు, జేసీ జె.మురళి పాల్గొన్నారు. -
ఓటర్ల తుది జాబితా
కలెక్టరేట్ (మచిలీపట్నం), న్యూస్‌లైన్ : సాధారణ ఎన్నికల ఓటర్ల తుది జాబితాను కలెక్టర్ ఎం. రఘునందన్‌రావు శుక్రవారం విడుదల చేశారు. జిల్లాలో ఈనెల 9వ తేదీన ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కొత్తగా 59,958 మంది ఓటు నమోదు చేసుకున్నారు. వీరిలో పురుషులు 29,023 మంది, మహిళలు 30,847, ఇతరులు 88 మంది ఉన్నారు. విజయవాడ ఈస్ట్ నియోజకవర్గంలో 14,665 మంది ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. అత్యల్పంగా పామర్రు నియోజకవర్గంలో 624 మంది నమోదు చేసుకున్నారు. నూతనంగా ఓటర్లుగా నమోదైన వారి వివరాలు ఇలా ఉన్నాయి. తిరువూరు 2,342, నూజివీడు 1,823, గన్నవరం 2,520, గుడివాడ 3,778, కైకలూరు 752, పెడన 1,320, మచిలీపట్నం 3,322, అవనిగడ్డ 636, పెనమలూరు 2,622, విజయవాడ వెస్ట్ 7,663, విజయవాడ సెంట్రల్ 10,120, మైలవరం 3,167, నందిగామ 2,185, జగ్గయ్యపేట 2,419 మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. వీరితో కలుపుకుని జిల్లాలో మొత్తం ఓటర్లు 33,37,071 మంది ఉన్నారు. ఇందులో పురుషులు 16,58,639 మంది, మహిళలు 16,78,118, ఇతరులు 314 మంది ఉన్నారు. -
ఓటింగ్ శాతం పెంచండి : కలెక్టర్
విజయవాడ, న్యూస్‌లైన్ : ఓటింగ్ శాతం పెంపుపై ఎన్నికల సిబ్బంది దృష్టిసారించాలని జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు అన్నారు. జిల్లాలోని 16 నియోజకవర్గాలకు చెందిన సెక్టార్, రిటర్నింగ్ అధికారులకు గురువారం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో రెండు విడతలుగా శిక్షణా తరగతులు నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడంలో సెక్టార్ అధికారులదే కీలక బాధ్యత అని కలెక్టర్ చెప్పారు. అలసత్వం, జాప్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. జాయింట్ కలెక్టర్ జె.మురళి మాట్లాడుతూ ఓటు వేయడానికి ఆసక్తిగా లేని ప్రాంతాల ప్రజలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఓటర్ స్లిప్పుల పంపిణీ బాధ్యత సెక్టార్ అధికారులదే... ఓటర్లకు ఫొటో గుర్తింపు కార్డుల్ని బాధ్యతలేని వ్యక్తులు, రాజకీయ పార్టీల ద్వారా జారీ చేయిస్తే ప్రజాప్రతినిధ్య చట్టం 1951 నిబంధనలకు లోబడి కేసులు నమోదు చేస్తున్నట్లు విజయవాడ లోక్‌సభ సాధారణ పరిశీలకురాలు రేణుసంత్ హెచ్చరించారు. సెక్టార్ ఆఫీసర్లు పోలింగ్ కేంద్రాల మౌలిక సదుపాయాలపై దృష్టిసారించాల్సిందిగా సూచించారు. ఫొటో ఓటర్ స్లిప్పుల జారీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ఇంటింటికి వెళ్లి ఓటర్ స్లిప్పులు మంజూరు చేయాలన్నారు. సెంట్రల్ నియోజక వర్గ పరిశీలకులు పుష్యపాటి సక్సేనా పాల్గొన్నారు. తిరువూరు, కైకలూరు, పెడన, అవనిగడ్డ, పామర్రు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాలకు ఉదయం.. మచిలీపట్నం, పెనమలూరు, విజయవాడ తూర్పు, పశ్చిమ, మధ్య, నూజివీడు, గుడివాడ, గన్నవరం నియోజక వర్గాల సెక్టార్, రిటర్నింగ్ అధికారులకు మధ్యాహ్నం శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. -
సార్వత్రిక ఎన్నికలు ఏర్పాట్లు పూర్తి
1,62,888 మంది కొత్త ఓటర్లు రెండు మూడురోజుల్లో సప్లిమెంటరీ ఓటర్ల జాబితా 23న మాక్ పోలింగ్ కలెక్టర్ రఘునందన్‌రావు వెల్లడి విజయవాడ, న్యూస్‌లైన్ : రానున్న సాధారణ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు చెప్పారు. స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఉదయం ఎన్నికల ఏర్పాట్లపై వివరించేందుకు ఎన్నికల పరిశీలకులు, రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులు తదితరులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్నికలలో ఓటర్లు ఓటు వినియోగించుకునేందుకు 400 గంటలు మాత్రమే సమయం ఉందని కలెక్టర్ చెప్పారు. కొత్త ఓటర్లకు ఓటుహక్కు కల్పనకు చర్యలు... 