సాక్షి, విజయవాడ: ఈనాడు లాంటి పత్రిక ఇటువంటి వార్తలు రాయడం బాధాకరమని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పెన్షన్ దారులకు పెన్షన్ కష్టాలని ఈనాడులో వచ్చిన వార్తలు అవాస్తవమని తెలిపారు. ఈనాడుతో పాటు మరో పత్రిక కూడా 5వ తేదీ వరకు జీతాలు రావడం లేదని రాసింది.. కానీ ఉద్యోగుల జీతాలు 3వ తేదీనే వచ్చాయని వెల్లడించారు. తప్పుడు వార్తలు రాయడాన్ని వారి విజ్ఙతకే వదిలేస్తున్నామన్నారు. ఉద్యోగులను, పెన్షన్ దారులను కొన్ని పత్రికలు తప్పు తోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు. కొన్ని పత్రికలు తప్పుడు వార్తలు రాసి ప్రజల్లో చులకన కావద్దని సూచించారు. 3 లక్షల 70 వేల మంది పింఛన్ దారుల్లో చాలామందికి పెన్షన్ వచ్చిందని, చిన్న చిన్న సాంకేతిక సమస్యలు వల్ల కొంతమందికి ఒకటి రెండు రోజులు ఆలస్యమైందన్నారు. దానిని పట్టుకుని పెన్షన్ దారులకు పెన్షన్ కష్టాలంటూ ఈనాడు తప్పడు వార్తలు రాయడం సరైనది కాదని ఆయన మండిపడ్డారు.
ఉద్యోగులకు, ప్రభుత్వానికి మద్య దూరం పెంచాలన్న ఉద్దేశంతోనే కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. అయితే ఉద్యోగులలో విశ్రాంత ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ఇచ్చిన ఘనత సీఎం జగన్‌మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఇళ్ల స్థలాలు లేని విశ్రాంత ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఉద్యోగులకు అడగకుండానే అన్ని సౌకర్యాలను సీఎం జగన్ కల్పిస్తున్నారన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా జీతాలు అందరికి వస్తున్నాయని ఆయన వెల్లడించారు. ఏపీ జేఎసీ ప్రధాన కార్యదర్శి వైవీ రావు మాట్లాడుతూ.. విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్ కష్టమని ఈనాడులో వచ్చిన వార్తను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈనాడులో వచ్చిన వార్త అవాస్తవమని, విశ్రాంత ఉద్యోగులలో చాలా మందికి పెన్షన్ వచ్చిందన్నారు. జీతాలు, పెన్షన్ విషయంలో పత్రికలు విజ్ఞత పాటించి వార్తలు రాయాలని సూచించారు.
సీఎం వైఎస్ జగన్ ఉద్యోగుల పక్షపాతి అని వాస్తవాలను ఉద్యోగులు, పెన్షన్ దారులు గ్రహించాలని ఆయన అన్నారు. ప్రభుత్వంపై కొన్ని పత్రికలు తప్పుడు వార్తలు రాస్తున్నాయని, ఇటు వంటి వార్తలను తాము ఖండిస్తున్నామని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి జి. జయబాబు మాట్లాడుతూ... 3 లక్షల 70 వేల మంది పెన్షన్ దారులు ఉన్నారని వాళ్లకు పెన్షన్ కష్టమని ఈనాడులో వార్త రాశారన్నారు. ఈనాడులో రాసిన వార్తను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇప్పటికే చాలా మంది విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్ వచ్చిందని పేర్కొన్నారు. ఉద్యోగులను,పెన్షన్ దారులను తప్పు తోవ పట్టించే విధంగా వార్తలు రాయడం మంచి పద్ధతి కాదని ఆయన వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment