ష్.. గప్‌చుప్
- ఇక ప్రలోభాల వల
- జోరుగా నగదు, మద్యం పంపిణీ
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : ప్రాదేశిక ఎన్నికల తుది పోరులో ప్రచారం ముగిసింది. ప్రతిష్టాత్మకమైన జిల్లా పరిషత్ పీఠాన్ని దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. రెండో విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారానికి బుధవారం చివరిరోజు కావడంతో అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు.
నూజివీడు, గుడివాడ రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఈ నెల 11న ఎన్నికలు జరగనున్నాయి. నూజివీడు డివిజన్‌లో 14 జెడ్పీటీసీ, 234 ఎంపీటీసీ, గుడివాడ డివిజన్‌లో 9 జెడ్పీటీసీ, 129 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలను పకడ్భందీగా నిర్వహించేందుకు కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు, జెడ్పీ సీఈవో డి.సుదర్శనం నేతృత్వంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రలోభాలకు తెర తీశారు...
రెండో విడత ఎన్నికల ప్రచారం ముగియటంతో అభ్యర్థులు ప్రలోభాలకు తెర తీశారు. ఓటుకు రూ.300 నుంచి పోటీని బట్టి వెయ్యి వరకు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. బుధవారం రాత్రి నుంచే నగదు పంపిణీ కార్యక్రమం గుట్టు చప్పుడు కాకుండా చేస్తున్నారు. గుడివాడ, నూజివీడు డివిజన్లలో మద్యం పంపిణీ ఊపందుకుంది.
ఏర్పాట్లు పూర్తి...
రెండో విడత ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ ఎం రఘునందన్‌రావు తెలిపారు. 11న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఆయన చెప్పారు. రెండు డివిజన్లలో 9,36,252 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని తెలిపారు. 1230 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.
గుడివాడ డివిజన్‌లో 9 జెడ్పీటీసీ స్థానాలకు 27 మంది అభ్యర్థులు, 129 ఎంపీటీసీ స్థానాలకు 309 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు ఆయన చెప్పారు. నూజివీడు డివిజన్‌లోని 14 జెడ్పీటీసీ స్థానాలకు గాను 51 మంది అభ్యర్థులు, 234 ఎంపీటీసీ స్థానాలకు 610 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణలో లోపాలు తలెత్తితే సమాచారం తెలుసుకునేందుకు జిల్లా పరిషత్‌లో కంట్రోల్ రూమ్ ల్యాండ్ లైన్ 08672-252572, టోల్ ఫ్రీ నంబరు 1077కు తెలియజేయాలని సూచించారు.
11న నూజివీడు, గుడివాడ డివిజన్లలోని సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాల్లో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జె.ప్రభాకరరావు తెలిపారు. ఏఎస్పీతో పాటు ఎనిమిది మంది డీఎస్పీలు, 25 మంది సీఐలు, 110 మంది ఎస్సైలు, 275 మంది ఏఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్లు, 1050 మంది కానిస్టేబుళ్లు, 700 మంది హోంగార్డులు, రెండు ప్లటూన్ల ఏఆర్, ఏపీఎస్పీ బృందాలతో పాటు అటవీశాఖ, ఎక్సైజ్, స్పెషల్ ఫోర్స్ సిబ్బందిని ఎన్నికల్లో విధుల్లో నియమించినట్లు చెప్పారు.