జిల్లాలో పోలింగ్ ప్రశాంతం | The success of the vote | Sakshi
Sakshi News home page

జిల్లాలో పోలింగ్ ప్రశాంతం

Published Thu, May 8 2014 2:17 AM | Last Updated on Sat, Sep 2 2017 7:03 AM

జిల్లాలో పోలింగ్ ప్రశాంతం

జిల్లాలో పోలింగ్ ప్రశాంతం

సాక్షి, మచిలీపట్నం : జిల్లాలో బుధవారం జరిగిన 16వ సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా మొత్తం మీద 78.34 శాతం పోలింగ్ నమోదైంది. 2009 సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో 80.86 శాతం పోలింగ్ జరగగా ఈసారి 2.52 శాతం తగ్గింది. గత ఎన్నికల కంటే జిల్లాలో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. జిల్లా రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు నేతృత్వంలోని జిల్లా యంత్రాంగం ఓటు హక్కు వినియోగంపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించింది.

దీంతో దాదాపు 85 శాతం వరకు ఓటింగ్ జరుగుతుందని భావించారు. అందుకు భిన్నంగా గతం కంటే కూడా పోలింగ్ శాతం తగ్గడం గమనార్హం. జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు, ఎస్పీ జె.ప్రభాకరరావులు చేపట్టిన చర్యలు ఫలితాన్నిచ్చాయి. చిన్నపాటి ఘటనలు మినహా దాదాపు జిల్లా అంతటా పోలింగ్ ప్రశాంతంగానే సాగింది.
 
మొరాయించిన ఈవీఎంలు
 
జిల్లాలో దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ పలు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. ఈవీఎంలను ముందుగానే పరిశీలించుకోండి, అవి పనిచేయలేదని పోలింగ్ ఆలస్యం కాకూడదని తొలినుంచీ కలెక్టర్ చెబుతున్నా ఫలితం లేకపోయింది. దీంతో అరగంట నుంచి రెండు గంటలపాటు పలుచోట్ల పోలింగ్ నిలిచిపోయింది. పట్టణ ఓటర్లు ఉదయం నుంచే బారులు తీరితే పల్లెల్లో మాత్రం క్రమంగా ఓటింగ్ పుంజుకుంది.

జిల్లా అంతటా ఫ్యాన్ గాలి ప్రభంజనం కనిపించింది. ఓటర్లు సెలైంట్ ఓటింగ్‌తో దుమ్ము దులిపేశారు. జగ్గయ్యపేటలో వైఎస్సార్‌సీపీ శ్రేణులపై టీడీపీ శ్రేణులు కవ్వింపు చర్యలకు దిగాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి వారిని చెదరగొట్టారు. అవనిగడ్డ నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు నిబంధనలను అతిక్రమించారు. పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటేయాలని ప్రచారం నిర్వహించారు. దీనిపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు, ఎన్నికల సిబ్బంది రంగంలోకి దిగి నిబంధనలు అతిక్రమిస్తున్న టీడీపీ శ్రేణుల్ని వారించారు.

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయి వైఎస్సార్‌సీపీ కేడర్‌పై దాడులు చేసి గాయాలపాలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు ఈసారి జాగ్రత్తలు తీసుకుని బందోబస్తు కట్టుదిట్టం చేయడంతో అవాంఛనీయ ఘటనలు జరగలేదు. ఎన్నికల్లో ఓటమి భయంతో టీడీపీ డబ్బు, మద్యం పెద్ద ఎత్తున పంచింది.
 
నియోజకవర్గాల వారీగా పోలింగ్ పదనిసలు ఇవీ...


మచిలీపట్నంలోని రాంజీ హైస్కూల్‌లో 122 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు సరిగా పనిచేయలేదు. పోలింగ్ అధికారులు ఫిర్యాదుతో టెక్నీషియన్ వచ్చి దాన్ని సరిచేశాడు. 23వ వార్డులో ఒక పార్టీకే ఓటేస్తే మరో పార్టీ గుర్తు వద్ద లైట్ వెలగడంతో ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడ ఈవీఎంను మార్పు చేశారు. 119వ పోలింగ్ స్టేషన్‌లో ఓటర్ స్లిప్ ఉన్నప్పటికీ ఒక వృద్ధురాలి ఓటును వేరొకరు వేయడంతో వివాదం రేగింది.
 
పెడన నియోజకవర్గంలో 45, 57, 185 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. వాటి స్థానంలో వేరే వాటిని పెట్టారు. గూడూరు మండలం గురిజేపల్లిలో ఇద్దరు వ్యక్తులు డబ్బు పంచుతుండగా వారి వద్ద నుంచి రూ.96 వేలు స్వాధీనం చేసుకున్నారు.
 
