అక్టోబర్ నుంచి పింఛన్ పెంపు
- కలెక్టర్ రఘునందన్‌రావు
విజయవాడ సిటీ : అక్టోబర్ నుంచి ఫించన్ సొమ్ము పెరుగుతున్నందున సామాజిక భద్రతా పింఛన్ డేటాను ఆధార్‌తో అనుసంధానం చేసే ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని కలెక్టర్ ఎం. రఘునందన్‌రావు మండల అభివృద్ధి అధికారులను ఆదేశించారు. ఆధార్ అనుసంధానంపై బుధవారం ఆయన నగరంలోని సబ్-కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పింఛన్‌దారుల వివరాలను ఆధార్ వివరాలతో అనుసంధానాన్ని నూరుశాతం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సామాజిక భద్రతా పింఛను కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని చెప్పారు. ఎంపీడీవోలు తక్షణమే స్పందించాలని సూచించారు. వచ్చే అక్టోబర్ 2వ తేదీ నుంచి వృద్ధులు, వితంతువులకు రూ.200 నుంచి రూ. 1000, వికలాంగులకు రూ. 1000నుంచి రూ. 1500 వరకు పెరిగిందన్నారు.
జిల్లాలో 3,13,026 మంది పింఛను దారులున్నారని వీరిలో ఇప్పటి వరకు 2,10,424 మంది పింఛనుదారులు ఆధార్ అనుసంధానం చేయించుకోగా, 25,264 మంది ఎన్‌రోల్‌మెంట్ అనుసంధానం చేశారని చెప్పారు. మిగిలిన 77,340 మంది ఫించనుదారుల ఆధార్ అనుసంధాన ప్రక్రియను ఈ మాసాంతానికి పూర్తిచేయాలని ఎంపీడీవోలకు కలెక్టర్ సూచించారు
తీరప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలి...
ఆధిక వర్షాలు, తుఫానులు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించే అవకాశాలున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యంగా పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో బెల్టుషాపులను అరికట్టాలన్నారు. జేసీ జె. ముర ళీ డీఆర్‌డీఏ పీడీ జనీకాంతారావు, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ సృజన పాల్గొన్నారు.