- ఓటరు మారాజుకు మహద్భాగ్యం
- బిందెలు, చీరలు, స్టీలు క్యాన్లు పంపిణీ
- తాగినోడికి తాగినంత...మస్తుగా బిర్యానీ
- పల్లెల్లో పండగ వాతావరణం
నర్సీపట్నం టౌన్, న్యూస్‌లైన్: ‘ఒరేయ్...మా సిమాచలం బావొచ్చాడు...కూకోబెట్టి బిర్యానీ పెట్టండ్రా...ఏటి గంగక్కా ఈ మద్దిన కనబడ్నేదు......మా మేన కోడలు బాగా సదువుతందా ? ఇదా ఈ స్టీలు బిందె, చీర ఉంచు...వచ్చేవారం జరిగే ఎలచ్చన్లలో ఈ తమ్ముడికి ఓటెయ్యడం మర్సిపోకు సుమీ...’ పల్లెల్లో ఎక్కడ చూసినా ఇదే సందడి...సంక్రాంతి, శివరాత్రి, ఉగాది పండగలు ముగిశాక వస్తున్న ఈ ఓట్ల పండక్కి నేతలు సిద్ధమై, ప్రజల్నీ సంసిద్ధుల్ని చేస్తున్నారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి అన్ని పార్టీలూ శక్తియుక్తులు ధారపోస్తున్నాయి. గతంలో వేలల్లో అయ్యే ఖర్చు ఇప్పుడు లక్షలు దాటింది. అప్పట్లో జాకెట్ ముక్క ఇస్తే గొప్ప...మరిప్పుడు ఖరీదైన చీర, ఇంకా స్టీలు బిందెలు ఇవ్వాల్సిందే. దీంతోబాటు విచ్చలవిడిగా తాగినోడికి తాగినంత మద్యం. తిన్నోడికి తిన్నంత బిర్యానీ...రోజూ రాత్రిళ్లు విందు సమావేశాలతో పల్లెల్లో ఒకటే సందడి నెలకొంది.
నర్సీపట్నంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు పోటీచేస్తున్న అభ్యర్థులు పోలింగ్‌కు సమయం దగ్గరపడుతుండడంతో ఓటర్లను తమకు తోచిన స్థాయిలో ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. గతంలో ఎంపీటీసీగా అభ్యర్థికి రూ.20-30 వేలు ఖర్చయ్యేది. ఇప్పుడది కొన్నిచోట్ల రూ.2-5లక్షలకు చేరింది. గత ఎన్నికల్లో మహిళలను అకట్టుకునేందుకు జాకెట్ ముక్కలు ఇచ్చే వారు. పురపాలక ఎన్నికల్లో ఈ పరిస్థితి మారింది.
జాకెట్ ముక్కలకు బదులు చీరలను ఇవ్వడంతో పాటు గాజుల ఖర్చు నిమిత్తం మరో రెండొందలు ఇస్తున్నారు. పరిషత్ ఎన్నికలు గ్రామాలకు పరిమితం కావడంతో మహిళలు, రైతులను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు వినూత్న ప్రలోభ పథకాలు అమలు చేస్తున్నారు.
రైతులు పాలు కేంద్రానికి తీసుకువెళ్లడానికి వీలుగా పాల క్యాన్‌లు, ఇళ్లలో వినియోగానికిగాను స్టీల్ క్యాన్లు ఇస్తున్నారు. పలు గ్రామాల్లో అయితే ఇరు పార్టీల అభ్యర్థులు ఒకరు మీద ఒకరు ఫిర్యాదు చేసుకోకుండా ఈ సరుకులు పంపిణీ చేసుకుందామని, ఓటరుకు ఎవరు ఇష్టమైతే వారికే ఓటు వేస్తారని ఒప్పందానికి వచ్చారు. ఇక మద్యం పంపిణీకి హద్దులేదు.