అవనిగడ్డ నియోజకవర్గంలో ఘంటసాల మండలం చిట్టూర్పు వద్ద ఈవీఎంలు మొరాయించడంతో గంట ఆలస్యంగా పోలింగ్ మొదలైంది. చల్లపల్లి మండలం రామానగరంలోని ఒక బూత్‌లో ఈవీఎం మొరాయించడంతో అప్పటి వరకు వేసిన ఓట్లు పోయాయని కంగారుపడ్డారు. తరువాత మరమ్మతు చేసి అప్పటి వరకు వేసిన ఓట్లు ఉన్నాయని ప్రకటించారు. నాగాయలంక మండలం భావదేవరపల్లి, నంగేగడ్డ, చోడవరం ప్రాంతంలో టీడీపీ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ వెంట వచ్చిన 50 మంది కార్యకర్తలు సైకిల్ గుర్తుకు ఓటేయాలని ప్రచారం నిర్వహించి హల్‌చల్ చేశారు.

కోడూరు మండలం ఐబీ పేటలో టీడీపీ నాయకులు బూత్‌లోకి వెళ్లి సైకిల్‌కు ఓటు వేయాలని ఓటర్లపై ఒత్తిడి చేశారు. దీంతో పోలింగ్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. పోలింగ్ కేంద్రాల సమీపంలోనే టీడీపీ కేడర్ స్లిప్పులు, మద్యం పంపిణీ చేశారు. దీంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు తహశీల్దార్ టీఆర్ రాజేశ్వరరావుకు ఫిర్యాదు చేయడంతో ఆయన పోలీసులతో వచ్చి టీడీపీ వాళ్లను పంపించి వేశారు.

నాగాయలంకలో సజ్జా గోపాలకృష్ణ, తలశిల సత్యనారాయణ నేరుగా 198, 199 పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లి ‘మన గుర్తు తెలుసుగా.. గట్టిగా గుద్దండి’ అంటూ ప్రచారం నిర్వహించారు. అధికారులు సైతం అడ్డు చెప్పలేదు. నాగాయలంక మండలం టి.కొత్తపాలెంలో పోలింగ్ బూత్ వద్దే టీడీపీ నాయకులు డబ్బు పంచారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు.
 
పెనమలూరు నియోజకవర్గంలో తొమ్మిది ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యమైంది. పలుచోట్ల సిబ్బందికి ఈవీఎంలను సెట్ చేయడం రాకపోవడంతో పోలింగ్ అరగంట ఆలస్యమైంది.
 
పామర్రు నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడంతో గంట ఆలస్యంగా పోలింగ్ మొదలైంది. టీడీపీ నేతలు నిమ్మకూరు గ్రామంలో డబ్బులు పంచడం వివాదాస్పదమైంది.
 
గుడివాడలో 90, 118 పోలింగ్ కేంద్రాల్లో, పెదపారుపూడి మండలంలో ఒకచోట ఈవీఎంలు మొరాయించాయి. టీడీపీ అభ్యర్థి తమ ప్రాంతంలో డబ్బులు ఇవ్వలేదని గుడివాడలో పార్టీ కార్యాలయం ముందు పలువురు ఓటర్లు ధర్నా చేశారు. పోలీసులు వచ్చి వారిని చెదరగొట్టారు.
 
గన్నవరంలో సావరిగూడెం, ముస్తాబాద, బీబీ గూడెంలో ఈవీఎంలు మొరాయించడంతో ఆలస్యంగా పోలింగ్ మొదలైంది. వాటి స్థానంలో వేరే ఈవీఎంలను ఏర్పాటు చేశారు. బుద్ధవరం గ్రామంలో పోలింగ్ బూత్ వద్ద  మహిళా సమాఖ్య అధ్యక్షురాలు టీడీపీకి ఓటేయాలని ప్రచారం చేయడంతో వైఎస్సార్‌సీపీ, సీపీఎం నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె అక్కడ్నుంచి వెళ్లిపోయింది. కేసరపల్లి వద్ద ఏ బటన్ నొక్కినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే ఓట్లు పడుతున్నాయంటూ టీడీపీ నేతలు హడావుడి చేసి ఆందోళన నిర్వహించారు. దీంతో జిల్లా అదనపు కలెక్టర్ చెన్నకేశవరావు, ట్రైనీ కలెక్టర్ కాళీచరణ్, రిటర్నింగ్ అధికారి ఎన్‌వీవీ సత్యనారాయణ వచ్చి ఆ ఈవీఎం సక్రమంగానే ఉందని నిర్ధారించారు. అయినా టీడీపీ వివాదం చేయడంతో దానిని మార్చి మరోటి ఏర్పాటు చేశారు.
 
