రేపే ‘స్థానిక’ ఫలితాలు
చిత్తూరు (అర్బన్), న్యూస్‌లైన్: స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వెలువడడానికి ఇక 24 గంటలు మాత్రమే ఉంది. అభ్యర్థుల భవితవ్యం మంగళవారం తేలనుంది. జిల్లాలోని 65 జెడ్పీటీసీ స్థానాలకు 266 మంది, 887 ఎంపీటీసీ స్థానాలకు 2414 మంది పోటీ పడ్డారు. ఫలితాలపై అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది.
ఫలితాలు రాత్రికే..
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల బ్యాలెట్ పత్రాలను లెక్కించడానికి జిల్లా వ్యాప్తంగా ఆరు కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే బ్యాలెట్ పత్రాల లెక్కింపునకు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. అయినప్పటికీ ఒక్కో మండలం కౌంటింగ్ పూర్తవుతుండగానే ఎంపీటీసీ, జెడ్పీటీసీలుగా గెలుపొందిన వారికి అప్పటికప్పుడే ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించుకున్నారు. ఈసారి ఎంపీటీసీ, జెడ్పీటీసీ బ్యాలెట్ పత్రాలను ఒకేసారి లెక్కించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. దీంతో మొత్తం కౌంటింగ్ ప్రక్రియ పూర్తవడానికి రాత్రి 10 గంటలు దాటుతుందని అధికారులు భావిస్తున్నారు.
వైఎస్సార్‌సీపీ ధీమా
జెడ్పీ పీఠం కచ్చితంగా తమకే దక్కుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధీమాతో ఉంది. మహానేత డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, రుణమాఫీ, వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డిపై కాంగ్రెస్, టీడీపీ కలిసి చేసిన కుట్రలు ఆ పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కకుండా చేస్తాయని వైఎస్సార్ సీపీ నేతలు చెబుతున్నారు. దీనికితోడు టీడీపీకి 13 మండలాల్లో రెబల్స్ బెడద ఉండటం, చంద్రబాబు గత పాలన వద్దంటూ రైతులే బహిరంగంగా చెప్పడంతో ఆ పార్టీ నేతలకు ఎన్నికల ఫలితాలపై దిగులు పట్టుకుంది. అయినప్పటికీ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ మెజారిటీ స్థానాలు తమకే వస్తాయంటూ చెప్పుకుంటున్నారు. మొత్తం మీద ఓటర్లు చెప్పిన తీర్పు బహిరంగం కావడానికి మరికొన్ని గంటలు ఆగాల్సిందే.