2014 జనవరి నాటికి జిల్లాలో 15,79,374 మంది పురుషులు, 15,96,486 మంది మహిళలు, 226 మంది ఇతరులు ఓటర్లుగాఉన్నారని, కొత్తగా 2,06,924 మంది దరఖాస్తు చేసుకున్నారని కలెక్టర్ వివరించారు. వారిలో 1,62,888 మందికి ఓటు హక్కు కల్పించేందుకు చర్యలు పూర్తిచేసినట్లు చెప్పారు. రెండు మూడు రోజుల్లో సప్లిమెంటరీ ఓటర్ల జాబితా విడుదల చేస్తామన్నారు. జిల్లా పరిధిలో 3,547 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, 3,521 మంది బూత్ లెవల్ అధికారులను నియమించామని చెప్పారు. జిల్లాలో కొత్తగా 26 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుకు, 46 పోలింగ్ కేంద్రాల ప్రదేశాల మార్పునకు ఎలక్షన్ కమిషన్‌కు సిఫార్స్ చేశామన్నారు. జిల్లాకు 9,578 బ్యాలెట్ యూనిట్లు, 7,804 కంట్రోల్ యూనిట్లు అవసరం కాగా 10,600 బ్యాలెట్ యూనిట్లు, 8,300 కంట్రోల్ యూనిట్లు కేటాయించినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఈవీఎంలకు సంబంధించి ఈ నెల పదిన మొదటి విడత తనిఖీని ట్రైనీ జాయింట్ కలెక్టర్ సీహెచ్ శ్రీధర్ ఆధ్వర్యంలో పూర్తి చేశామన్నారు. 23న మాక్ పోలింగ్... జిల్లాలో ఈ నెల 23న పది శాతం ఈవీఎంలలో రాజకీయ పార్టీల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్, సహాయ ఎన్నికల వ్యయ పరిశీలకులు, ప్రత్యేక నోడల్, ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిస్టిక్ సర్వేలెన్స్ బృందాలకు, మండల స్థాయి అధికారులకు, పోలీసు సిబ్బందికి, పొలిటికల్ పార్టీలకు, ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు, ఇతర సిబ్బందికి 23న నిర్వహించే మాక్‌పోలింగ్ వివరాలతో పాటు తరువాత నిర్వహించే కార్యక్రమాల తేదీల వివరాలను కూడా వివరంగా తెలియజేస్తామన్నారు. ఎన్నికల నిర్వహణలో వివిధ రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రలోభపెట్టే అవకాశం ఉన్నందున వీడియో సర్వైవల్ బృందాలతో నిరంతరం నిఘా పెట్టినట్లు తెలిపారు. మచిలీపట్నంలో ఎల్పెరోజీ, విజయవాడ పరిధిలో సీహెచ్ శైలజ, మరో 16 మంది సహాయ పరిశీలకులు విధుల్లో పాల్గొన్నారన్నారు. ఓటింగ్ శాతం పెంపునకు చర్యలు... గతంలో జరిగిన ఓటింగ్ శాతం కన్నా అధికంగా పెరిగేందుకు పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో స్వీప్ విధానాన్ని జిల్లాలో అమలు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకునేలా వినూత్న కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ బీ శ్రీనివాసులు, జిల్లా ఎస్పీ జే ప్రభాకరరావు, జాయింట్ కలెక్టర్ జే మురళీ, ట్రైనీ జేసీ సీహెచ్ శ్రీధర్, ఉడా వీసీ పీ ఉషాకుమారి, వీఎంసీ కమిషనర్ సీ హరికిరణ్, సబ్కలెక్టర్లు హరిచందన, చక్రధర్‌బాబు, డీసీపీ రవిప్రకాష్ తదితరులు ప్రసంగించారు. -
మౌలిక వసతులు కల్పించాం : కలెక్టర్
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : పోలింగ్ కేంద్రాలలో ఓటర్లకు అన్ని మౌలిక వసతులు కల్పించామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం. రఘునందన్‌రావు రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌కు వివరించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ సోమవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ అధికారులతో పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు, ఫామ్-6 దరఖాస్తుల పరిష్కారం, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, పోలింగ్ అధికారుల శిక్షణ, కమ్యూనికేషన్ ప్రణాళిక వంటి పలు అంశాలపై వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అన్ని పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, షామియానా,ప్రథమ చికిత్సా కేంద్రం తదితర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. అవసరమైన చోట్ల తాత్కాలిక ర్యాంపులు ఏర్పాటు చేసినట్లు వివరించారు. గత డిసెంబర్ నుంచి ఈ నెల 9వ తేదీ వరకు జిల్లాలో 2,14,372 ఓటర్ల దరఖాస్తులు పరిష్కరించామని, మిగిలిన 70, 958 దరఖాస్తులను తక్షణమే పరిష్కరిస్తామని చెప్పారు. ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు తొలిదశ శిక్షణ ఇచ్చామన్నారు. జిల్లాకు ఎన్నికల వ్యయ పరిశీలకులు చేరుకున్నారని తెలిపారు. సమస్యాత్మక, అతిసమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో వెబ్ క్యాస్టింగ్ సదుపాయాన్ని కల్పించి కమ్యూనికేషన్ విధానాన్ని అమలు చేస్తున్నామని ఆయన ఎన్నికల ప్రధాన అధికారికి వివరించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అన్ని మౌలిక వసతులు కల్పించాలన్నారు. కొత్త ఓటర్ల నమోదుకు చేసుకున్న ఫామ్-6 దరఖాస్తులను ఈ నెల 19వ తేదీ నాటికి పరిశీలన పూర్తి చేసి అర్హులైన వారికి ఫొటో ఓటరు గుర్తింపు కార్డులను అందజేయాలని సూచించారు. ప్రతి ఓటరు బూత్ స్థాయి అధికారి ద్వారా ఫొటో ఓటరు స్లిప్పులను నూరుశాతం పంపిణీ చేయాలని కోరారు. నామినేషన్ల దరఖాస్తులను అప్పటికప్పుడే పరిశీలించి వివరాలను సకాలంలో ఎన్నికల కమిషన్‌కు నివేదించాలన్నారు. ఎన్నికల ప్రవర్తనానియమావళిని ఉల్లంఘించే వారిపై నమోదు చేసిన కేసుల వివరాలు ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న నగదు తదితర వివరాల నివేదికను అందజేయాలని భన్వర్‌లాల్ ఆదేశించారు. వీడియోకాన్ఫరెన్స్‌లో విజయవాడ పోలీస్ కమిషనర్ బీ. శ్రీనివాసులు, మచిలీపట్నంనుంచి ఎస్పీ జె. ప్రభాకరరావు, ఏఆర్ డీఎస్పీ చంద్రశేఖర్, ఎస్బీ సీఐ పి.మురళీధర్, ఆర్ఐ కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. -
ష్.. గప్‌చుప్
ఇక ప్రలోభాల వల జోరుగా నగదు, మద్యం పంపిణీ మచిలీపట్నం, న్యూస్‌లైన్ : ప్రాదేశిక ఎన్నికల తుది పోరులో ప్రచారం ముగిసింది. ప్రతిష్టాత్మకమైన జిల్లా పరిషత్ పీఠాన్ని దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. రెండో విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారానికి బుధవారం చివరిరోజు కావడంతో అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. నూజివీడు, గుడివాడ రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఈ నెల 11న ఎన్నికలు జరగనున్నాయి. నూజివీడు డివిజన్లో 14 జెడ్పీటీసీ, 234 ఎంపీటీసీ, గుడివాడ డివిజన్లో 9 జెడ్పీటీసీ, 129 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలను పకడ్భందీగా నిర్వహించేందుకు కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు, జెడ్పీ సీఈవో డి.సుదర్శనం నేతృత్వంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రలోభాలకు తెర తీశారు... రెండో విడత ఎన్నికల ప్రచారం ముగియటంతో అభ్యర్థులు ప్రలోభాలకు తెర తీశారు. ఓటుకు రూ.300 నుంచి పోటీని బట్టి వెయ్యి వరకు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. బుధవారం రాత్రి నుంచే నగదు పంపిణీ కార్యక్రమం గుట్టు చప్పుడు కాకుండా చేస్తున్నారు. గుడివాడ, నూజివీడు డివిజన్లలో మద్యం పంపిణీ ఊపందుకుంది. ఏర్పాట్లు పూర్తి... రెండో విడత ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ ఎం రఘునందన్‌రావు తెలిపారు. 11న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఆయన చెప్పారు. రెండు డివిజన్లలో 9,36,252 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని తెలిపారు. 1230 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. గుడివాడ డివిజన్లో 9 జెడ్పీటీసీ స్థానాలకు 27 మంది అభ్యర్థులు, 129 ఎంపీటీసీ స్థానాలకు 309 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు ఆయన చెప్పారు. నూజివీడు డివిజన్లోని 14 జెడ్పీటీసీ స్థానాలకు గాను 51 మంది అభ్యర్థులు, 234 ఎంపీటీసీ స్థానాలకు 610 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణలో లోపాలు తలెత్తితే సమాచారం తెలుసుకునేందుకు జిల్లా పరిషత్‌లో కంట్రోల్ రూమ్ ల్యాండ్ లైన్ 08672-252572, టోల్ ఫ్రీ నంబరు 1077కు తెలియజేయాలని సూచించారు. 