నూజివీడు నియోజకవర్గంలో ఐదు ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ కొద్దిసేపు ఆలస్యమైంది. దీంతో వాటిని మార్పు చేసి వేరేవాటిని ఏర్పాటు చేశారు.
 
కైకలూరు హైస్కూల్‌లో రెండు సెంటర్లు, గుమ్మళ్లపాడు, వెలంపేటలో ఈవీఎంలు మొరాయించాయి.
 
తిరువూరు నియోజకవర్గంలో నాలుగు కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా మొదలైంది. వాటిని మార్పు చేసి వేరే వాటిని ఏర్పాటుచేశారు. బందోబస్తు సక్రమంగా లేకపోవడంతో ఇబ్బంది ఏర్పడింది.
 
మైలవరం నియోజకవర్గం తోలుకోడు గ్రామంలో టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నడుమ వివాదం రేగింది. పోలీసులు రంగంలోకి దిగడంతో వివాదం సద్దుమణిగింది. రెడ్డిగూడెంలో టీడీపీ కార్యకర్త దురుసుగా ప్రవర్తించడంతో కానిస్టేబుల్ చేయి చేసుకున్నారు. దీంతో టీడీపీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేశారు. చంద్రాలలో 39వ నంబర్ పోలింగ్ బూత్‌లో ఈవీఎం మొరాయిడంతో 20 నిమిషాలు పోలింగ్ ఆలస్యమైంది. రెడ్డిగూడెం మండలంలో రెండుచోట్ల, జి.కొండూరు మండలంలో ఒకచోట ఈవీఎంలు మొరాయించాయి.
 
నందిగామలో టీడీపీ కార్యకర్తలు డబ్బులు పంచుతుండగా లక్ష రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నియోజకవర్గంలో తొమ్మిది చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో వాటిని సరిచేయడంతో ఆలస్యంగా ఓటింగ్ జరిగింది.
 
జగ్గయ్యపేటలో కవ్వింపు చర్యలు...

జగ్గయ్యపేటలో టీడీపీ అభ్యర్థి శ్రీరాం తాతయ్య ఇంట్లో ఆ పార్టీ కార్యకర్తలు ఓటర్లకు డబ్బులు పంచేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి రావడంతో వారంతా చెల్లాచెదురయ్యారు. టీడీపీ నాయకుడు నూకల కుమార్‌రాజా పోలింగ్ కేంద్రం వద్ద డబ్బు పంచడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పట్టణంలోని పలు వార్డుల్లో టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. పోలీసులు లాఠీచార్జి చేసి వారిని చెదరగొట్టారు. జగ్గయ్యపేట మండలం రామచంద్రునిపేటలో టీడీపీకి చెందిన ఓ మహిళ రెండు దొంగ ఓట్లు వేయడానికి ప్రయత్నించడంతో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్‌సీపీ ఏజెంట్లపై దాడిచేసి కొట్టారు.

మరోచోట దొంగ ఓటు వేసే ప్రయత్నం చేసిన టీడీపీ కార్యకర్తను వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు పోలీసులకు పట్టించారు. షేర్‌మహ్మద్‌పేటలో ఈవీఎం మొరాయించడంతో రెండు గంటలు ఆలస్యంగా పోలింగ్ మొదలైంది. గవరవరంలో అరగంట పాటు ఈవీఎం మొరాయించింది. గురుకుల పాఠశాల, గండ్రాయిల్లో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాల్లో, వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాల్లోను ఈవీఎంలు మొరాయించాయి.
 
ఆసక్తి చూపని నగర ఓటరు
 
విజయవాడ నగరంలో ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు అంతగా ఆసక్తి చూపలేదు. దీంతో ఆ మూడు నియోజకవర్గాల్లోనూ తక్కువ శాతం పోలింగ్ నమోదైంది. తూర్పు నియోజకవర్గంలోని పటమట పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు రెండుసార్లు మొరాయించాయి. స్వల్ప ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వర్షంలోనూ ఓటర్లు ఓటేసేందుకు ముందుకొచ్చారు.

మధ్యాహ్నం అరగంటపాటు కురిసిన వర్షంతో కొద్దిసేపు అంతరాయం కలిగినా... ఆ తర్వాత ఓటేసేందుకు జనం క్యూకట్టారు. కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటువేసిన పలువురికి సార్వత్రిక ఎన్నికల్లో ఓటు దక్కకపోవడంతో లబోదిబోమన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు కొద్దిసేపు ఇబ్బందిపడ్డారు. గుణదల, సత్యనారాయణపురం ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడంతో కొద్దిసేపు ఆలస్యం జరిగింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement