- అందరికీ పాఠ్య పుస్తకాలందించాలి
- కొత్తయూనిఫాంలు పంపిణీ చేయాలి
- మౌలిక సౌకర్యాలు తప్పనిసరి
- అధికారులతో కలెక్టర్
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : పాఠశాలలు పునః ప్రారంభం నాటికే ప్రతి విద్యార్థికీ పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలతో పాటు పాఠశాలలు, వసతిగృహాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులు దృష్టి కేంద్రీకరించాలని కలెక్టర్ ఎం. రఘునందన్‌రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. సాంఘిక సంక్షేమ, విద్య, రాజీవ్ విద్యామిషన్, అనుబంధ శాఖల అధికారులతో బుధవారం కలెక్టర్ విజయవాడలో తన క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూన్ 12వ తేదీన జిల్లాలో అన్ని పాఠశాలలు పునః ప్రారంభం కానున్న దృష్ట్యా విద్యార్థులందరికీ పాఠ్య పుస్తకాలు, యూనిఫాంలు తప్పనిసరిగా అందించాలన్నారు. అదే రోజు ప్రతి విద్యార్థి కొత్త యూనిఫాం, పాఠ్యపుస్తకాలతో తరగతులకు హాజరయ్యేలా చూడవలసిన బాధ్యత అధికారులపై ఉందని చెప్పారు. అన్ని సబ్జక్టుల పాఠ్యపుస్తకాలు అందరికీ అందాలన్నారు.
ప్రతీ విద్యార్థికి రెండు జతల యూనిఫాంలు అందించాలన్నారు. మధ్యాహ్న భోజనం అందించేందుకు ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలని చెప్పారు. విద్యార్థుల డ్రాప్‌అవుట్‌లు లేకుండా చూడాలని, నూరు శాతం విద్యార్థులు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన కోరారు. ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులను విద్యాభివృద్ధికి ఖర్చుచేస్తున్నందున, అధికారులు చిత్తశుద్ధితో విధులను నిర్వర్తించాలని తెలిపారు.
మండల విద్యాశాఖాధికారులు వ్యక్తిగతంగా ప్రతి పాఠశాలకు వెళ్లి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫాంలు అందినదీ లేనిదీ తెలుసుకోవాలని చెప్పారు. సంక్షేమ వసతి గృహాలను పాఠశాలల పునః ప్రారంభానికి అన్ని సౌకర్యాలతో సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. అధికారులు వసతి గృహాలను పరిశీలించి తాగు నీరు, విద్యుత్,మరుగుదొడ్ల సదుపాయాల వంటి మౌలిక వసతులను పరిశీలించాలన్నారు. సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు డీ. మదుసూదనరావు, జిల్లా విద్యాశాఖాధికారి టీ. దేవానందరెడ్డి, రాజీవ్ విద్యామిషన్ పీడీ పద్మావతి, జిల్లా బీసీ సంక్షేమ శాఖాధికారి చినబాబు, తదితరులు పాల్గొన్నారు.
అమృత హస్తమందించండి...
ఇందిరమ్మ అమృత హస్తం పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు అన్ని అంగన్ వాడీ కేంద్రాల్లో గ్యాస్ కనెక్షన్లు ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎం. రఘునందన్‌రావు ఐసీడీఎస్ అధికారులను ఆదేశించారు. జిల్లా సమగ్ర శిశు అభివృద్ధి సంస్థ అమలు తీరుపై బుధవారం కలెక్టర్ నగరంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు, బాలింతలు పౌష్టికాహారాన్ని అందించే అమృత హస్తం పథకాన్ని ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకునేలా అధికారులు చూడాలన్నారు.
అంగన్‌వాడీ వర్కర్లు, సూపర్ వైజర్లు, సీడీపీవోలకు ర్యాంకింగ్ విధానం ద్వారా వారి ప్రతిభను నమోదు చేయాలని ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేసేవారికి ప్రతీ నెలా జీతాలందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఐసీడీఎస్ అధికారులను ఆదేశించారు. ఐ.సీ.డీ.ఎస్. ప్రాజెక్ట్ డైరక్టర్ కె. కృష్ణకుమారి, సీడీపీవోలు లలిత కుమారి, అంకమాంబ, జయలక్ష్మి, సంధ్య, స్వరూపరాణి, సూపర్ వైజర్లు పాల్గొన్నారు.