11న నూజివీడు, గుడివాడ డివిజన్లలోని సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాల్లో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జె.ప్రభాకరరావు తెలిపారు. ఏఎస్పీతో పాటు ఎనిమిది మంది డీఎస్పీలు, 25 మంది సీఐలు, 110 మంది ఎస్సైలు, 275 మంది ఏఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్లు, 1050 మంది కానిస్టేబుళ్లు, 700 మంది హోంగార్డులు, రెండు ప్లటూన్ల ఏఆర్, ఏపీఎస్పీ బృందాలతో పాటు అటవీశాఖ, ఎక్సైజ్, స్పెషల్ ఫోర్స్ సిబ్బందిని ఎన్నికల్లో విధుల్లో నియమించినట్లు చెప్పారు. -
ఓటుందో.. లేదో... చూసుకోండి
కలెక్టరేట్(మచిలీపట్నం), న్యూస్‌లైన్ : ప్రతి ఒక్కరూ ఓటర్ల జాబితాలో తమ ఓటు ఉందో, లేదో ముందుగా పరిశీలించుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎం.రఘునందన్‌రావు సూచించారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మచిలీపట్నంలోని 9వ వార్డులో కేకేఆర్ గౌతమ్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలోని 9/1వ నంబరు బూత్‌లో కలెక్టర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. జాయింట్ కలెక్టర్ జె.మురళీ లేడీస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన 11వ వార్డు పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ఓటరుగా నమోదైన ప్రతి ఒక్కరూ ఓటర్ల జాబితాలో తమ పేరు ఉందో, లేదో పరిశీలించుకోవాలని, లేకుంటే ఎన్నికల సంఘానికి మెసేజ్ ద్వారా పంపినా మీ ఓటు ఉందో, లేదో తెలిసిపోతుందని తెలిపారు. ఒక వేళ ఓటు లేకుంటే సంబంధిత ఫారాలతో ఎన్నికల సంఘం వెబ్సైట్లో పొందుపరచినా, సంబంధిత బీఎల్వోకు అందజేసినా ఓటు పొందవచ్చునన్నారు. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుందా అని కలెక్టర్‌ను ప్రశ్నించగా... 1వ తేదీ మధ్యాహ్నం నాటికి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలను బట్టి నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. పోలింగ్ కేంద్రంలో పోలింగ్ ఏజెంటుగా ఆ వార్డుకు సంబంధించిన వ్యక్తి అయ్యి ఉండాలా లేదా అని ప్రశ్నించగా ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థి ఎవర్ని సూచిస్తే వారిని ఏజెంటుగా నియమించుకోవచ్చని చెప్పారు. జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని, అయితే నందిగామ నియోజకవర్గం పరిధిలోని పోలింగ్ కేంద్రంలో ఓటర్ల జాబితాలో లోటుపాట్ల వల్ల పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైందన్నారు. ఈ సంఘటనపై అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. -
నిర్లక్ష్యం వహిస్తే దండనే
మండల, జెడ్పీ ఎన్నికలపై శిక్షణ 17 నుంచి 20 వరకు నామినేషన్లు 21న పరిశీలన 24న ఉపసంహరణ విజయవాడ, న్యూస్‌లైన్ : ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని కలెక్టర్, ఎన్నికల అథారిటీ జిల్లా అధికారి ఎం.రఘునందన్‌రావు హెచ్చరించారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో శనివారం రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. నోటిఫికేషన్ జారీ అయిన దగ్గర నుంచి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ఎన్నికల కార్యకలాపాలకు సం బంధించిన సమాచారం జిల్లా అధికారిక వెబ్సైట్ ‘కృష్ణా డాట్ ఎన్ఐసీ డాట్ ఇన్’లో అందుబాటులో ఉంచామని చెప్పారు. పంచాయతీరాజ్ చట్టం, నిబంధనలపై రిటర్నింగ్ అధికారులకు పూర్తి అవగాహన ఉండాలని సూచించారు. జెడ్పీ సీఈఓ, జిల్లా పరి షత్ అధికారులతో రిటర్నింగ్ అధికారులు ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ సమాచారాన్ని అందించాలని ఆదేశించారు. మండల పరిధిలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్ని సంబంధిత రిటర్నింగ్ అధికారులు తనిఖీ చేసి ఎన్నికల నిర్వహణకు అనువుగా ఉన్నదీ లేనిదీ పరిశీలించాలని చెప్పారు. అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే సమయంలో వీడియో తీయించాలన్నారు. 17వ తేదీ నాటికి అన్ని పోలింగ్ కేంద్రాలను పూర్తిస్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక, సాధారణ పోలింగ్ కేంద్రాలను ముందుగా గుర్తించి వెబ్ కాస్టింగ్, వీడియో తీయించాలని చెప్పారు. బ్యాలెట్ బాక్సుల్ని స్ట్రాంగ్ రూం నుంచి కౌంటింగ్ కేంద్రాలకు తరలించే సమయంలో అనధికారిక వ్యక్తుల ప్రమే యం లేకుండా బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. అప్రమత్తంగా ఉండండి : జేసీ ఎన్నికల నిర్వహణకు తక్కువ వ్యవధి ఉండటం వల్ల రిటర్నింగ్ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని జాయింట్ కలెక్టర్ జె.మురళీ సూచించారు. 17 నుంచి 20వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ నిర్వహించాలని చెప్పారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణకు గడువుగా నిర్ణయించామన్నారు. 21న నామినేషన్ల పరిశీలన, 24న అభ్యర్థుల ఉపసంహరణ అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను ప్రకటించాలని తెలిపారు. ఏప్రిల్ 6న పోలింగ్, 8న ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. అభ్యర్థుల నామినేషన్లను పూర్తి స్థాయిలో పరిశీలించి అర్హత లేని వాటిని మాత్రమే తిరస్కరించాలన్నారు. రిజర్వేషన్ల వర్తింపు, నామినేషన్లతో పాటు నగదు డిపాజిట్, పరిశీలన, అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు అంశాల్లో ఎన్నికల మార్గదర్శకాలను తూ.చా. తప్పకుండా పాటించాలన్నారు. అదనపు జాయింట్ కలెక్టర్ బిఎల్.చెన్నకేశవ రావు, జెడ్పీ సీఈవో డి.సుదర్శన్, డీపీవో ఆనంద్ పావర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివిధ అంశాలపై రిటర్నింగ్ అధికారులకు అవగాహన కల్పించారు. నగరపాలక సంస్థ కమిషనర్ సి.హరికిరణ్, సబ్ కలెక్టర్ డి.హరిచందన పాల్గొన్నారు. -
అభివృద్ధికి పునరంకితం
జిల్లాలో 65వ గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది. మచిలీపట్నం పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్‌లో ఆదివారం నిర్వహించిన ఈ వేడుకల్లో కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. మహనీయుల త్యాగాలే స్ఫూర్తిగా జిల్లా అభివృద్ధికి పునరంకితమవ్వాలని పిలుపునిచ్చారు మచిలీపట్నం, న్యూస్‌లైన్ : మహనీయుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని జిల్లా అభివృద్ధికి పునరంకితమవుదామని కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు సూచించా రు. 65వ గణతంత్ర దినోత్సవాలు స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఆదివారం ఘనంగా జరిగాయి. జాతీయ జెండాను కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో జిల్లాకు చెందిన ఎందరో మహనీయులు పాలు పంచుకున్నారన్నారు. జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య మనజిల్లా వాసి కావటం గర్వకారణమని చెప్పారు. కంకిపాడు మండలం పునాదిపాడు గ్రామానికి చెందిన అనుమోలు రామకృష్ణ శాస్త్ర, సాంకేతిక రంగాల్లో చేసిన సేవలకు గానూ పద్మభూషణ్ పురస్కారం, డాక్టర్ అనుమోలు రామారావుకు సామాజిక సేవ చేసినందుకు గానూ పద్మశ్రీ పురస్కారాలు లభించటం జిల్లా ప్రతిష్టను ఇనుమడింపజేశాయన్నారు. ప్రగతిపథంలో జిల్లా.... జిల్లాను ప్రగతిపథంలో పయనింజేయడంలో సంబంధిత అధికారులు నిరంతర కృషి సల్పారని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో జరిగిన అభివృద్ధిని ఆయన వివరించారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం ఇందిరమ్మబాట, ప్రజాపథం, రచ్చబండ, రెవెన్యూ, రైతు సదస్సులు, ఇందిరమ్మ కలలు, ప్రజావాణి, మీ-సేవా తదితర కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. పేద, బలహీనవర్గాల మహిళలు, రైతులు, విద్యార్థినీ, విద్యార్థుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు. పంటచేతికొచ్చే సమయంలో హెలెన్, లెహర్, తుపానులు, భారీ వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్నాయన్నారు. దాదాపు రెండు లక్షల ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిని రూ. 200 కోట్ల నష్టం జరిగిందని వివరించారు. నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక ద్వారా రూ. 21 కోట్లతో 28 సామాజిక భవనాలు, రూ.12.50 కోట్లతో ఇందిరమ్మ విద్యాలయాలు నిర్మించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల్లో రూ. 6 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. ఈ ఏడాది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా రూ. 137 కోట్లతో 13వేల యూనిట్లు స్థాపించాలని లక్ష్యంగా నిర్ణయించామని తెలిపారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో ఇప్పటి వరకు 70 వేల సమస్యలు పరిష్కరించామని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కుకు ప్రాముఖ్యత ఉందని, ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేయించుకోవాలని విసృ్తత ప్రచారం చేశామని తెలియజేశారు. రుణాలు అందజేత .... జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా పది మండలాల్లోని 49 క్లస్టర్లలో 3065 మంది మహిళా గ్రూపు సభ్యులకు రూ. 100 కోట్ల బ్యాంకు రుణాలను కలెక్టర్ పంపిణీ చేశారు. మత్స్యశాఖ ద్వారా రూ. 4.26 లక్షల విలువైన సైకిళ్లు, వలలను 62 మందికి అందజేశారు. వికలాంగుల సంక్షేమశాఖ ద్వారా 40 మంది వికలాంగులకు రూ. 2.50 లక్షలు విలువైన వీల్ చైర్లు, ట్రై సైకిళ్లు, 14 జతల చంక కర్రలు పంపిణీ చేశారు. వికలాంగులను వివాహం చేసుకున్న 14 జంటలకు ఒక్కొక్క జంటకు రూ. 50 వేల చొప్పున ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. 2012లో శిక్షణ పొందిన ఏఆర్ పోలీసులు వికలాంగులకు ట్రైసైకిళ్లు, పండ్లు, దుప్పట్లు సమకూర్చగా కలెక్టర్, ఎస్పీ వీటిని పంపిణీ చేశారు. స్వాతంత్య్ర సమరయోధులు కొండపల్లి పాండురంగారావు, చిల్లర మోహనరావు, మేకా నరసయ్య, జిల్లా ప్రధాన న్యాయమూర్తి చక్రధరరావు, ఎస్పీ జె.ప్రభాకరరావు, మొదటి అదనపు జిల్లా జడ్జి ఎంఆర్.శేషగిరిరావు, అనిత, జేసీ జె.మురళి, ఏజేసీ బీఎల్.చెన్నకేశవరావు, పట్టణ భూసేకరణ ప్రత్యేకాధికారి ఎన్.రమేష్, ట్రైనీ కలెక్టర్ కాళీచరణ్, జెడ్పీ సీఈవో బి.సుబ్బారావు, డ్వామా పీడీ అనిల్‌కుమార్, పశుసంవర్ధకశాఖ జేడీ దామోదరనాయుడు, వ్యవసాయశాఖ జేడీ బాలునాయక్, డీఈవో దేవానందరెడ్డి, డీఎంఅండ్‌హెచ్‌వో సరసజాక్షి, డీపీవో కె.ఆనంద్, సాంఘిక సంక్షేమశాఖ డీడీ డి.మధుసూదనరావు, బీసీ సంక్షేమశాఖ డీడీ ఎం.చినబాబు, ఆర్వీఎం పీవో వి.పద్మావతి, బీసీ కార్పొరేషన్ ఈడీ పుష్పలత, సీపీవో వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు పి.సాయిబాబు, ఎస్.వెంకటసుబ్బయ్య, ఐసీడీఎస్ పీవో కృష్ణకుమారి పాల్గొన్నారు. రాజీవ్ విద్యామిషన్ శకటానికి ప్రథమస్థానం మచిలీపట్నం క్రైం, న్యూస్‌లైన్ : గణతంత్ర దినోత్సవాల సందర్భంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన శకటాల ప్రదర్శనలో రాజీవ్ విద్యామిషన్ శకటానికి ప్రథమస్థానం లభించింది. డీఆర్డీఏ ద్వారా బంగారు తల్లి పథకం అమలు చేస్తున్న తీరు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ద్వారా అమలు చేస్తున్న పథకాలు, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా పేదలకు రుణాలు అందజేస్తున్న విధానం, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలో శుద్ధి చేసిన నీటినే తాగాలని కోరుతూ బుర్రకథ బృందంతో ఏర్పాటు చేసిన శకటం, ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అందుతున్న వైద్యసేవలు, 104, 108 తదితరాలను వివరిస్తూ ప్రత్యేక శకటాలను ఏర్పాటు చేశారు. ఈ శకటాలను పరిశీలించిన అధికారులు రాజీవ్ విద్యామిషన్ శకటానికి రూ. 5వేలు ప్రోత్సాహక బహుమతి ప్రకటించారు. వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న పథకాలను వివరించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్స్ ఆకట్టుకున్నాయి. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. -
ప్రతి ఓటు ఆయుధమే
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషిం చాల్సిన ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడంలో అత్యంత శక్తివంతమైన ఆయుధమైన ఓటును వినియోగించుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు పిలుపునిచ్చారు. జాతీయ ఓటరు దినోత్సవ కార్యక్రమాన్ని శనివారం స్థానిక ఆశీ ర్వాద్ భవన్లో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో 18-25 సంవత్సరాల మధ్య ఉన్న యువతీయువకులు మూడు లక్షల మంది ఓటర్లుగా నమోదు కావాల్సి ఉందన్నారు. 45 రోజులుగా జిల్లా యంత్రాంగం ఓటర్ల చేర్పులపై కసరత్తు చేసి 2.50 లక్షల మందిని నమోదు చేశారని చెప్పారు. మరో 50వేల మంది యువత ఓటరుగా నమోదు చేయించుకోవాల్సి ఉందని తమ పరిశీలనలో వెల్లడైందన్నారు. ఓట రుగా నమోదు చేసుకునేందుకు ఫిబ్రవరి వరకు సమయం ఉందని, ఎవరైనా ఓటరుగా నమోదు కావాలంటే సమీపంలోని బీఎల్వోలు, తహశీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆన్లైన్లో ఓటరుగా నమోదు చేసుకునే వారు వారి పేరు, తల్లిదండ్రుల పేరు, చిరునామా ఆన్లైన్లో పొందుపరిస్తే బీఎల్వోలు లేదా ఇతర అధికారులు చిరునామానాను బట్టి విచారణ చేసి ఓటరుగా గుర్తిస్తారని చెప్పారు. మరో వంద రోజుల్లో సాధారణ ఎన్నికలు జరుగనున్నాయని, రానున్న ఐదేళ్లకు మంచి పాలకవర్గాన్ని ఎన్నుకునేందుకు ఓటు సాధనంగా ఉపయోగపడుతుందన్నారు. ఓటు హక్కు వినియోగించుకునే బాధ్యత తదితర అంశాలపై రానున్న 50 రోజుల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం, జిల్లా యంత్రాంగం ప్రచారం చేయడానికి సన్నద్ధమవుతుందని చెప్పారు. కృష్ణా యూనివర్సిటీ వీసీ వున్నం వెంకయ్య మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించి ప్రజలకు సుపరిపాలన అందిస్తున్న భారత ఎన్నికల సంఘాన్ని ప్రతి ఒక్కరూ అభినందించాల్సి ఉందన్నారు. 2011లో భారత ఎన్నికల సంఘం చేపట్టిన సంస్కరణల కారణంగా ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలనే ధృక్పదం పెరిగిందని తెలిపారు. ఎస్పీ జె.ప్రభాకరరావు మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడంలో పోలీసులతో పాటు ప్రజలందరిపైనా బాధ్యత ఉందన్నారు. ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఎవరైనా అవకతవకలకు పాల్పడుతున్నట్లు దృష్టికి వస్తే... వెంటనే అధికారులకు తెలియజేయాలన్నారు. జేసీ జె.మురళీ మాట్లాడుతూ ఓటర్లలో అధికశాతం మంది యువతే ఉన్నారని చెప్పారు. డీఆర్వో ఎల్.విజయచందర్, ట్రైనీ కలెక్టర్ కాళీచరణ్ తదితరులు ప్రసంగించారు. భారత ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ వీఎస్ సంపత్ ప్రసంగాన్ని ఎల్సీడీ ప్రొజెక్టర్ ద్వారా ప్రదర్శించారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని కళాశాలల్లో నిర్వహించిన పోటీల్లో విజేతలకు ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేశారు. స్వాతంత్ర సమరయోధులు కొండపల్లి పాండురంగారావు, సీనియర్ ఓటర్లు చిలకలపూడి రామ్మోహనరావు, కన్నెగంటి సూర్యప్రకాశరావును కలెక్టర్ సన్మానించారు. బందరు ఆర్డీవో పి.సాయిబాబు, డీపీవో సదారావు, పద్మశ్రీ గొరిపర్తి నరసింహరాజు పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. ఓటు హక్కును వినియోగించుకుంటామని సమావేశానికి హాజరైన వారితో కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. -
ఓటర్ల నమోదులో జాగ్రత్త : కలెక్టర్
పెనమలూరు, న్యూస్‌లైన్ : కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు గురువారం పెనమలూరు తహశీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓటర్ల నమోదు, వాటి సర్వే వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఓట్ల నమోదుకు ఎన్ని దరఖాస్తులు అందాయని ప్రశ్నించారు. మొత్తం 15,852 దరఖాస్తులు అందాయని డీటీ ఇస్మాయిల్ తెలి పారు. కలెక్టర్ స్వయంగా కంప్యూటర్ వద్ద ఉండి డేటా నమోదు వివరాలు తెలుసుకున్నారు. ఓట్ల తొలగింపు, దరఖాస్తుల తిరస్కరణ కు కారణాలు తదితర విషయాలపై ఆయా గ్రామాల వీఆర్వోల వద్ద ఉన్న రికార్డులు తెప్పించి పరిశీలించారు. ఓటు దరఖాస్తులు తిరస్కరించిన కారణాలను దరఖాస్తు దారుడికి తెలపాలని ఆదేశించారు. కంకిపాడు,ఉయ్యూరు మండలాలకు సంబంధించి డేటా నమోదు బాధ్యతను నియోజకవర్గ కేంద్రంగా ఉన్న పెనమలూరు అధికారులే పర్యవేక్షించాలని ఆదేశించారు. డేటా ఎంట్రీకి సంబంధించి సైట్ సక్రమంగా ఓపెన్ కావడం లేదని ఫిర్యాదులందుతున్నాయన్నారు. సైట్ ఓపెన్ అవుతుందో లే దో స్వయంగా కంప్యూటర్ వద్దే చాలా సమయం ఉండి పరిశీలించారు. ఈ విషయంలో అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ఎంపీడీవో జుజ్జవరపు సునీతను పిలిపించి పలు పథకాల కింద లభ్థిదారులకు రుణాల అమలు ఎలా జరుగుతుందో తెలుసుకున్నారు. వెంటనే గ్రౌండ్ చేయాలని ఆదేశించారు. తహశీల్థార్ విజయకుమార్, డీటీ సురేష్‌కుమార్,ఆర్ఐలు సలీం, భవానీ పలువురు సిబ్బంది పాల్గొన్నారు. -
అన్ని రంగాల్లో ముందుండండి
కలెక్టరేట్(మచిలీపట్నం), న్యూస్‌లైన్ : నూతన సంవత్సర సందర్భంగా పలువురు అధికారులు కలెక్టర్ ఎం.రఘునందన్‌రావును కలిసి శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధి పథంలో పయనించేందుకు అధికారులు, సిబ్బంది సహకారం అందించాలన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తూ లబ్ధిదారుల ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. అన్ని రంగాల్లో ముందుండి జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంచేలా అధికారులు కృషి చేయాలన్నారు. నూతన సంవత్సరంలో జిల్లా ప్రజలంతా వారి వారి రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. తొలుత కలెక్టర్ రఘునందన్‌రావు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీ చక్రధరరావును కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో ఎస్పీ జే ప్రభాకరరావు, జాయింట్ కలెక్టర్ పీ ఉషాకుమారి, ఏజేసీ చెన్నకేశవరావు, డీఆర్వో విజయచందర్, జెడ్పీ సీఈవో బీ సుబ్బారావు, హౌసింగ్ పీడీ సీహెచ్ ప్రతాపరావు, డీఈవో డీ దేవానందరెడ్డి, ఆర్వీఎం పీవో బీ పద్మావతి, డీపీఆర్వో కే సదారావు, బందరు ఆర్డీవో పీ సాయిబాబు, కలెక్టర్ ఏవో పీ ఇందిరాదేవి కలెక్టర్‌ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విందు కార్యక్రమంలో కలెక్టర్, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జాప్ నాయకుల శుభాకాంక్షలు... నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని కలెక్టర్‌ను జాప్ సంఘం నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. బడే ప్రభాకర్ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేయాలని కలెక్టర్‌ను కోరారు. బాయిరెడ్డి అక్కయ్యబాబు, ఈదా రాంబాబు, జే అబ్రహం పాల్గొన్నారు. ఆంధ్రాబ్యాంకు సిబ్బంది.... ఆంధ్రాబ్యాంకు ఫౌండర్స్ సీనియర్ బ్రాంచ్ మేనేజరు మెహర్కృష్ణ కలెక్టర్‌ను కలసి శుభాకాంక్షలు తెలిపారు. బ్యాంకు రికవరీ మేనేజరు రామారావు ఉన్నారు.