సీఎం పర్యటనకు సర్వం సిద్ధం
- నేడు బెజవాడ రానున్న చంద్రబాబు
విజయవాడ సిటీ : రాష్ర్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం విజయవాడ రానున్నారు. ఆయన పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. సీఎం పర్యటించే ప్రాంతాల్లో శుక్రవారం కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు, జాయింట్ కలెక్టర్ మురళి ఏర్పాట్లను సమీక్షించారు. పోలీస్ కమిషనర్ బి.శ్రీనివాసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. గన్నవరం విమానాశ్రయంలో భారీ భద్రత చర్యలు చేపట్టారు.
గన్నవరం నుంచి విజయవాడ వరకు జాతీయ రహదారి పొడవునా పోలీసులు తనిఖీలు నిర్వహించారు. చంద్రబాబు ప్రత్యేక విమానంలో శనివారం ఉదయం 10.45 గంటలకు గన్నవరం చేరుకుంటారు. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఆంధ్ర లయోల కళాశాలలో ఏపీఎన్జీవో అసోసియేషన్ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొంటారు.
మధ్యాహ్నం మూడు గంటలకు ఇరిగేషన్ కార్యాలయ ప్రాంగణానికి చేరుకుంటారు. 3.05 గంటల నుంచి 4.05 గంటల వరకు జిల్లాలోని సీనియర్ అధికారులతో ఏర్పాటుచేసిన సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 4.40 గంటలకు గురునానక్ కాలనీలోని ఎన్‌ఏసీ కల్యాణ మండపంలో ప్రజాప్రతినిధులు, టీడీపీ శ్రేణులతో సమావేశమవుతారు. సాయంత్రం 6.30 గంటలకు బందరురోడ్డులోని శేషసాయి కల్యాణ వేదికలో జరిగే ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. రాత్రి 7.50 గంటలకు గన్నవరం నుంచి బయలుదేరి హైదరాబాద్ వెళ్తారు.