తొలి విడత...ప్రచారానికి తెర | The first phase of the campaign on ... | Sakshi
Sakshi News home page

తొలి విడత...ప్రచారానికి తెర

Published Sat, Apr 5 2014 2:01 AM | Last Updated on Sat, Sep 2 2017 5:35 AM

తొలి విడత...ప్రచారానికి  తెర

తొలి విడత...ప్రచారానికి తెర

  • పరిషత్ పోరు
  •  6న మొదటి విడత పోలింగ్
  •  విజయవాడ, మచిలీపట్నం డివిజన్లలో నిర్వహణ
  •  26 జెడ్పీటీసీ స్థానాలకు 99 మంది పోటీ
  •  450 ఎంపీటీసీలకు బరిలో 1,187 మంది
  •  పోలింగ్ కేంద్రాలు 1,437
  •  నేడు సిబ్బందికి ఎన్నికల సామగ్రి అప్పగింత
  •  మచిలీపట్నం, న్యూస్‌లైన్ : ప్రాదేశిక ఎన్నికల మొదటి విడత ప్రచారానికి శుక్రవారంతో తెరపడింది. విజయవాడ, మచిలీపట్నం రెవెన్యూ డివిజన్లలోని 26 జెడ్పీటీసీ, 450 ఎంపీటీసీ స్థానాలకు ఈ నెల ఆరో తేదీన ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జెడ్పీ సీఈవో, స్థానిక సంస్థల ఎన్నికల రిటర్నింగ్ అధికారి డి.సుదర్శనం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. గత నెల 24తో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన అనంతరం మొదటి విడత ఎన్నికలు జరిగే మచిలీపట్నం, విజయవాడ డివిజన్లలో జెడ్పీటీసీ స్థానాలకు 99 మంది, ఎంపీటీసీ స్థానాలకు 1,187 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో అధికంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది.
     
    విస్తృత ప్రచారం...


    గత 11 రోజులుగా మొదటి విడత ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు విస్తృత ప్రచారం నిర్వహించారు. మొదటి విడత ఎన్నికలు జరిగే మండలాల్లో ప్రచారానికి చివరిరోజైన శుక్రవారం అభ్యర్థులు, వారి తరఫున నాయకులు పోటాపోటీగా పర్యటించారు.
     
    బ్యాలెట్ బాక్సుల్లోనే...
     
    జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు బ్యాలెట్ పత్రాల ద్వారానే నిర్వహించనున్నారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి ఆయా మండల పరిషత్ కార్యాలయాల వద్ద ఎన్నికల అధికారులు, సిబ్బందికి సామగ్రిని అప్పగించేందుకు ఏర్పాట్లు చేశారు. వైఎస్సార్ సీపీ జెడ్పీ చైర్‌పర్సన్ అభ్యర్థి తాతినేని పద్మావతి పోటీలో ఉన్న తోట్లవల్లూరు జెడ్పీటీసీ స్థానానికి మొదటి విడతలోనే ఎన్నికలు జరగనున్నాయి. రెండు డివిజన్లలోని 26 మండలాల్లో 11,56,122 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొదటి విడత ఎన్నికలు జరిగే విజయవాడ డివిజన్‌లో 10, మచిలీపట్నం డివిజన్‌లో 4 ఎంపీటీసీ స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి.
     
    1,437 కేంద్రాల్లో పోలింగ్...
     
    మచిలీపట్నం రెవెన్యూ డివిజన్‌లోని 12 జెడ్పీటీసీ స్థానాలకు, 157 ఎంపీటీసీ స్థానాలకు, విజయవాడ రెవెన్యూ డివిజన్‌లోని 14 జెడ్పీటీసీ స్థానాలకు, 293 ఎంపీటీసీ స్థానాలకు ఆదివారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 1,437 పోలింగ్ కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. 42 అతి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని తెలుసుకునేందుకు చర్యలు తీసుకున్నారు. 26 మంది మైక్రో అబ్జర్వర్లు ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిని పరిశీలించనున్నారు. ఒక్కొక్క పోలింగ్ స్టేషన్‌కు ప్రిసైడింగ్ అధికారి, సహాయ ప్రిసైడింగ్ అధికారితో పాటు మరో ముగ్గురిని నియమించారు. మొత్తం 7,185 మంది సిబ్బందితో పాటు మరికొంతమందిని రిజర్వులో ఉంచారు.
     
    పటిష్ట బందోబస్తు...

     
    మొదటి విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ జె.ప్రభాకరరావు, ఏఎస్పీ బీడీవీ సాగర్ నేతృత్వంలో బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుని ఎన్నికలు నిలిచిపోతే ఈ నెల ఏడో తేదీన రీపోలింగ్ నిర్వహిస్తామని అధికారులు చెబుతున్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన అనంతరం మండల కేంద్రంలో బ్యాలెట్ బాక్సులు స్వాధీనం చేసుకుని అక్కడి నుంచి ఆయా డివిజన్ కేంద్రాలకు తరలించి స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరుస్తారు.
     
    నగదు, మద్యం జోరు...
     
    ఎన్నికల ప్రచారం ముగియటంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ఆయా గ్రామాల్లో మద్యం పంపిణీని ప్రారంభించారు. పోటీ తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా ఓటుకు వెయ్యి నుంచి రూ.3 వేల వరకు పంపిణీ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఎంపీపీ స్థానం ఆశిస్తున్న అభ్యర్థులు పోటీ చేసే స్థానాల్లో ఓటుకు రూ.3 వేలు వరకు పలుకుతోంది. ఐదారు ఓట్లు ఉన్న కుటుంబంలో వారు నగదు తీసుకోరని భావిస్తే గృహోపయోగమైన వస్తువులను అందిస్తున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా గ్రామాల్లో మద్యం పరవళ్లు తొక్కుతోంది. పురపాలక సంఘ ఎన్నికల అనంతరం చెక్‌పోస్టులలో నిఘా తగ్గించటంతో ఎలాంటి ఆటంకం లేకుండానే మద్యం, నగదు గ్రామాలకు చేరిపోతోంది.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement