- పండుగలను సంతోషంగా జరుపుకోవాలి
- ప్రతి కాగితానికీ పరిష్కారం
- జన్మభూమి సభలో సీఎం చంద్రబాబు
సాక్షి, విజయవాడ బ్యూరో : ‘ఎన్నికలకు ముందు జరిపిన పాదయాత్రలో ఎముకల గూడుతో కనిపించిన ఎంతో మంది నిరుపేద వృద్ధులను కలిశాను. వారిని చూసి నా మనసు చలించిపోయింది. ఆనాడే పింఛన్ల విషయంలో నిర్ణయం తీసుకున్నా. జ్వరమొస్తే మందు బిళ్లలు కొనలేని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేదలకు రూ.200 పింఛను ఏం సరిపోతుంది? అందుకే దాన్ని రూ.1000 చేశా.
అదే విధంగా వికలాంగుల పింఛనును రూ.500 నుంచి రూ.1500 చేశా. ఒక్కొక్కరికీ ఐదు రెట్లు పెంచి పింఛన్లు ఇవ్వడానికి మా ప్రభుత్వం నిర్ణయించింది. దాని పేరే ‘ఎన్టీఆర్ భరోసా’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. మహాత్ముని సాక్షిగా పెంచిన పింఛన్లను గురువారం నుంచి పంపిణీ ప్రారంభించామని ఆయన చెప్పారు. విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య స్టేడియం మైదానంలో గురువారం మధ్యాహ్నం ‘జన్మభూమి- మా వూరు’ కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించారు.
సభలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో కలిసి చంద్రబాబు పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. దసరా, దీపావళి పండగలను సంతోషంగా జరుపుకుంటారన్న ముందస్తు ఆలోచనతోనే అక్టోబరు 2 నుంచి భరోసా పింఛన్ల పంపిణీని ప్రారంభించామన్నారు. అయితే అనర్హులకు మాత్రం పింఛన్లు ఇవ్వలేమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మగవారికి కూడా వితంతు పింఛన్లు పంపిణీ చేశారంటే ఎంత ఘోరమో ఆలోచించాలన్నారు. ప్రజలిచ్చిన ప్రతి కాగితానికీ రాబోయే రోజుల్లో పరిష్కారం లభిస్తుందన్నారు.
వాహనాలన్నింటికీ సీఎన్‌జీ...
విజయవాడలోని వాహనాలన్నింటికీ సీఎన్‌జీ (గ్యాస్) అందించే దిశగా ఏర్పాట్లు చేస్తామని చంద్రబాబు నాయుడు చెప్పారు. అన్ని వాహనాలకూ సీఎన్‌జీ అందించి కాలుష్య నివారణకు కృషి చేస్తామన్నారు. ప్రతి ఇంటికి ఆఫ్టిక్ కేబుల్ కనెక్షన్ ఇవ్వడం ద్వారా మహిళలు వంటలు నేర్చుకోవడం నుంచి విద్యార్థులు పాఠాలు, వృత్తి పని వారు వృత్తిలో మెళకువలు నేర్చుకునే ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పారు.
రాబోయే రోజుల్లో ఇళ్లకు, పరిశ్రమలకు 24 గంటలు, వ్యవసాయానికి 9 గంటలు విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. విద్యుత్ ఆదా చేయడం కోసం రూ 10కే ఎల్‌ఈడీ బల్పులు అందించే పథకం ప్రారంభించామనీ, పేదలకు ప్రభుత్వం ఈ బల్పులు అందిస్తుందనీ, డబ్బున్న వారు వారే కొనుక్కోవాలని కోరారు. ఈ బల్పులు వాడటం వల్ల విద్యుత్ వినియోగం బాగా తగ్గి రాష్ట్రంలో విద్యుత్ ఆదా అవుతుందని ఆయన చెప్పారు.
ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం ...
సీఎం చంద్రబాబు సుధీర్ఘ ప్రసంగం ద్వారా ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ప్రసంగం ముగిశాక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆసక్తికరంగా నిర్వహించారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పింఛన్లు పంపి ణీ చేసే క్రమంలో వారిని పేరుపేరునా పలకరించడం, ఏం చేస్తుంటారో తెల్సుకోవడం, పెరిగిన పింఛను తీసుకోవడంలో ఎలా ఫీలవుతున్నారని వారిని ప్రశ్నిస్తూ ఒక దశలో టీవీ రిపోర్టర్ మాదిరిగా మారిపోయారు.
వారు చెప్పినవనీ విన్న తర్వాత వారి గురించి క్లుప్తంగా ప్రజలకు వివరించి, ఇలాంటి వారికోసమే తాను పనిచేస్తుందని చె ప్పుకున్నారు.. కార్యక్రమం కోసం లక్షలరూపాయలు ఖర్చు చేసిన నిర్వాహకులు ఎక్కడ కూడా ఫ్యాన్లు ఏర్పాటు చేయకపోవడంతో అటు వేదికపై అతిథులు, ఇటు అధికారులు, మీడియా, మహిళలందరూ కార్యక్రమం ముగిసే వరకూ పేపర్లతో విసురుకుంటూనే గడిపారు.
ప్రసంగించినంత సేపూ చంద్రబాబు కూడా కర్ఛీఫ్‌తో తుడుచుకుంటూనే ఉన్నారు. మంత్రులు దేవినేని ఉమా, కామినేని శ్రీనివాస్, ఎంపీలు కొనకళ్ల నారాయణ, కేశినేని నాని, సుజనాచౌదరి, ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, వల్లభనేని వంశీ, గద్దె రామ్మెహన్, బోడే ప్రసాద్, మేయర్ కోనేరు శ్రీధర్, ప్రభుత్వ ప్రథాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, కలెక్టర్ రఘునందన్‌రావు పాల్గొన్నారు.